వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ 30

World Wide Web celebrates its thirtieth anniversary - Sakshi

జెనీవా: వరల్డ్‌ వైడ్‌ వెబ్‌(www)కు 30 ఏళ్లు నిండాయి. 1989 మార్చి 12న టిమ్‌ బెర్నర్స్‌లీ దీనిని కనుగొన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ ద్వేషపూరిత ప్రసంగాలు, వ్యక్తిగత గోప్యత ఆందోళనలు, ప్రభుత్వాలే చేయిస్తున్న హ్యాకింగ్‌లు తదితర సమస్యలతో వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ ప్రస్తుత కాలంలో ఎంతో నొప్పిని, బాధను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కోరుకున్న వెబ్‌ ఇది కాదని అన్నారు. వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ను కనిపెట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో సెర్న్‌ కార్యాలయంలో వేడుకల్లో  టిమ్‌ మాట్లాడారు. మానవాళి కోసం వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ను ఉన్నతంగా మార్చాలని పిలుపునిచ్చారు. ‘నా ఆవిష్కరణ సాంకేతిక విప్లవానికి దారి తీసింది. ప్రజల జీవితాలను ఎంతగానో మార్చేసింది.

వారు వస్తువులు కొనే, ఆలోచనలను పంచుకునే, సమాచారాన్ని పొందే పద్ధతులను మార్చేసింది. మరెన్నో అద్భుతాలను చేసింది. అదే ఆవిష్కరణతో కొందరు దుండగులు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. కొన్ని దేశాల ప్రభుత్వాలు తమ ప్రత్యర్థి దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. ద్వేషపూరిత, నీచ ప్రసంగాలు పెరిగిపోయాయి. అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులు కలిసి మంచి ఆలోచనలు చేయాలన్న మూలాల నుంచి ఇలాంటి దుస్సంఘటనలన్నీ వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ను చాలా దూరం చెడుదారిలో తీసుకెళ్తున్నాయి’ అని టిమ్‌ వాపోయారు. ప్రస్తుతం ప్రపంచంలో సగం మందికి ఇంటర్నెట్‌ వినియోగం అందుబాటులోకి వచ్చిందనీ, కానీ ఇది మనం కోరుకున్న వెబ్‌ కాదనే భావన చాలా మందిలో ఉందని టిమ్‌ అన్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top