breaking news
Tim Berners Lee
-
వరల్డ్ వైడ్ వెబ్ 30
జెనీవా: వరల్డ్ వైడ్ వెబ్(www)కు 30 ఏళ్లు నిండాయి. 1989 మార్చి 12న టిమ్ బెర్నర్స్‌లీ దీనిని కనుగొన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ ద్వేషపూరిత ప్రసంగాలు, వ్యక్తిగత గోప్యత ఆందోళనలు, ప్రభుత్వాలే చేయిస్తున్న హ్యాకింగ్లు తదితర సమస్యలతో వరల్డ్ వైడ్ వెబ్ ప్రస్తుత కాలంలో ఎంతో నొప్పిని, బాధను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కోరుకున్న వెబ్ ఇది కాదని అన్నారు. వరల్డ్ వైడ్ వెబ్‌ను కనిపెట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో సెర్న్ కార్యాలయంలో వేడుకల్లో టిమ్ మాట్లాడారు. మానవాళి కోసం వరల్డ్ వైడ్ వెబ్‌ను ఉన్నతంగా మార్చాలని పిలుపునిచ్చారు. ‘నా ఆవిష్కరణ సాంకేతిక విప్లవానికి దారి తీసింది. ప్రజల జీవితాలను ఎంతగానో మార్చేసింది. వారు వస్తువులు కొనే, ఆలోచనలను పంచుకునే, సమాచారాన్ని పొందే పద్ధతులను మార్చేసింది. మరెన్నో అద్భుతాలను చేసింది. అదే ఆవిష్కరణతో కొందరు దుండగులు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. కొన్ని దేశాల ప్రభుత్వాలు తమ ప్రత్యర్థి దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. ద్వేషపూరిత, నీచ ప్రసంగాలు పెరిగిపోయాయి. అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులు కలిసి మంచి ఆలోచనలు చేయాలన్న మూలాల నుంచి ఇలాంటి దుస్సంఘటనలన్నీ వరల్డ్ వైడ్ వెబ్‌ను చాలా దూరం చెడుదారిలో తీసుకెళ్తున్నాయి’ అని టిమ్ వాపోయారు. ప్రస్తుతం ప్రపంచంలో సగం మందికి ఇంటర్నెట్ వినియోగం అందుబాటులోకి వచ్చిందనీ, కానీ ఇది మనం కోరుకున్న వెబ్ కాదనే భావన చాలా మందిలో ఉందని టిమ్ అన్నారు. -
www @ 25
మనిషి జీవితాన్ని ఇంటర్నెట్ అమాంతం మార్చేసింది. అవసరం రీత్యాగానీ, కాలక్షేపానికి గానీ ఒక్కసారి నెట్‌కు అలవాటుపడితే వారికి నెట్ లేకుండా రోజు గడవటం కష్టమవుతోంది. ఇలాంటి నెట్‌కు ఆధారభూతం వరల్డ్ వైడ్ వెబ్. దీన్నే క్లుప్తంగా డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు(WWW) అని పిలుస్తాం. రాసుకుంటాం. ఈ మూడు అక్షరాలు ఎంతో మంది జీవితాలను మార్చాయి. ప్రపంచంలోని అద్భుతాలన్నింటిని నెట్టింట్లోకి తెచ్చాయి. ఏదైనా ఒక వెబ్ పేజీలోకి వెళ్లే ముందు మొదట మనం www అని టైప్ చేస్తాం. ఈ మూడు అక్షరాలు లేకపోతే మనం ఏ వెబ్సైట్లోకి వెళ్లలేం. ఇంటర్నెట్కు ముఖద్వారం లాంటి wwwకు ఈ నెల 12కు పాతికేళ్లు నిండాయి. ఇంటర్నెట్లో ప్రస్తుతం ఒక వెబ్ బ్రౌజర్ నుంచే అనేక వెబ్‌పేజీలు మనం చూడగలుగుతున్నాం. దీనంతటికీ ఇంటర్నెట్ కారణమైనా, దాని వెనక వరల్డ్ వైడ్ వెబ్ చేరడం వల్లే ఆన్లైన్ ప్రపంచం ఇంతగా సులభ సాధ్యమైంది. ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్.. ఈ రెండూ ఒకటేనని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ రెండింటికి ఎంతో తేడా ఉంది. ఇంటర్నెట్ అనేది అనేక పర్యాటక ప్రాంతాల సముదాయమైతే, వరల్డ్‌వైడ్ వెబ్ అనేది వాటి మధ్య ట్రావెల్స్ కంపెనీ లాంటిది. ఇంటర్నెట్ ఎప్పుడో 1969లోనే మొగ్గ తొడిగింది. కంప్యూటర్ల మధ్య డేటాను ఇచ్చిపుచ్చుకునే ఉద్దేశంతో ఇంటర్నెట్ను అమెరికా ప్రభుత్వం డెవలప్ చేసింది. ఇంటర్నెట్ పుట్టిన 30 ఏళ్ల తర్వాత అంటే 1989లో వరల్డ్ వైడ్ వెబ్ ఆవిర్భవించింది. బ్రిటిష్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్ లీ wwwను ఆవిష్కరించారు. ఈయన సెర్న్ అనే యూరోపియన్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్లో కంప్యూటర్ సైంటిస్టుగా పని చేసే వారు. 1989 మార్చి 12న ఈయన ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ప్రతిపాదించారు. అదే ఏడాది నవంబరు కల్లా తన ప్రతిపాదనను అమల్లోకి తెచ్చారు. హైపర్‌టెక్ట్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్-http క్లయింట్, సర్వర్ మధ్య విజయవంతంగా కమ్యూనికేషన్ నెలకొల్పారు. ఇదే ఆ తర్వాత వరల్డ్‌వైడ్ వెబ్‌గా మారింది. ఇదే క్లుప్తంగా www చరిత్ర. వరల్డ్ వైడ్ వెబ్ ఆవిష్కరణతో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ఈమెయిళ్లు పంపడం - వీడియోలు చూడటం - ఛాటింగ్ చేసుకోవడం.... ఇలా ఎన్నో రకాల పనులు మనం ఈ www ద్వారానే చేసుకుంటున్నాం. రోజు రోజుకు మనం ఇంటర్నెట్ మీద ఆధారపడటం పెరుగుతోంది. దాదాపు 240 కోట్ల మంది ప్రజలు ఈవాళ ఇంటర్నెట్ను వాడుతున్నారు. వరల్డ్‌వైడ్ వెబ్‌ను నిర్మించిన తర్వాత వచ్చిన మొట్ట మొదటి వెబ్సైట్ http స్లాష్ info.సెర్న్.ch. ఈరోజు ఇంటర్నెట్లో కొన్ని లక్షల వెబ్ సైట్లు ఉన్నాయి. మంచికి, చెడుకు కూడా ఈ సైట్లు ఉపయోగపడుతున్నాయి. ఇంటర్నెట్లో కొన్ని లక్షల వెబ్సైట్లు ఉన్నప్పటికీ వాటిలో యుట్యూబ్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. ఖండ ఖండాల్లో ఉన్న వండర్స్‌ను ఈ సైట్ మన కళ్ల ముందు ఆవిష్కరిస్తోంది. కొన్ని దృశ్యాలను చూస్తూ కన్నార్పలేం. గుండె దడ పుడుతుంది. వామ్మో అనిపిస్తుంది. అంతలోనే వావ్ అనిపిస్తుంది. తెలియకుండానే చప్పట్లు కొట్టేస్తాం. www.యుట్యూబ్.కామ్ ఇలాంటి వేల వీడియోలను మన ముందు ఆవిష్కరిస్తోంది. అవతార్ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఉన్న దృశ్యాలు చైనాలోని జాంగ్జియాజి నేషనల్ పార్కులో ఉన్నాయి. వాటిని యుట్యూబ్ మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. ఈ పార్కులో కొండలు నిర్మితమైన తీరు చూస్తే రెప్ప వాల్చాలనిపించదు. ఎన్నో తీపి గుర్తుల్ని నెట్లో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకునే అవకాశం మనకు వరల్డ్ వైడ్ వెబ్ కల్పించింది. సువిశాలమైన ఈ ప్రపంచంలో ఎన్నో వండర్స్ - నిప్పు మీద - నీటి మీద - మంచు మీద - ఆకాశంలో జరుగుతున్న ఎన్నో అద్భుతాలను www మన ముందుంచుతోంది. మంచు మీద చేసే ముచ్చటైన పలు రకాల విన్యాసాలను యుట్యూబ్లో ఉన్నాయి. ఈ ప్రపంచం చాలా సుందరమైంది. నీటి గలగలలు, పక్షుల కిలకిలరావాలు, విచ్చుకునే పుష్పాలు... ఒకటేమిటి.. ప్రకృతిలో ప్రతి దృశ్యం పరవశింపజేస్తుంది. ఇలాంటి దృశ్యాలను నేరుగా వెళ్లి చూసే అవకాశం అందరికీ రాదు. ఇంట్లో కూర్చొని అద్భుతాల్ని వీక్షించే అవకాశం మనకు వరల్డ్ వైడ్ వైబ్ కల్పిస్తోంది. తెలుగు వారికి సినిమాలు అంటే మహా ఇష్టం. చక్కటి పాటలను, కామెడీ సీన్లను ఎంతగానో ఆస్వాదిస్తారు. వరల్డ్‌వైడ్ వెబ్ వచ్చిన తర్వాత ఈ ఆస్వాదన మరింతగా పెరిగింది. వరల్డ్ వైడ్ వెబ్ వల్ల ప్రపంచ రికార్డులను మనం ఇంటర్నెట్లో వీక్షించే అవకాశం లభించింది. ఇలాంటివి వీక్షించే అవకాశం మనకు కల్పించిన టిమ్ బెర్నర్స్ లీకి మనమెంతో రుణపడి ఉన్నాం. s.nagarjuna@sakshi.com