పరిస్థితి మరింత దిగజారుతోంది: డబ్ల్యూహెచ్ఓ

WHO chief  warning : Coronavirus situation is worsening globally - Sakshi

కరోనా మహమ్మారిపై డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక 

నిర్లక్ష్యమే అతిపెద్ద ముప్పు

న్యూయార్క్‌ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి మరింత దిగజారుతోందని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు70 లక్షలను మించడంతో ఆందోళన వ్యక్తం చేసిన సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది. ఐరోపాలో పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతరం అవుతోందని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు.

అమెరికా, దక్షిణ ఆసియాలోని 10 దేశాలనుంచి 75శాతం కేసులు నమోదయ్యాయంటూ విలేకరుల సమావేశంలో టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 రోజులలో తొమ్మిది రోజుల కాలంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ప్రధానంగా ఆదివారం అత్యధిక సంఖ్యలో136,000 కేసులు నమోదయ్యాయన్నారు. ఆఫ్రికాలో చాలా దేశాలలో 1,000 కంటే తక్కువ కేసులు ఉన్నప్పటికీ, చాలా దేశాల్లో కొత్త ప్రాంతాల్లో విస్తరణ సహా కేసుల పెరుగుదల నమోదవుతోందని టెడ్రోస్ చెప్పారు. అదే సమయంలో ప్రపంచంలోని అనేక దేశాల్లో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని టెడ్రోస్ చెప్పారు. అయితే ఈ దేశాలలో అతిపెద్ద ముప్పు నిర్లక్ష్యమేనని  టెడ్రోస్ పేర్కొన్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే వుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 71,93,476 మంది ఈ వైరస్‌ బారినపడగా  4,08,614 మందికి పైగా బాధితులు మరణించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top