ఆ డ్రింక్స్‌, మద్యంపై పన్నులు ఇంకా పెంచండి: WHO | WHO Calls for Higher Taxes on Sugary Drinks Alcohol | Sakshi
Sakshi News home page

ఆ డ్రింక్స్‌, మద్యంపై పన్నులు ఇంకా పెంచండి: WHO

Jan 15 2026 3:56 AM | Updated on Jan 15 2026 5:12 AM

WHO Calls for Higher Taxes on Sugary Drinks Alcohol

సుగర్ డ్రింక్స్‌, మద్యంపై పన్నులు ఇంకా పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. డబ్ల్యూహెచ్‌ఓ తాజాగా రెండు కొత్త నివేదికలను విడుదల చేసింది. చక్కెర పానీయాలు, మద్యం చౌకగా మారుతున్నందున, ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయని హెచ్చరించింది.

తక్కువ స్థిర పన్ను రేట్లు ఉన్న దేశాల్లో ఈ ఉత్పత్తులు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉన్నాయని, దాంతో ఊబకాయం, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఇతర రుగ్మతల బారిన పడుతున్నారని పేర్కొంది. ముఖ్యంగా బాధితుల్లో పిల్లలు, యువత ఎక్కువగా ఉంటున్నారని ఆవేదన వెలిబుచ్చింది.

బలహీన పన్ను వ్యవస్థల వల్ల హానికరమైన ఉత్పత్తులు చౌకగా అందుబాటులో ఉంటున్నప్పటికీ, ఆరోగ్య వ్యవస్థలు వీటి వల్ల ఏర్పడే వ్యాధులు, రుగ్మతల ఆర్థిక భారాన్ని భరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

"పొగాకు, చక్కెర పానీయాలు,ఆల్కహాల్ వంటి ఉత్పత్తులపై పన్నులను పెంచడం ద్వారా, ప్రభుత్వాలు హానికరమైన ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించగలవు. తద్వారా ముఖ్యమైన ఆరోగ్య సేవలకు నిధులను ఆదా  చేసుకోవచ్చు. ఆరోగ్య పన్నులు వ్యాధులను నివారించడానికి, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి బలమైన సాధనాల్లో ఒకటి" అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పేర్కొన్నారు.

నివేదికల ప్రకారం.. కనీసం 116 దేశాలు చక్కెర పానీయాలపై పన్ను విధిస్తున్నప్పటికీ ఇవి ఎక్కువగా సోడా పానీయాలపై ఉంటున్నాయి. కానీ  పండ్ల రసాలు, తియ్యటి పాల పానీయాలు, రెడీ-టు-డ్రింక్ కాఫీలు, టీలు ఇంకా పన్ను నుండి మినహాయింపు పొందుతున్నాయి. ఎనర్జీ డ్రింక్స్‌పై 97% దేశాలు పన్ను విధిస్తున్నప్పటికీ, 2023 నుండి ఈ సంఖ్య మారలేదు.

అలాగే కనీసం 167 దేశాలు మద్యం, మత్తు పానియాలపై పన్ను విధిస్తుండగా, 12 దేశాలు మద్యాన్ని పూర్తిగా నిషేధించాయి. అయితే, ద్రవ్యోల్బణం, ఆదాయ వృద్ధికి అనుగుణంగా ఈ పన్నులు ఉండకపోవడం వల్ల 2022 నుండి చాలా దేశాల్లో ఆల్కహాల్ ధరలో పెద్ద మార్పు రాలేదు అక్కడవి చవక్కానే దొరుకుతున్నాయి. 25 దేశాల్లో అయితే ఎక్కువగా యూరోప్‌లో మద్యంపై ఎలాంటి పన్నులూ విధించడం లేదు.

ఈ చెక్కెర పానీయాలు, మద్యం వ్యాపారాలతో పరిశ్రమలకు  లాభాలు పెరుగుతున్నప్పటికీ, ప్రజలు అనారోగ్య సమస్యల బారినపడి తద్వారా వచ్చే ఆర్థిక భారాన్ని మొత్తం సమాజం భరించాల్సి వస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో “3 బై 35” కార్యక్రమంలో భాగంగా 2035 నాటికి పొగాకు, మద్యం, చక్కెర పానీయాల వాస్తవ ధరలను పెంచే దిశగా పన్నులను పెంచడం, పునఃరూపకల్పన చేయడంపై దృష్టి పెట్టాలని డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement