ట్రంప్‌ ఆంక్షలు.. పుతిన్‌ వార్నింగ్‌

Vladimir Putin Warns West Attacks on Syria Again - Sakshi

మాస్కో : సిరియా.. దాని మిత్ర పక్షాలపై ఆంక్షలు విధించే దిశగా అమెరికా అడుగులు వేస్తున్న తరుణంలో రష్యా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సిరియాపై మరోసారి దాడులకు తెగ బడితే చూస్తూ ఊరుకోబోమన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ .. ఆంక్షల దిశగా అగ్రరాజ్యం అడుగులు వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

సిరియా పరిణామాలపై ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహనీతో ఫోన్‌లో మాట్లాడిన పుతిన్‌.. ఆంక్షల నిర్ణయంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ‘సిరియాపై పశ్చిమ దేశాల దాడులు.. శాంతి చర్చలకు విఘాతాన్ని కలిగించేవిగా ఉన్నాయని పుతిన్‌-రౌహనీ అభిప్రాయపడ్డారు. ఆంక్షలు యూఎన్‌ ఛార్టర్‌ను ఉల్లంఘించేవిగా ఉంటే మాత్రం అంతర్జాతీయంగా తీవ్ర ప్రతికూలతను అమెరికా ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరువురు నేతలు భావిస్తున్నారు. ఆంక్షలపై తక్షణమే అమెరికా వెనక్కి తగ్గాలని పుతిన్‌ డిమాండ్‌ చేస్తున్నారు’ అని  క్రెమ్లిన్‌(రష్యా అధ్యక్ష భవనం) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఇదిలా ఉంటే అమెరికా మాత్రం ఆంక్షల విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించటం లేదు. సిరియాకు రసాయనిక ఆయుధాల సరఫరాను చేస్తున్న సంస్థలను(అందులో రష్యాకు చెందినవి కూడా ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ) దృష్టిలో ఉంచుకునే తాము ఆంక్షలు విధించినట్లు ఐరాస అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ ‌7వ తేదీన డౌమా పట్టణంలో జరిగిన విష వాయు ప్రయోగంలో​ పదుల సంఖ్యలో(లెక్క స్పష్టంగా తేలలేదు) మృత్యువాత పడ్డారు. దీనికి వెనుక సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ ప్రమేయం ఉందని.. జరిగింది రసాయనిక దాడులేనని ఆరోపిస్తూ అమెరికా-ఫ్రాన్స్‌-యూకే దళాలు శనివారం డమాస్కస్‌ పట్టణంపై విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికా చేష్టలను రష్యా.. దాని మిత్ర పక్షాలు తీవ్రంగా ఖండించాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top