ఉద్రిక్తం.. అమెరికా మరోసారి రాకెట్ల దాడి

USA Second Day Airstrike Attack On Iraq - Sakshi

బాగ్దాద్‌ : ఇరాక్‌పై అగ్రరాజ్యం అమెరికా మరోసారి దాడులకు పాల్పడింది. రెండు రోజు (శనివారం) సైతం ఉత్తర బాగ్దాద్‌ నగరంపై అమెరికా రాకెట్లు దూసుకెళ్లాయి. ఈ రాకెట్ల దాడిలో సైన్యానికి చెందిన ఆరుగురు సిబ్బంది మృతిచెందారు. ఇరాక్‌ మిలీషియా కమాండర్‌ లక్ష్యంగా వైమానికి దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఇరాన్‌ దేశ రివల్యూషనరీ గార్డ్‌ కమాండర్‌ జనరల్‌ ఖాసీం సులేమాని అమెరికా జరిపిన దాడుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకే ఈ దాడికి పాల్పడినట్టు పెంటాగన్‌ ప్రకటించింది. అమెరికా దౌత్యవేత్తలపై దాడి చేసినందుకే ఇరాక్‌పై దాడికి దిగామని ట్రంప్‌ తెలిపారు. ఇరాన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తాము ప్రయత్నించడంలేదని ట్రంప్‌ పేర్కొన్నారు. (ఎప్పుడో చంపేయాల్సింది: ట్రంప్‌)

మరోవైపు ఇరాక్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని అమెరికా విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. ఇరాన్‌ మద్దతున్న మిలిటెంట్లు అమెరికా దౌత్యకార్యాలయం దగ్గర జరిపిన దాడులతో ఎంబసీలో కార్యకలాపాలు నిలిపివేశామని, పౌరులెవరూ అక్కడికి వెళ్లవద్దని ట్వీట్‌ చేసింది. ఈ పరిణామాలతో మధ్య ప్రాచ్యానికి అమెరికా మరో 3,500 మంది బలగాలను తరలించింది. సులేమాని చంపేసినందుకు అమెరికాపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇదివరకే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరి​స్థితులు నెలకొన్నాయి.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top