ఇరాన్‌ వెన్ను విరిగింది!

Qasem Soleimani should have been eliminated many years ago - Sakshi

అమెరికా డ్రోన్‌ దాడుల్లో ఇరాన్‌ జనరల్‌ ఖాసీం సులేమాని మృతి

ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ హెచ్చరిక

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు  

వాషింగ్టన్‌/బాగ్దాద్‌/టెహ్రాన్‌: ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన నాయకుడు, ఆ దేశ రివల్యూషనరీ గార్డ్‌ కమాండర్‌ జనరల్‌ ఖాసీం సులేమాని అమెరికా జరిపిన దాడుల్లో మృతి చెందారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకు బాగ్దాద్‌ విమానాశ్రయం సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున సులేమాని ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై గగనతలం నుంచి డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు జరిగాయి.

ఈ దాడుల్లో సులేమానితోపాటు ఇరాక్‌కు చెందిన హషద్‌ అల్‌ షాబి పారామిలటరీ బలగాల డిప్యూటీ చీఫ్, ఇరాన్‌కు మద్దతుగా వ్యవహరించే కొందరు స్థానిక మిలిమెంట్లు మరణించినట్టు బాగ్దాద్‌ మీడియా వెల్లడించింది. లెబనాన్‌ లేదంటే సిరియా నుంచి బాగ్దాద్‌కు వచ్చినట్టుగా భావిస్తున్న సులేమాని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి రెండు కార్లలో తన సన్నిహితులతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. ఇరాక్‌లో అమెరికా సిబ్బంది రక్షణ కోసమే తాము వైమానిక దాడులకు దిగామని పెంటగాన్‌ ప్రకటించింది. ఈ దాడుల్లో సులేమాని మరణించారని ధ్రువీకరించింది.

ఎప్పుడో చంపేయాల్సింది: ట్రంప్‌  
విదేశాల్లో నిఘా కార్యకలాపాలు నిర్వహించే ఇరాన్‌ అల్‌ ఖుద్స్‌ చీఫ్‌ జనరల్‌ సులేమానిని కొన్నేళ్ల క్రితమే చంపేయాల్సి ఉండేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇరాక్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాల్లో అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకి, వేలాది మంది అమెరికన్‌ సిబ్బంది మృతికి సులేమాని కారకుడని ధ్వజమెత్తారు. ఈ మధ్యకాలంలో ఇరాక్‌లో అమెరికా దౌత్యకార్యాలయం దగ్గర జరిగిన దాడుల వెనుక సులేమాని హస్తం ఉందని అన్నారు. అమెరికా రాయబారులు ఇతర అధికారులు, సైనికులపై మరిన్ని దాడులకు సులేమాని వ్యూహాలు పన్నుతున్నారని ఆరోపించారు.

సులేమాని మృతి వార్త తెలిసిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్‌ అమెరికా జాతీయ జెండా ఇమేజ్‌ని తన ట్విట్టర్‌ ఖాతాలో ఉంచారు. కొద్ది గంటల తర్వాత మరో ట్వీట్‌లో ‘‘ఇరాన్‌ ఎప్పుడూ యుద్ధం గెలవలేదు. అలాగే సంప్రదింపుల్ని ఎప్పుడూ వదులుకోలేదు’’అని పేర్కొన్నారు. 2018లో అమెరికా ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పట్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతలు చెలరేగాయి. అమెరికాలో ట్రంప్‌పై అవిశ్వాసం ప్రబలుతోన్న సందర్భంలో ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఈ దాడులకి దిగారన్న విమర్శలు ఉన్నాయి.

ఇరాక్‌ నుంచి వెనక్కి రండి  
ఇరాక్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని అమెరికా విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. ఇరాన్‌ మద్దతున్న మిలిటెంట్లు అమెరికా దౌత్యకార్యాలయం దగ్గర జరిపిన దాడులతో ఎంబసీలో కార్యకలాపాలు నిలిపివేశామని, పౌరులెవరూ అక్కడికి వెళ్లవద్దని ట్వీట్‌ చేసింది. ఈ పరిణామాలతో మధ్య ప్రాచ్యానికి అమెరికా మరో 3,500 మంది బలగాలను తరలించింది.

ఇరాకీల సంబరాలు
బాగ్దాద్‌లో జరిగిన దాడుల్లో జనరల్‌ సులేమాని మృతి చెందడంతో ఇరాక్‌లో ప్రభుత్వ వ్యతిరేకులు సంబరాలు చేసుకున్నారు.  

మరో యుద్ధం భరించలేం: ఐరాస
గల్ఫ్‌లో మరో యుద్ధాన్ని ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్‌ వ్యాఖ్యానించారు. సులేమాని మృతి చెందడంతో అమెరికా, ఇరాన్‌ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యుటెరస్‌ పై విధంగా స్పందించారు.  

ఎవరీ ఖాసీం సులేమాని?
1955లో ఇరాన్‌లో ఒక నిరుపేద రైతు కుటుంబంలో సులేమాని జన్మించారు. మొదట్లో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశారు. 1979లోఇరాన్‌ విప్లవం సమయంలో రివ్యల్యూషనరీ గార్డ్‌లో చేరారు. 1980లో ఇరాన్, ఇరాక్‌ యుద్ధంలో పాల్గొని ధైర్యసాహసాలు కలిగిన కమాండర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌లో కీలకమైన నిఘా విభాగం అయిన ఖుద్స్‌ ఫోర్స్‌కి 1998 సంవత్సరం నుంచి సులేమాని మేజర్‌ జనరల్‌గా ఉన్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్‌ ప్రాబల్యాన్ని పెంచడానికి, దానిని బలమైన దేశంగా నిలపడానికి చాలా ఏళ్లుగా శ్రమిస్తున్నారు. సులేమాని విదేశాల్లో కోవర్ట్‌ ఆపరేషన్లు నిర్వహించడంలో దిట్ట.

సమయానుకూలంగా మిత్రపక్షాల్ని మార్చేయడంలోనూ, చుట్టుపక్కల ముస్లిం దేశాల్లో షియా అనుకూల ప్రభుత్వ ఏర్పాట్లలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇరాక్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌పై పోరాటంలోనూ సులేమాని ప్రధాన పాత్ర పోషించారు. ఇరాన్‌ సరిహద్దులు దాటి జరిగే దాడులన్నింటి వెనుక వ్యూహ ప్రతివ్యూహాలు ఆయనే రచిస్తారు. ఇరాన్‌ సుప్రీం నాయకుడు అయోతల్లా ఖామినేయీ తర్వాత దేశంలో అంతటి శక్తిమంతుడిగా అల్‌–ఖుద్స్‌ బలగాల చీఫ్‌ అయిన జనరల్‌ సులేమానికి పేరుంది. ఇరాన్‌ ప్రజలు ఆయనని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. 2017లో టైమ్‌ మ్యాగజైన్‌ ఆయనని అత్యంత ప్రభావశీలుర జాబితాలో చేర్చింది.జేమ్స్‌ బాండ్, ఎర్విన్‌ రోమెల్, లేడీ గాగా ఒక రూపంలోకి వస్తే అదే సులేమాని అంటూ కీర్తించింది. అయితే ఎన్నో దేశాల్లో మిలటరీ దాడుల వ్యూహకర్త అయిన సులేమానిని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది.

ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్‌
సులేమాని చంపేసినందుకు అమెరికాపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌  అయోతొల్లా అలీ ఖమేనియా హెచ్చరించారు. ఇస్మాయిల్‌ ఖానీని సులేమాని స్థానంలో ఖుద్స్‌ బలగాల చీఫ్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్‌ గుండెకు గాయం చేసిన వారిని విడిచిపెట్టమని తమకు సహకరించే దేశాలతో కలిసి బదులు తీర్చుకుంటామని అధ్యక్షుడు హసన్‌ రౌహని  హెచ్చరించారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top