సూచీకి కీలక బాధ్యతలు | Suu Kyi to run foreign ministry | Sakshi
Sakshi News home page

సూచీకి కీలక బాధ్యతలు

Mar 22 2016 7:58 PM | Updated on Sep 3 2017 8:20 PM

ఎన్నికల్లో ఘనవిజయం సాధించినా.. సైన్యం మార్చిన రాజ్యాంగ నిబంధనల వల్ల మయన్మార్ అధ్యక్ష పదవికి అనర్హురాలైన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షురాలు ఆంగ్ సాన్ సూచీ కొత్త ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశముంది.

యంగోన్: ఎన్నికల్లో ఘనవిజయం సాధించినా.. సైన్యం మార్చిన రాజ్యాంగ నిబంధనల వల్ల మయన్మార్ అధ్యక్ష పదవికి అనర్హురాలైన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షురాలు ఆంగ్ సాన్ సూచీ కొత్త ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశముంది. మంత్రి పదవి చేపట్టరాదని సూచీ భావించినా, ఆమెకు కీలక శాఖలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన సూచీ ప్రధాన అనుచరుడు, గతంలో ఆమెకు డ్రైవర్‌గా పని చేసిన టిన్ క్వా .. పార్లమెంట్కు పంపిన 18 మంది కొత్త మంత్రుల జాబితాలో ఆమె పేరు ఉంది. సూచీకి విదేశీ వ్యవహారాల శాఖతో పాటు ఇంధన, విద్యాశాఖలను కేటాయించే అవకాశముంది. టిన్ క్వా కేబినెట్లో సూచీ మినహా మరో మహిళ పేరు లేదు.

నవంబర్‌ నాటి పార్లమెంటు ఎన్నికల్లో సూచీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే సైన్యం గతంలో మార్చిన రాజ్యాంగ నిబంధనల వల్ల అధ్యక్ష పదవికి అనర్హురాలయ్యారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టే వ్యక్తి విదేశీయుల్ని పెళ్లి చేసుకొని ఉండరాదు. అలాగే ఆ వ్యక్తికి విదేశీ పౌరసత్వం ఉన్న పిల్లలు ఉండకూడదు. సూచీ భర్త మైఖేల్  బ్రిటిషర్ కావడం, ఆమె ఇద్దరు పిల్లలకు బ్రిటన్ పౌరసత్వం ఉండటంతో  అధ్యక్షురాలయ్యేందుకు అనర్హురాలయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement