హజ్‌ యాత్రపై కోవిడ్‌ ప్రభావం

Saudi Arabia temporarily bars entry for pilgrims as coronavirus - Sakshi

వైరస్‌ ప్రభావిత దేశాల ప్రజలకు అనుమతి లేదు: సౌదీ అరేబియా

రియాద్‌/బీజింగ్‌/సియోల్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్‌ వైరస్‌ ప్రభావం హజ్‌ యాత్రపై పడింది. కోవిడ్‌ వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారిని ఈ ఏడాది జరగబోయే హజ్‌ యాత్రకు అనుమతించబోమని సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ దేశాల నుంచి మక్కాకు వచ్చే యాత్రికులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సౌదీ విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. వారిని మక్కాలోకి అనుమతించబోమని తెలిపింది. కేవలం ఉమ్రా యాత్రికులనే కాకుండా మదీనాను సందర్శించే వారిని సైతం అనుమతించబోమని ప్రకటించింది. ఈ ఆంక్షలు ఎప్పటివరకు కొనసాగుతాయనే దానిపై మాత్రం సౌదీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.  

మక్కా యాత్రకు తాత్కాలిక బ్రేక్‌
శంషాబాద్‌: నిషేధం నేపథ్యంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి గురువారం ఉమ్రా యాత్ర కోసం వచ్చిన 76 మంది ప్రయాణికులను ఇమిగ్రేషన్‌ అధికారులు నిలిపివేశారు. దీంతో  ప్రయాణికులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.

జపాన్‌లో పాఠశాలల మూసివేత
టోక్యో: కోవిడ్‌ వైరస్‌ కారణంగా జపాన్‌లోని అన్ని పాఠశాలలను కొన్ని వారాలపాటు మూసివేయాలని ఆ దేశ ప్రధాని షింజో అబే ఆదేశించారు. మార్చి 2 నుంచి వసంత కాలం సెలవులు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా పాఠశాలలను మూసివేయనున్నట్లు తెలిపారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో సంయుక్త సైనిక విన్యాసాలను వాయిదా వేస్తున్నట్లు దక్షిణ కొరియా, అమెరికా ప్రకటించాయి.

శాంతిస్తున్న కోవిడ్‌
కోవిడ్‌ తీవ్రత క్రమేపీ నెమ్మదిస్తోంది. వైరస్‌ కారణంగా చైనాలో సంభవిస్తున్న రోజువారీ మరణాల్లో తగ్గుదల నమోదు అవుతూండటం దీనికి కారణం. చైనా ఆరోగ్య కమిషన్‌ గురువారం తెలిపిన దాని ప్రకారం బుధవారం కేవలం 29 మంది కోవిడ్‌కు బలయ్యారు. దీంతో ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2744కు చేరుకోగా, నిర్ధారిత కేసుల సంఖ్య 78,497కు చేరుకుంది. దేశంలోని మొత్తం 31 ప్రావిన్సుల్లోనూ అతితక్కువ మరణాలు నమోదు కావడం కొన్ని వారాల్లో ఇదే మొదటిసారి. చైనా చేపట్టిన చర్యల కారణంగా కరోనా వైరస్‌ ఉధృతి గత అంచనాల కంటే వేగంగా కట్టడి అయిందని డబ్ల్యూహెచ్‌ఓ వైద్య నిపుణుడు బ్రూస్‌ ఐల్‌వార్డ్‌ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top