భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధిచేసిన ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణిని నేడు తొలిసారి పరీక్షించనున్నారు.
బాలాసోర్: భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధిచేసిన ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణిని నేడు తొలిసారి పరీక్షించనున్నారు. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఐటీఆర్ ఇందుకు వేదిక కానుంది. ఏర్పాట్లు పూర్తయ్యాయని, వాతావరణం అనుకూలిస్తే బుధవారం క్షిపణిని ప్రయోగిస్తామని అధికారులు తెలిపారు.
ఈ వ్యవస్థలో క్షిపణి కి అనుబంధంగా, దానికి దిక్సూచిలా పనిచేసే నిఘా రాడార్(ఎంఎఫ్ స్టార్) ను అమర్చారు. భారత రక్షణ శాఖ, డీఆర్‌డీఓ ,ఇజ్రాయెల్ ఏరోస్పేస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రయోగం చేపడుతున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రయోగ సమయంలో వేదికకు 2.5 కి.మీ. పరిధిలో నివసిస్తున్న ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు బాలాసోర్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. సమీప తీరప్రాంత జిల్లాల్లో జాలర్లు చేపల వేటకు వె ళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.