రన్‌వేను ఢీకొని.. పేలిపోయి.. | flight crashes in Russia, all 61 aboard dies | Sakshi
Sakshi News home page

రన్‌వేను ఢీకొని.. పేలిపోయి..

Mar 20 2016 5:17 AM | Updated on Oct 2 2018 8:04 PM

రన్‌వేను ఢీకొని.. పేలిపోయి.. - Sakshi

రన్‌వేను ఢీకొని.. పేలిపోయి..

దక్షిణ రష్యాలోని రోస్తోవ్ ఆన్ డోన్ నగరంలో శనివారం తెల్లవారుజామున ‘ఫ్లై దుబాయ్’ విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది.

మాస్కో: దక్షిణ రష్యాలోని రోస్తోవ్ ఆన్ డోన్ నగరంలో శనివారం తెల్లవారుజామున ‘ఫ్లై దుబాయ్’ విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. విమానంలోని మొత్తం 62 మందీ మృతిచెందారు. వీరిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. ప్రతికూల వాతావరణం, రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో  ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ‘ఫ్లై దుబాయ్ బోయింగ్ 737’ విమానం భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11.50కి దుబాయ్ నుంచి బయలుదేరింది. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో రోస్తోవ్ ఆన్ డోన్ నగరంలో దిగాల్సి ఉంది. అయితే.. ప్రతికూల వాతావరణం వల్ల ఓసారి విఫలయత్నం చేసింది.

రెండుగంటలపాటు చక్కర్లు కొట్టింది.  6.20 గంటలకు రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తూ  రన్‌వేను ఢీకొని పేలిపోయింది. ‘రన్‌వేపై దిగే ప్రయత్నంలో విమానం పెద్ద మంటతో కాలిపోయింది’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అయితే  బలమైన గాలులు, భారీ వర్షం కారణంగా ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి విమానం రన్‌వేను ఢీకొని ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. రన్‌వేను ఢీకొన్న వెంటనే విమానం పేలిపోయిందన్నారు.  పెను గాలుల ధాటికి విమాన శకలాలు ఘటన జరిగిన ప్రాంతం నుంచి కిలోమీటరున్నర దూరం వరకు కొట్టుకుపోయాయి.  విమానంలోని 62 మంది ప్రయాణికులు మృతిచెందారని ఎమిరేట్స్ కేంద్రంగా నడుస్తున్న ‘ఫ్లై దుబాయ్’ సంస్థ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఘటన జరిగిన వెంటనే ఎయిర్‌పోర్టులోకి ఇతర విమానాల రాకపోకలను దగ్గర్లోని క్రాస్నోదర్ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. 500 మంది సిబ్బంది, 60 వాహనాలు రంగంలోకిదిగి గంటలోపే మంటలను అదుపుచేశాయి. రెండు బ్లాక్ బాక్స్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సాంకేతిక, భద్రత  లోపాల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
 
 మృతుల్లో భారతీయ దంపతులు
 రష్యా విమాన ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు భారతీయులు మోహన్ శ్యామ్, అంజు కత్రివేల్ కేరళకు చెందిన వారుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ‘రష్యాలోని ఆయుర్వేదిక్ రిసార్టులో పనిచేసే ఈ దంపతులు.. కేరళలోని వెంగోలాకు బంధువులతో గడిపేందుకు రెండు నెలలు సెలవుపై వచ్చారు. శుక్రవారమే వీరు బంధువులకు వీడ్కోలు చెప్పి ఎమిరేట్స్ మీదుగా రష్యాకు బయలుదేరారు. అంతలోనే ప్రమాదం జరిగిపోయింది’ అని కేరళ హోం మంత్రి రమేశ్ చెన్నితల తెలిపారు. ఈ ఘటనలో మృతిచెందిన వారిలో ఇద్దరు భారతీయులతోపాటు 44 మంది రష్యన్లు, 8 మంది ఉక్రెయిన్ దేశస్తులు, ఒక ఉజ్బెకిస్తాన్‌కు చెందిన వ్యక్తి ఉన్నారు. మిగిలిన ఏడుగురు విమాన సిబ్బంది.

We're aware of reports coming out of Russia and our team is currently gathering more details.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement