ఇటీవల ఇండిగో విమానంలో మంటలు చెలరేగిన నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. మొబికిన్స్ ఎంకే-పీబీ-04( MOBIKINS MK-PB-04) మోడల్ పవర్ బ్యాంక్‌ను విమానాల్లో తీసుకెళ్లకుండా ఆంక్షల విధించింది. ఆదివారం ఢిల్లీ నుంచి చెన్నైకి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆ విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటన తర్వాత డీజీసీఏ ఈ ఆదేశాలను జారీ చేసింది.
భారత్‌కు వచ్చే, వెళ్లే విమానాలతో పాటు దేశీయంగా నడిచే అన్ని విమానాల్లో ఈ పవర్ బ్యాంక్‌లను తీసుకెళ్లడాన్ని నిషేధించాలని డీజీసీఏ చీఫ్ వీర్ విక్రమ్ యాదవ్ ఆదేశించారు. ఈ నిషేధం విమానంలోని క్యాబిన్ లగేజ్‌తో పాటు చెక్-ఇన్ లగేజ్ రెండింటికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఈ నిషేధం కేవలం . మొబికిన్స్ ఎంకే-పీబీ-04 మోడల్‌కు మాత్రమే వర్తిస్తుందని అన్ని పవర్ బ్యాంకులపై నిషేధం విధించినట్లు కాదని.. ప్రయాణికులు తమ వద్ద ఉన్న పోర్టబుల్ బ్యాటరీల మోడల్ నంబర్‌ను ప్రయాణానికి ముందు పరిశీలించి, విమానయాన సంస్థల మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.
కాగా, విమాన ప్రయాణ సమయంలో పవర్ బ్యాంకులను ఉపయోగించి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ చేయడాన్ని కూడా డీజీసీఏ నిషేధించింది. ప్రయాణికులకు ఈ నిబంధనలపై అవగాహన కల్పించాలని, బ్యాటరీలకు సంబంధించిన ప్రమాదాలను ఎదుర్కొనేలా క్యాబిన్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, లిథియం బ్యాటరీల వల్ల మంటలు చెలరేగినా, అవి పనిచేయడంలో లోపాలు తలెత్తినా ఆ వివరాలను డీజీసీఏకు రిపోర్ట్ చేయాలని విమానయాన సంస్థలను డీజీసీఏ ఆదేశించింది.
ఇదీ చదవండి: రైల్వే ఉద్యోగులకు పండుగ బోనస్.. ఎంతంటే..


