అమెరికా నిర్ణయం ఆందోళనకరం: చైనా

China Response Over US Halts Funding For WHO - Sakshi

బీజింగ్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు నిధులు నిలిపివేస్తున్నట్లు అమెరికా చేసిన ప్రకటనపై చైనా స్పందించింది. కరోనా వైరస్‌(కోవిడ్‌-19) సంక్షోభ సమయంలో అగ్రరాజ్యం నిర్ణయం ఆందోళనకరంగా పరిణమించిందని పేర్కొంది. మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో అమెరికా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు చైనా అధికారి జావో లిజియన్‌ మాట్లాడుతూ.. ‘‘ అమెరికా నిర్ణయం ప్రపంచ ఆరోగ్య సంస్థ సామర్థ్యాలను బలహీనపరిచేలా ఉంది. మహమ్మారిపై పోరులో అంతర్జాతీయంగా పరస్పర సహకారం అందించుకొనే అంశానికి విఘాతం కలిగించేలా ఉంది’’అని పేర్కొన్నారు.(కరోనా: డబ్ల్యూహెచ్‌ఓకు షాకిచ్చిన ట్రంప్‌!)

కాగా చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్‌ గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైనందున నిధులు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏడాదికి 400 నుంచి 500 మిలియన్‌ డాలర్ల చొప్పున అమెరికా డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు సమకూరుస్తోందని... కాబట్టి సంస్థ వ్యవహారశైలిపై ప్రశ్నించడం తమ కర్తవ్యంలో భాగమని పేర్కొన్నారు. కేవలం 40 మిలియన్‌ డాలర్లు లేదా అంతకన్నా తక్కువ నిధులు ఇస్తున్న చైనాకు డబ్ల్యూహెచ్‌ఓ వత్తాసు పలికి.. కరోనా గురించి నిజాలను దాచిందని ఆరోపణలు గుప్పించారు.( తైవాన్‌ డబ్ల్యూహెచ్‌ఓపై విషం కక్కుతోంది: చైనా)

ఇది సరైన సమయం కాదు
ఇక అమెరికా డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేసేందుకు ఇది సరైన సమయం కాదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అన్నారు. విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం పరస్పర సంఘీభావంతో మెలుగుతూ ఐకమత్యంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక డబ్ల్యూహెచ్‌ఓ మాత్రం ఇంతవరకు ఈ విషయంపై స్పందించలేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top