డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేస్తున్నాం: ట్రంప్‌

Donald Trump Halts US Funding To WHO Alleges Covid 19 Mismanagement - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు అమెరికా అందిస్తున్న నిధులు నిలిపివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. కరోనా వైరస్‌(కోవిడ్‌-19 )సంక్షోభం గురించి అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బుధవారం శ్వేతసౌధంలో విలేకర్లతో మాట్లాడిన ట్రంప్‌... కరోనా విషయంలో చైనాకు అనుకూలంగా డబ్ల్యూహెచ్‌ఓ వ్యవహరించిన తీరు సరైంది కాదని దుయ్యబట్టారు. 

‘‘డబ్ల్యూహెచ్‌ఓకు సమకూరుస్తున్న నిధులు నిలిపివేయాలని ఈ రోజు నా పాలనా యంత్రాంగాన్ని ఆదేశించాను. కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి అప్రమత్తం చేయడంలో ఆ సంస్థ విఫలమైందని, కీలక విషయాలు దాచి పెట్టడంలో దాని పాత్ర ఉందని సమీక్షా సమావేశంలో అంచనాకు వచ్చాం. చైనాలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అమెరికా పన్ను చెల్లింపుదారులు ఏడాదికి 400 నుంచి 500 మిలియన్‌ డాలర్లు డబ్ల్యూహెచ్‌ఓకు సమకూరుస్తున్నారు. చైనా కేవలం 40 మిలియన్‌ డాలర్లు లేదా అంతకన్నా తక్కువే అందిస్తోంది. భారీ మొత్తంలో నిధులు సమకూరుస్తున్న అమెరికాకు.. సంస్థను జవాబుదారీగా ఉండాలని పట్టుబట్టడం అనేది తన కర్తవ్యంలో భాగమే’’అని ట్రంప్‌ పేర్కొన్నారు. (అమెరికా ఆ పని చేయదనుకుంటున్నాం: డబ్ల్యూహెచ్‌ఓ)

కాగా చైనాలోని వుహాన్‌ నగరంలో తొలిసారిగా బయటపడిన కరోనా వైరస్‌ క్రమంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాపై కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహమ్మారి ధాటికి అక్కడ 25 వేలకు పైగా మరణాలు సంభవించగా... 6 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకీ కరోనా బాధితులు, మృతుల సంఖ్య పెరుగతుండటంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్‌ఓ వైఫల్యం వల్లే ఇదంతా జరిగిందని ట్రంప్‌ ఆరోపిస్తూ.. ఇందుకు ప్రతిగా నిధులు నిలిపివేస్తామని కొన్ని రోజులుగా హెచ్చరిస్తున్నారు. (తైవాన్‌ డబ్ల్యూహెచ్‌ఓపై విషం కక్కుతోంది: చైనా)

తాజాగా తన నిర్ణయాన్ని అమలు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసి గట్టిషాకిచ్చారు. దీంతో ఆర్థికపరంగా సంస్థకు పెద్ద దెబ్బ తగిలినట్లయింది. ఇక ట్రంప్‌ హెచ్చరికలపై స్పందించిన డబ్ల్యూహెచ్‌ఓ మహమ్మారిని అరికట్టేందుకు అమెరికా, చైనా సహా ఇతర దేశాలు కలిసికట్టుగా పోరాడాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top