సుప్రీంకోర్టు ఆదేశాలను విస్మరిస్తున్న టీఆర్‌ఎస్‌ | Marri Shashidhar Reddy complaint against trs government | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు ఆదేశాలను విస్మరిస్తున్న టీఆర్‌ఎస్‌

May 28 2017 9:54 PM | Updated on Sep 2 2018 5:24 PM

సుప్రీంకోర్టు ఆదేశాలను విస్మరిస్తున్న టీఆర్‌ఎస్‌ - Sakshi

సుప్రీంకోర్టు ఆదేశాలను విస్మరిస్తున్న టీఆర్‌ఎస్‌

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం పేరుతో ఆగమేఘాలపై భూమి పూజలు చేయడం సరికాదని సనత్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌: డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం పేరుతో ఆగమేఘాలపై భూమి పూజలు చేయడం సరికాదని సనత్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన  ఆదేశాలను కాదని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం అంబేద్కర్‌నగర్‌లో భూమి పూజలు చేశారని వివరిస్తూ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో  నాలుగు చోట్ల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించి ఇంతవరకు ఒక్కచోట కూడా పనులు చేపట్టలేదన్నారు.

1994లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అంబేద్కర్‌నగర్‌ ప్రాంతాన్ని బుద్దపౌర్ణిమ ప్రాజెక్ట్‌లో చేర్చి స్లమ్‌ లేకుండా చేసేందుకు ప్రయత్నించడంతో దానిని తీవ్రంగా వ్యతిరేకించి స్థలంను స్వాధీనం చేసుకోకుండా అడ్డుకున్నామని వివరించారు. చంద్రబాబు నాయుడు నెక్లెస్‌ రోడ్డులో అనేక నిర్మాణాలకు చేపట్టగా సుప్రీంకోర్టు జ్యోక్యం చేసుకుని హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని తీర్పునివ్వడం జరిగిందన్నారు. 2009లో సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని తీసుకువచ్చి అంబేద్కర్‌నగర్‌  ఇళ్లను చూపించగా జేఎన్‌ఎన్‌యుఆర్‌ పథకం కింద స్థానికులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అప్పటి  ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ ఎస్‌.పీ.సింగ్‌ను ఆదేశించడం జరిగిందని గుర్తుచేశారు.

అయితే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని అధికారులు సీఎం వైఎస్‌ఆర్‌కు వివరించారన్నారు. ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇవేమి పరిగణలోకి తీసుకోకుండా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు చేపడతామని  ముందుగా భూమి పూజలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఒకవేళ కోర్టు అనుమతులు ఉంటే బహిరంగ పర్చాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో మరోసారి కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement