చంద్రబాబు నుంచి నా భర్తకు ప్రాణహాని | 'chandrababu trying to murder my husband' | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నుంచి నా భర్తకు ప్రాణహాని

Nov 29 2015 3:43 AM | Updated on Aug 31 2018 8:24 PM

చంద్రబాబు నుంచి నా భర్తకు ప్రాణహాని - Sakshi

చంద్రబాబు నుంచి నా భర్తకు ప్రాణహాని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితుడుగా ఉన్న కొల్లం గంగిరెడ్డి భార్య కొల్లం మాళవిక హైకోర్టును ఆశ్రయించింది.

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని, ఎన్‌కౌంటర్ పేరుతో మట్టుపెట్టేందుకు కుట్ర జరుగుతోందని కొల్లం గంగిరెడ్డి సతీమణి కొల్లం మాళవిక ఆరోపించారు. తన భర్తను కడప జైలు నుంచి హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఏ జైలుకైనా తరలించేలా ఏపీ పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ మేరకు ఆమె తాజాగా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.  జైల్లో ఉన్న తన భర్తకు తగిన రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని, చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల ఎస్పీలు, కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్‌లను ప్రతివాదులుగా చేర్చారు. అలాగే సీఐడీ అదనపు డీజీ ద్వారకా తిరుమలరావు, ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు.

 చంద్రబాబు కక్ష పెంచుకున్నారు
 వ్యాపారవేత్త అయిన తన భర్త కొల్లం గంగిరెడ్డిని రాజకీయ కారణాలతో అన్యాయంగా కేసుల్లో ఇరికించారని మాళవిక తన పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబుపై అలిపిరి వద్ద జరిగిన హత్యాయత్నం కేసులో తన భర్తను ఇరికించారని, అయితే కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో తన భర్తపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని, అందులో భాగంగానే గతేడాది మేలో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారని తెలిపారు.

 మా కుటుంబ సభ్యులనూ తప్పుడు కేసుల్లో ఇరికించారు
 ‘‘చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నా భర్తను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. నా భర్తపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. వాస్తవానికి ఆ కేసులు జరిగే సమయానికి ఆయన విదేశాల్లో ఉన్నారు. ఈ విషయం తెలిసి కూడా తప్పుడు కేసులు బనాయించారు. నా భర్తను మాత్రమే కాకుండా మా కుటుంబ సభ్యులను కూడా తప్పుడు కేసుల్లో ఇరికించారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రత్యక్షంగా నా భర్తపై కేసులు పెట్టేందుకు ఆధారాలు లేకపోవడంతో సహ నిందితులు ఇచ్చే వాంగ్మూలాల ఆధారంగా కేసులు పెడుతున్నారు.

ఎన్‌కౌంటర్ పేరుతో ఆయనను అంతమొందించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. జైల్లో గానీ, కోర్టులకు తీసుకొచ్చే దారిలోగానీ హతమార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై ఈ నెల 20న గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేశాను. పోలీసులు నా భర్తను ఎర్ర చందనం స్మగ్లర్‌గా చిత్రీకరిస్తూ, ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయనపై 28 కేసులున్నట్లు ఈ నెల 15న మీడియా సమావేశంలోప్రకటించారు. తన ప్రాణాలను కాపాడాలని నా భర్త కోరారు. కాబట్టి ఆయనను ప్రస్తుతం ఉన్న కడప జైలు నుంచి హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఏ జైలుకైనా తరలించేలా ఆదేశాలు ఇవ్వాలి.

తనకు ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసులు నా భర్త చేత బలవంతంగా చెప్పించారు. ఈ విషయాన్ని ఆయనే నాకు చెప్పారు. నా భర్తను మారిషస్ నుంచి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రధానమంత్రి కార్యాలయ జోక్యాన్ని కూడా కోరారు. డీజీపీ, సీఐడీ అదనపు డీజీలు ముఖ్యమంత్రి చెప్పినట్లు నడుచుకుంటున్నారు. అందులో భాగంగా మీడియా పరేడ్ నిర్వహించారు. ఇది సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని తెలిసినా చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి’’ అని కొల్లం మాళవిక తన పిటిషన్‌లో విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement