కోవిడ్‌ కాలంలో కొత్త విద్యా వ్యవస్థ

Ghanta Chakrapani Article On New Educational System During Covid Period - Sakshi

విశ్లేషణ

భారతదేశం గురుశిష్యులు ముఖాముఖిగా ఉండి బోధించే పద్ధతికి అలవాటుపడిన దేశం. సమాచారం తెలుసుకోవడానికి టెలివిజన్, సామాజిక మాధ్యమ వేదికలైన వాట్సాప్, ఫేస్‌బుక్‌ ఉన్నా చదువు అనేసరికి తరగతి గది, ఎదురుగా టీచర్‌ ఉండాల్సిన సాంప్రదాయ స్థితిలోనే మన విద్యారంగం ఉంది. ఆప్యాయంగానైనా టీచర్లు విద్యార్థులను తాకకుండా ఉండలేని సంస్కృతి మనది. అదేవిధంగా కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఒకరినొకరు తాకకుండా, కలిసి మెలిసి ఉండకుండా ఉండగలరా? ఉండవచ్చునా? కరోనా కాలంలో గడిపిన కఠోరమైన జీవితం తరువాత ప్రజలెవరూ ప్రమాణాల విషయంలో రాజీపడే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వాలు, పాఠశాలల నిర్వాహకులు, విద్యార్థులు దీనికి సిద్ధం కావాల్సి ఉంటుంది.

కరోనా వైరస్‌ మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతానికి వేరే మార్గమేదీ కనిపించక దేశాలు మూతపడ్డాయి. చరిత్రలో ఎన్నడూ చూడని ఈ ఉపద్రవం నుంచి బయటపడటం ఎలాగో తెలియని అయోమయం రాజ్యమేలుతోంది. మళ్ళీ ఈ వ్యవస్థలను పునర్నిర్మించుకోవడం, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కి మనుగడ సాగించడం ఇప్పుడొక సవాలు. ప్రజలను కట్టడి చేసి ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టుకోవడం సాధ్యంకాదు కాబట్టి క్రమంగా లాక్‌డౌన్‌లు ఎత్తివేస్తున్నారు. అయినా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను కొన్ని సంవత్సరాలు తు.చ. తప్పక ఆచరించాల్సిందే. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటూనే, ఒకరికి ఒకరు భౌతిక దూరం పాటించక తప్పదని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యారంగం మీద కోవిడ్‌ ప్రభావం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ప్రధానమైన అంశం. కిక్కిరిసిపోయి ఉండే భారతీయ తరగతి ఎలా మారబోతుంది? పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది చర్చకు వస్తోంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాలు దీనిమీద పూర్తిగా దృష్టిపెట్టనప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు యునెస్కో, ప్రపంచబ్యాంకు వంటివి కొన్ని ప్రతిపాదనలను చర్చకు పెట్టాయి.

కరోనా వైరస్‌ బయటపడిన వెనువెంటనే విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్లమంది పాఠశాల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అమెరికా, ఐరోపా దేశాల్లో కొత్త విద్యాసంవత్సరం అడ్మిషన్లు నిలిచిపోయాయి. మనదేశంలో వార్షిక పరీక్షలను మధ్యలోనే ఆపేసి లాక్‌డౌన్‌ చేయాల్సివచ్చింది. కీలకమైన 10, 12 తరగతుల విద్యార్థులు ఇంకా పరీక్షలు పూర్తికాక అయోమయంలో ఉన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి కావాల్సిన ఎంట్రన్స్, అడ్మిషన్‌ టెస్టులు కూడా వీళ్ళు పూర్తి చేసుకోవాల్సి ఉంది. విద్యాసంవత్సరాన్ని జూన్‌ నుంచి కాకుండా సెప్టెంబర్‌ నుంచి ప్రారంభించాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. 

భారతీయ విద్యారంగం ప్రపంచంలో అన్నిటికన్నా పెద్దది. దేశ జనాభాలో దాదాపు 50 కోట్లమంది చదువుకునే వయసులో అంటే ఐదేళ్లనుంచి 24 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లే. దేశంలో దాదాపు 15 లక్షల స్కూళ్ళు, 40 వేలదాకా కాలేజీలు, దాదాపు వెయ్యి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో చదువుకునేవారి సంఖ్య దాదాపు 30 కోట్లు. ఇప్పుడు ఈ 30 కోట్లమంది ఇళ్లకే పరిమితమై ఉన్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు కోటిన్నర మంది విద్యార్థులున్నారు. వెంటనే విద్యాసంస్థలు తెరిచే పరిస్థితులు లేకపోయినా, మరో రెండు మూడు నెలల్లో విద్యాసంవత్సరం ప్రారంభించకపోయినా అది మొత్తం ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల మీద, విద్యార్థుల భవితవ్యం మీద తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది.

విద్యాసంస్థలు ఎప్పుడు తెరిచినా కోవిడ్‌ 19 నిబంధనలు కొత్త సవాలుగా మారబోతున్నాయి. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న దశలోనే పాఠశాల పరిసరాలు ఎలా ఉండాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌తో కలిసి ఒక ప్రోటోకాల్‌ రూపొందించింది. ఒక  చెక్‌లిస్టు కూడా ఇచ్చింది. దాని ప్రకారం మొత్తం విద్యారంగ మౌలిక సదుపాయాలు మార్చవలసి ఉంటుంది. ఇది విద్యావ్యవస్థ స్వరూప, స్వభావాలను పూర్తిగా మార్చేసే విధంగా ఉంది. ప్రతి టీచర్‌ , ప్రతి విద్యార్థి మాస్కులు  ధరించాలి. ప్రతి తరగతి గదిని రోజుకు కనీసం ఒక్కసారైనా (వీలైతే తరచుగా) నీటితో కడగడం, తుడవడం చేయాలి. ఆ గదిలోని ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాలి. విధిగా తరగతి గదికి అందుబాటులో శానిటైజర్లు లేదా సబ్బులు ఉంచాలి. విద్యార్థులు తరచుగా చేతులు కడుక్కునే సౌకర్యం, నిరంతరాయ నీటి వసతి కల్పించాలి.

పాఠశాలల్లో తరచూ జరిగే అసెంబ్లీలు, ఆటలు,  ఇతర సామూహిక కార్యక్రమాలు ఉండకూడదు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఒక్కో విద్యార్థికి మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండాలన్నది కోవిడ్‌ 19 నియమం. దీనిని పాఠశాలల్లో కూడా పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతోంది. అంటే ఒక విద్యార్థికీ మరో విద్యార్థికీ మధ్య అన్ని వైపులా కనీస దూరం ఒక మీటర్‌ ఉండాలి. ఈ లెక్కన ఇప్పుడున్న తరగతి గదుల సంఖ్యను ప్రభుత్వ పాఠశాలల్లో అయితే రెండు మూడు రెట్లు, ప్రైవేటులో అయితే ఐదారు రెట్లు పెంచాలి. ఇప్పుడున్న తరగతి గది, మౌలిక వసతులు సమకూరడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు వీటిని అవసరానికి అనుగుణంగా విస్తరించడానికి కొన్ని వేలకోట్ల రూపాయలు అవసరం. ఈ సంక్షోభంలో ఒక్క మనకే కాదు, అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికి కూడా ఇది సాధ్యం కాదు.

ఈ పరిస్థితులను అధిగమించడానికి మనం అనుసరిస్తోన్న విద్యాప్రణాళికలు, బోధనా పద్ధతులు పూర్తిగా మార్చడం ఒక్కటే పరి ష్కారం. సమస్యేమిటంటే గురుకులాలు మొదలు భారతదేశం గురుశిష్యులు ముఖాముఖిగా ఉండి బోధించే పద్ధతికి అలవాటు పడిన దేశం. సమాచారం తెలుసుకోవడానికి టెలివిజన్, సామాజిక మాధ్యమ వేదికలైన వాట్సాప్, ఫేస్‌బుక్‌ ఉన్నా చదువు అనే సరికి తరగతి గది, ఎదురుగా టీచర్‌ ఉండాల్సిన సాంప్రదాయ స్థితిలోనే మన విద్యారంగం ఉంది. ఆప్యాయంగానైనా టీచర్లు విద్యార్థులను తాకకుండా ఉండలేని సంస్కృతి మనది. అదేవిధంగా విద్యార్థులు ఒకరినొకరు తాకకుండా, కలిసి మెలిసి ఉండకుండా ఉండగలరా? ఉండవచ్చునా? ఇలాంటి పరిస్థితుల్లో మన బోధన, అభ్యాసన సంస్కృతికి సంబంధమే లేని దూరవిద్య మనకు పనికొస్తుందా? మన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? దూరవిద్య అంటే ఓపెన్‌ యూనివర్సిటీ లేదా ఓపెన్‌ స్కూల్‌ అనేది పాత భావన. ఇప్పుడు మనం థియేటరుకు వెళ్లకుండానే ఒక కొత్త సినిమా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లో ఎలా చూస్తున్నామో అలాగే పాఠశాలలకు వెళ్లకుండానే చదువుకోవచ్చు. అటువంటి సౌలభ్యత ఇప్పుడు అందుబాటులో ఉంది. అందులో మొదటిది టీవీ. 

మనదేశంలో దాదాపుగా విద్యార్థులున్న ప్రతి ఇంట్లో టెలివిజన్‌ ఉన్నది. దేశవ్యాప్తంగా కనీసం 70 శాతం ఇళ్లల్లో, దక్షిణాదిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 90 శాతం కంటే ఎక్కువ ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి. కాబట్టి ఇదొక అవకాశంగా తీసుకుని కనీసం 40 శాతం పాఠాలు ఇంట్లోనే బోధించేలా చర్యలు తీసుకోవాలన్నది ఒక ప్రతిపాదన. మొబైల్‌ లెర్నింగ్‌ రెండో ప్రత్యామ్నాయం. దేశ జనాభాలో 93 శాతానికి పైగా మొబైల్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. 2019 మెకెన్సీ నివేదిక ప్రకారం దాదాపు 40 శాతం మంది ఇంటర్నెట్‌ వాడుతున్నారు. విద్యార్థుల్లో ఇది కనీసం 95 శాతంగా ఉంటుంది. దాదాపు 40 కోట్ల మందికి వాట్సాప్‌ అకౌంట్లు ఉన్నాయి. పాఠశాల విద్యార్థులకు టెలివిజన్‌ పాఠాలు ప్రత్యామ్నాయం అనుకుంటే, కళాశాలలకు మొబైల్‌ సేవలను ఎక్కువగా వాడుకోవచ్చు. ఈ –లెర్నింగ్, డిజిటల్‌ లెర్నింగ్‌ లాంటివీ ఉన్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలన్నీ తమ పాఠాలను మూక్స్, మూడుల్‌ లాంటి కొత్త వేదికల ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నాయి. గూగుల్‌ కూడా విద్యాబోధనకు సంబంధించిన కొత్త టూల్స్‌ అందుబాటులోకి తెస్తోంది. 

ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల వినియోగంతో తరగతి గదిలో బోధించే విషయాలను కుదించడంతో పాటు, పాఠానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా ప్రింట్‌ రూపంలో అందించవలసి రావొచ్చు.  ఇప్పుడున్న సిలబస్‌ను కూడా సమీక్షించవలసి రావొచ్చు. అలాగే హాస్టల్స్, రెసిడెన్సియల్‌ విద్యాసంస్థలు భారీ మార్పులు చేయాల్సి రావొచ్చు. కోవిడ్‌ స్టాండర్డ్స్‌ ప్రకారం ఒక్కో విద్యార్థికి కనీసం వంద మీటర్ల స్థలం అవసరం. అంటే ఒక్కో గదిలో ఒక్కరు, లేక ఇద్దరి కంటే ఎక్కువ మందిని ఉంచడానికి వీలులేదు. భోజనశాలలు, స్టడీ రూములు, లైబ్రరీలు, ఇతర సామూహిక స్థలాల్లో కూడా చాలా మార్పులు రావాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థలో అన్ని దశల్లో కూడా సమూలమైన మార్పుల దిశగా ప్రయత్నాలు జరగాలి. ఇప్పుడున్న మౌలిక వసతులను షిఫ్టుల వారీగా వాడుకోవడం, దూర విద్యా వ్యవస్థలు, ఓపెన్‌ యూనివర్సిటీలను, అవి రూపొందించే పాఠ్యాంశాలను అందరికీ అందుబాటులోకి తేవడం అవసరం. ఇవన్నీ కావాలనుకుంటే కష్టమే. కానీ కరోనా అటువంటి కొత్త ప్రమాణాలను మన ముందుకు తెచ్చింది. కనీసం వ్యాక్సిన్‌ కనిపెట్టి, అది అందరికీ అందుబాటులోకి వచ్చే వరకైనా ఈ ఏర్పాట్లు అవసరం. కరోనా కాలంలో గడిపిన కఠోరమైన జీవితం తరువాత ప్రజలెవరూ ప్రమాణాల విషయంలో రాజీపడే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వాలు, పాఠశాలల నిర్వాహకులు, విద్యార్థులు దీనికి సిద్ధం కావాల్సి ఉంటుంది. 


ప్రొ. ఘంటా చక్రపాణి 
వ్యాసకర్త చైర్మన్, తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top