పెనుభూతం
తన పక్కింట్లోకి కొత్తగా ఎవరో అద్దెకి వచ్చారని సామాను చప్పుడు బట్టి జేడ్‌కి అర్థమైంది. వెంటనే లీజింగ్ ఆఫీస్‌కి ఫోన్ చేసి
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 8
తన పక్కింట్లోకి కొత్తగా ఎవరో అద్దెకి వచ్చారని సామాను చప్పుడు బట్టి జేడ్‌కి అర్థమైంది. వెంటనే లీజింగ్ ఆఫీస్‌కి ఫోన్ చేసి అడిగితే నిజమే అని తెలిసింది. ఆ రోజు జేడ్ ఫ్రిజ్‌లో రెండు రోజుల క్రితం పెట్టిన పీజాని వేడి చేసుకుని తిందామను కుంది. కానీ ఆ ఆలోచనని విరమించుకుని నలభై నిమిషాల్లో రెండు కేక్‌లని తయారుచేసింది. ఓ కేక్‌ని తనకి ఉంచుకుని, మరొక దాన్ని ప్లేట్‌లో పెట్టి మూతపెట్టి వెళ్లి పక్క అపార్ట్‌మెంట్ తలుపు తట్టింది.
తలుపు తీసిన ముప్ఫై ఏళ్ల యువతికి తనని పరిచయం చేసుకుంది.
‘‘నా పేరు జేడ్ వాల్టర్. మీ పక్క అపార్ట్‌మెంట్‌లో ఉంటాను. మీరు ఇవాళే వచ్చారు కాబట్టి, వంట చేసే అవకాశం ఉండకపోవచ్చని కేక్ వండి తెచ్చాను.’’
దాన్నందుకున్న పక్కింటామె చెప్పింది.
‘‘థాంక్స్ మిసెస్ జేడ్ వాల్టర్. నా పేరు కరెన్. ఈయన నా భర్త డగ్.’’
‘‘ప్లేట్‌ని తర్వాత తీసుకుంటాను. నేను పదిహేనేళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ జీవితం ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతోంది. నా భర్త వాల్టర్ చెప్పుల కంపెనీకి రిప్రజెంటేటివ్. నేను పెద్దగా టీవీ చూడను. కాబట్టి నిట్టింగ్ చేస్తూంటాను.’’
‘‘మిసెస్ వాల్టర్. మేము సామాను సర్దుకున్నాక మీరు మా ఇంటికి కాఫీకి రావాలి’’ కరెన్ ఆహ్వానించింది.
వాళ్లతో మాట్లాడుతూనే జేడ్ కళ్లు చురుగ్గా ఆ అపార్ట్‌మెంట్‌ని పరిశీలించాయి. సామాను బయటికి తీయని అట్టపెట్టెలు చాలా ఉన్నాయి. పాత ఫర్నిచర్ సెకండ్ హేండ్ షాపుల్లో కొన్నవిలా అనిపించాయి. డగ్ ప్యాంట్‌కి వెనక ఉన్న రివాల్వర్‌ని చూసింది. గోడకి పొడుగ్గా ఉన్న కేస్... రైఫిల్ ఉంచేదని గ్రహించింది.
‘‘మీరు గర్భవతి అనుకుంటాను?’’ జేడ్ ప్రశ్నించింది.
‘‘అవును. ఏడో నెల. మాకు పెంపుడు కుక్క లేదు. పిల్లలు లేరు. కాబట్టి మావల్ల మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.’’
‘‘అంతేకాదు. ఈ కేక్‌ని ఎలా తయారుచేయాలో మీరు మా ఆవిడకి చెప్పాలి’’ ఓ చిన్న ముక్కని తుంపి తిని డగ్ నవ్వుతూ చెప్పాడు.
‘‘అది తిన్నాక ఆ మాట ఆవిడ చెప్పాలి. లేదా మీరు ఆమెని అవమానించినట్లే’’ జేడ్ నవ్వుతూ బదులు చెప్పింది.
‘‘మా పెళ్లయిన రెండేళ్లలో నేను కేవలం రెండుసార్లే కేక్ చేశాను’’ కరెన్ చెప్పింది.
‘‘మూడోసారి చేయొద్దన్నాను’’ డగ్ పూర్తిచేశాడు.
జేడ్ తన అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాక రిసీవర్ అందుకుని తన భర్తకి ఫోన్ చేసింది.
‘‘హలో జేడ్?’’
‘‘వాల్టర్! మన పక్కింట్లోకి ఓ దంపతులు దిగారు. నాకు వాళ్లు నచ్చలేదు. చవకబారు మనుషుల్లా కనిపించారు. అతని పేరు డగ్. అతని కళ్లు చూస్తే డ్రగ్ అడిక్ట్‌గా కనిపించాడు. బహుశా డ్రగ్ డీలరై ఉండచ్చు. మీరు తరచూ కేంపులకి వెళ్తూంటారు. ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటాను. మన లీజింగ్ ఆఫీస్‌కి ఫోన్‌చేసి వాళ్లని ఖాళీ చేయించమంటే మంచిది.’’
‘‘వాళ్లని చూసిన కొద్ది నిమిషాలకే ఓ నిర్ణయానికి రాకు. ప్రయాణంలో అలసిపోయి అతని మొహం అలా కనిపించి ఉండచ్చు. ఓ నెల గమనించి కానీ మనం ఓ నిర్ణయానికి రాకూడదు. తలుపుని డబుల్ లాక్ చేయడం మర్చిపోకు. చెయిన్ పెట్టడం కూడా’’ వాల్టర్ హెచ్చరించాడు.
వాల్టర్ కొద్దిరోజుల తర్వాత కేంప్‌కి వెళ్లాడు. మళ్లీ వచ్చాడు. మళ్లీ కేంప్‌కి వెళ్లాడు. మూడోసారి అతను కేంప్‌లో ఉండగా ఓ తెల్లవారుఝామున తలుపు చప్పుడుకి జేడ్‌కి మెలకువ వచ్చింది.
‘‘ఎవరది?’’ అడుగుతూ చేత్తో తడిమి బెడ్ సైడ్ దీపాన్ని వెలిగించి గడియారం వంక చూసింది. మూడూ ఇరవై ఐదు!
‘‘జేడ్! నేను డగ్‌ని.’’
పక్కింటాయన తనని ఇంత రాత్రప్పుడు పేరుపెట్టి పిలుస్తున్నాడు. ఎవరైనా వింటే ఏమనుకుంటారు?
‘‘మిసెస్ వాల్టర్. ఓసారి మీ ఫోన్ ఉపయోగించుకోవాలి. మాది పనిచేయడం లేదు’’ మళ్లీ అతని గొంతు వినిపించింది.
ఆమెకి భయం వేసి చెప్పింది.
‘‘ఈ వీధి చివర ఇప్పుడు తెరిచి ఉండే బార్ ఉంది. అక్కడ నించి చేయండి.’’
‘‘నేనక్కడి నించే వస్తున్నాను. అది మూసేసి ఉంది. కరెన్‌కి నొప్పులు వస్తున్నాయి. అంబులెన్స్‌కి ఫోన్ చేయాలి.’’
జేడ్‌కి తలుపు తీయాలని లేదు. ఎప్పుడూ మాసిన పాత ఆర్మీ జాకెట్, వెలిసిపోయిన జీన్స్‌తో కనిపించే డగ్‌కి తన భర్త ఇంట్లో లేడని తెలుసు.
‘‘మిసెస్ జేడ్! త్వరగా. నా భార్యకి నొప్పులు ఆరంభమయ్యాయి’’ డగ్ అర్థింపుగా కోరాడు.
తిరస్కరించలేక జేడ్ తలుపు తెరిచే ఉంచి అక్కడే నిలబడి చెప్పింది.
‘‘ఫోన్ అక్కడ ఉంది.’’
‘‘థాంక్స్ మిసెస్ జేడ్! ఇంత రాత్రి నిద్ర లేపినందుకు మన్నించండి.’’
అతన్నించి ఆల్కహాల్ వాసన వస్తోంది. టేబుల్ దగ్గరికి వెళ్లి రిసీవర్ అందుకుని దాన్ని మళ్లీ పెట్టేసి జేబులు తడుముకోసాగాడు.
‘‘ఈ జేబులోనే ఉండాలి...’’ అతను గొణగడం తను వినాలనే అని జేడ్‌కి అనిపించింది.
అతను జేబులోంచి పర్స్, తాళం చెవుల గుత్తి, కొన్ని మేగజైన్ కటింగ్స్, ఓ ప్లాస్టిక్ పేకెట్‌ని తీశాడు. అందులోని తెల్లటి పొడిని చూడగానే అది వీధుల్లో అమ్మే మాదకద్రవ్యంగా జేడ్ గుర్తించింది.
తన అనుమానం నిజమే అనుకుంది. తర్వాత అతను జేబులోంచి రివాల్వర్‌ని బయటికి తీశాడు. జేడ్ గుండె లయ తప్పింది. తక్షణం తన మనసులో అనేకసార్లు రిహార్సల్స్ వేసుకున్న విధంగా స్టీల్ కుర్చీని ఎత్తి అటు వైపు తిరిగి ఉన్న డగ్ తలమీద గట్టిగా మోదింది. చిన్నగా మూలుగుతూ అతను దబ్బున కిందపడ్డాడు. అతను జీవించే ఉన్నాడో లేక మరణించాడో జేడ్‌కి అర్థం కాలేదు. బల్లమీది రిసీవర్ని అందుకుని ఓ నంబర్‌కి డయల్ చేసి చెప్పింది.‘‘మా ఇంటికి ఆయుధంతో వచ్చిన ఓ దొంగని పట్టుకున్నాను’’ పేరు, అడ్రస్ మిగిలిన వివరాలు చెప్పి రిసీవర్‌ని పెట్టేసింది.
పోలీసులు వచ్చేలోగా ఆ ఐదు నిమిషాలు జేడ్ తలుపు బయటే నిలబడింది. పోలీస్ సైరన్స్ వినిపించాయి. యూనిఫాంలో పొడుగ్గా ఉన్న ఇద్దరు ఆమె దగ్గరికి వచ్చారు. డగ్ తన ఇంట్లోకి రావడానికి ఏం మోసం చేశాడో వారికి వివరించింది. అతన్ని చూసి ఒకతను ఒక అడుగు వెనక్కి వేసి చెప్పాడు.
‘‘డగ్!’’
‘‘మీకు తెలిసిన నేరస్థుడేనా?’’ జేడ్ అడిగింది.
‘‘కొంత నిజం. ఇతని పేరు డగ్లస్ మార్టిన్ ఫ్లెచర్. బేడ్జ్ నంబర్ 17582. నార్కో స్క్వాడ్‌లో పనిచేసే పోలీస్ ఆఫీసర్.’’
‘‘పోలీసా?’’ జేడ్ కంఠం వణికింది.
మరికొన్ని పోలీస్ కార్లు వచ్చాయి. కరెన్ ఏడుస్తోంది. జేడ్ ఆమె వంక చూడలేకపోయింది.
‘‘డగ్ సీక్రెట్ పోలీస్ కాబట్టి అతనేం చేస్తున్నాడో కరెన్ మీకెప్పుడూ చెప్పి ఉండదు. మీరు దుస్తులు మార్చుకుని మా వెంట పోలీస్ స్టేషన్‌కి రావాలి’’ ఓ అధికారి చెప్పాడు.
‘‘మీకు ఒక ఫోన్ కాల్ చేసుకునే హక్కుంది. మీ వారికి ఫోన్ చేయండి’’ అతను సూచించాడు.
(జాయెస్ హేరింగ్టన్ కథకి స్వేచ్ఛానువాదం)


