breaking news
Malladi Venkata Krishna
-
'ఆవిరి..' - ప్రాచీన్ కారు కొన్నప్పటి నుంచి..
ప్రాచీన్ కారు కొన్నప్పటి నుంచి గమ్యం దృష్టిలో ఉంచుకొని అటు వైపు డ్రైవ్ చేస్తూంటాడు. ఆ మధ్యాహ్నం మాత్రం అతను కారుని గమ్యం లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు. అతను కారెక్కి అరగంట దాటుతోంది. ట్రాఫిక్ పల్చగా ఉంది. ఎండ వల్ల హైద్రాబాద్ రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయని ప్రాచీన్ గుర్తించాడు. ఎన్నడూ లేనంతగా మండుటెండలు కాస్తున్న ఆ వేసవిలో ఆ రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని బయలుదేరేముందు టీవీలో చదివిన స్క్రోల్ గుర్తొచ్చింది. కారులో ఏసీ ఆన్ లో ఉన్నా, అది సౌకర్యంగా చల్లబరచలేకపోతోంది.ప్రాచీన్ వయసు ముప్ఫై మూడు. అతనికి పెళ్ళై రెండేళ్ళైంది. అతని ఆ ప్రయాణానికి కారణం, అతని భార్య. పెళ్ళయ్యాక మొదటిసారి వారి మధ్య తీవ్రమైన పోట్లాట జరిగింది. అతనికి ఆ తర్వాత ఇంట్లో ఉండటం ఇష్టంలేక బయటికి వచ్చి, రోడ్ మీద పార్క్ చేసిన కారెక్కి డ్రైవ్‌కి బయలుదేరాడు.తన తప్పు ఉందా అని అతను జరిగినది ఓసారి నెమరువేసుకున్నాడు.వేసవి సెలవులకి అతని అక్కయ్య, ముగ్గురు పిల్లలు హైద్రాబాద్‌లోని అతని ఇంటికి వచ్చారు. అందరితో కలిసి ఉండాలని ప్రాచీన్ తల్లిదండ్రులు కూడా పల్లెటూరి నుంచి అతని ఇంటికి వచ్చారు. జనగామ దగ్గర ఉన్న వారి చిన్న ఊరు ఇప్పుడు పల్లెటూరు కాదు. జనాభా పెరిగినా దాన్ని వాళ్ళు పల్లెటూరు అనే పిలుస్తారు.ఇంట్లో పెంపుడు కుక్కతో కలిపి తొమ్మిదిమందిని చూసుకునే బాధ్యత ప్రాచీన్ భార్య మీద పడింది. వాళ్ళు వచ్చి రెండు వారాలు దాటుతోంది. ప్రాచీన్ భార్య అందరికీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, సాయంత్రం టిఫిన్, రాత్రి భోజనం వండుతోంది.ప్రాచీన్ అక్కకి కంటికి ఆపరేషన్ అవడంతో కొంతకాలం పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదన్న కంటి డాక్టర్ సలహా వల్ల ఆవిడ అసలు వంటగదిలోకి వెళ్ళదు. ప్రాచీన్ తల్లికి అనారోగ్యం. ఆవిడ కూర్చున్న చోటు నుంచి కదలదు. మనవళ్ళతో కాలక్షేపం చేస్తుంది. ప్రాచీన్ భార్యకి వంటతో పాటు అందరి విడిచిన బట్టలు వాషింగ్ మెషిన్ లో వేసి ఉతకటం, ఆరేయడం, ఆరాక మడతలు పెట్టడం అదనపు బాధ్యత.తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన పనిమనిషి అదే సమయంలో సొంత ఊరికి వెళ్ళింది. సంతకం చేస్తే కాని ప్రభుత్వ ఉచితాలు రావు కాబట్టి తరచూ ఆమె తన ఊరు వెళ్ళి సంతకం చేసి వస్తూంటుంది. వెళ్ళినప్పుడల్లా రెండు, మూడు రోజుల్లో వచ్చేస్తుంది. కాని ఈసారి హైద్రాబాద్ ఎండలకి జడిసో, లేదా అంతమంది చుట్టాల వల్ల పని పెరగటం వల్లో వారమైనా తిరిగి రాలేదు. దాంతో ఇల్లు, పాత్రలు శుభ్రంచేసే పని కూడా ప్రాచీన్ భార్య చేయాల్సి వస్తోంది. పైగా కుక్కని వాకింగ్‌కి తీసుకెళ్లాలి. ప్రాచీన్ దంపతుల మధ్య ఆరోజు పోట్లాట చినుకుల్లా మొదలై తుఫానులా పరిణమించింది. అతిథులంతా సాలార్జంగ్ మ్యూజియం చూడటానికి వెళ్ళారు.కూరలు కొని తెచ్చి అతను తన భార్యతో చెప్పాడు.‘‘మా అక్కయ్యకి పాఠోళీ ఇష్టం. బీన్స్ తెచ్చాను. అది చెయ్యి.’’‘‘బంగాళదుంపల కూర చేస్తాను.’’ అతని భార్య చిరాగ్గా చెప్పింది.‘‘నేను చెప్పింది చేయొచ్చుగా?’’ భార్య చిరాకుని గమనించని ప్రాచీన్ చెప్పాడు.‘‘బీన్స్‌ని వలవాలి. కిలో బీన్స్ వలవటానికి చాలా టైం పడుతుంది. బంగాళదుంపల కూర తేలిగ్గా వండొచ్చు.’’ప్రాచీన్ కి ఆడవారి కష్టం, ముఖ్యంగా ఇంటికి అతిథులు వచ్చాక భార్య పడే కష్టం తెలీదు. దాంతో అడిగాడు.‘‘వాళ్ళు ఇంకో రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నారు. నేను అడిగిన ఈ ఒక్కటి చేయొచ్చుగా?’’వారి మధ్య మాటల యుద్ధం జరిగింది. తనవాళ్ళు రావడం తన భార్యకి ఇష్టం లేదని ప్రాచీన్ కి అనిపించింది.‘‘అదేం కాదు. నేను అంతమందికి చాకిరీ చేసి డస్సిపోయాను.’’ ప్రాచీన్ భార్య చెప్పింది.మాటా మాటా పెరిగింది. ప్రాచీన్ బయటకి వచ్చి కారెక్కి డ్రైవ్‌కి బయలుదేరాడు.గరగర చప్పుడుకి ఆలోచనల్లోంచి బయటపడ్డాడు. కారు ఆగిపోయింది. అతను మళ్ళీ స్టార్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కాని అది స్టార్ట్ కాలేదు. కొంత మెకానిజం తెలుసు కాబట్టి అతను కారు దిగి వెళ్ళి బానెట్ తలుపు ఎత్తి చూశాడు. వెచ్చగా తెల్లటి ఆవిరి బయటికి వచ్చింది. ఇంజిన్ వేడెక్కిందని గ్రహించాడు.కూలెంట్ ఉన్నా, బయటి అసాధారణ వేడికి, పైగా ఏసీ కూడా ఫుల్ కెపాసిటీలో ఆన్ లో ఉండడంతో ఇంజిన్ వేడెక్కిందని అర్థమయ్యాక అతను ఇంజిన్ వంక కొద్దిసేపు చూశాడు. అతనిలో కొత్త అవగాహన కలిగింది.ఎన్నడూ తనతో పోట్లాడని తన భార్య అంతగా ఎందుకు పోట్లాడిందో అతనికి ఇంజన్ నుంచి వెలువడే ఆవిరిని చూస్తూంటే అర్థమైంది.గత రెండు వారాలుగా శక్తికి మించి చేస్తున్న పనివల్ల కలిగిన అలసటతో ఆమె నోట్లోంచి ఆ మాటలు వచ్చాయి తప్ప, తనవాళ్ళు రావటం ఇష్టంలేక కాదని అతనికి స్ఫురించింది. అతనిలో ఏదో ఆవిరై పోయిన భావన కలిగింది.అతను జేబులోంచి మొబైల్ ఫోన్ తీసి తన భార్యకి ఫోన్ చేసి చెప్పసాగాడు.‘‘సారీ... నిన్ను అపార్థం చేసుకున్నందుకు వెరీ సారీ... వస్తున్నాను.’’- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
చోరుడు
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 17 ‘‘మిస్టర్ బార్టామ్. ఎవరైనా అయితే దొంగని పట్టుకోమని డిటెక్టివ్‌ని అర్థిస్తారు. కానీ నేను మిమ్మల్ని కోరేది మరొకటి’’ ఏండర్సన్ చెప్పాడు. ‘‘ఏమిటది?’’ బార్టామ్ నవ్వుతూ ప్రశ్నించాడు. ‘‘ముందుగా నా భాగస్వామి జాక్సన్ గురించి చెప్పాలి. మేమిద్దరం పదేళ్లుగా వ్యాపారం చేస్తున్నాం. ఇటీవల మా మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. జాక్సన్ దుర్మార్గుడని తెలిసినా, డాలర్‌ని రెండు డాలర్లు చేసే విద్య అతనికి తెలుసు కాబట్టి అతన్ని నా వ్యాపార భాగస్వామిగా కొనసాగించాను. నిన్న రాత్రి నేను మా ఇంట్లోకి వెళ్లేసరికి జాక్సన్ తన బ్రీఫ్ కేస్‌ని మూస్తూ కనిపించాడు. నన్ను చూసి నివ్వెరపోయాడు. ‘ఇక్కడేం చేస్తున్నావు?’ అని నేను ఆశ్చర్యంగా ప్రశ్నించాను.‘‘మన ఆఫీస్ తాళంచెవి, కొన్ని కాగితాలు నీకు ఇవ్వాలని వచ్చాను’’ తడబడుతూ చెప్పాడు.టేబుల్ మీద వాటిని చూపించి కొద్దిగా వణుకుతూ వేగంగా బయటికి వెళ్లిపోయాడు. అతని కారు శబ్దం వినిపించడం ఆగాక కానీ నేను తేరుకోలేదు. అతను నాకు చెందిన విలువైనదేదో దొంగిలించాడని అనిపిస్తోంది.’’ ‘‘ఏం దొంగిలించాడు?’’ ‘‘ఇంట్లో అన్నీ చూశాను. కానీ ఏది దొంగిలించాడో కనుక్కోలేకపోయాను. ఎందుకంటే నా దగ్గర నేను సేకరించిన వేల వస్తువులు ఉన్నాయి. అతను ఏదో దొంగిలించి తీసుకెళ్లాడని నాకు కచ్చితంగా తెలుసు. అది మీరు కనుక్కోవాలి’’ ఏండర్సన్ కోరాడు. ‘‘పోలీసులకి రిపోర్టు చేశారా?’’ బార్టామ్ అడిగాడు. ‘‘లేదు.’’ ‘‘ఎందుకని?’’ ‘‘అతను ఏం దొంగిలించాడో నాకు తెలీదుగా. మా ఇంటి నిండా అనేక విలువైన వస్తువులు ఉన్నాయి. వాటిని చాలా ఖరీదు పెట్టి కొన్నాను. ఉదాహరణకి ఆరు పురాతన వాచీలు ఉన్నాయి. ఆరా లేక ఏడా? సరిగ్గా గుర్తురావడం లేదు.’’ ‘‘జాక్సన్ ఏదైనా ఎత్తుకెళ్లాడని మీకెందుకు అనిపించింది?’’ బార్టామ్ ప్రశ్నించాడు. ‘‘అతను వెళ్లాక, ఎవరో ఫోన్ చేసి చెప్పారు- జాక్సన్ మీ ఇంట్లోంచి ఏం దొంగిలించాడో మీరెప్పటికీ తెలుసుకోలేరు అని. వెంటనే వెతికితే వాచీలున్నాయి. అతను ఏం దొంగిలించాడో మీరు కనుక్కోగలరా?’’ ‘‘ఇంట్లో ఎలాంటి విలువైనవి ఉన్నాయి?’’ ‘‘చాలా. సేకరించిన అనేక తపాలా బిళ్లలు, పురాతన పుస్తకాలు, ఒకప్పటి ప్రేయసి ఫొటో, కొన్ని చిత్రాలు, అనేక విదేశీ కరెన్సీలు... ఇవి మీకు చెత్త అనిపించచ్చు కానీ, నాకు విలువైనవి. నా డైరీ ఎక్కడుందో నాకు తెలీదు. దాన్ని దొంగిలించి ఉంటే జాక్సన్ నన్ను బ్లాక్మెయిల్ చేయొచ్చు’’ ఏండర్సన్ చెప్పాడు. బార్టామ్ కొన్ని క్షణాలు ఆలోచించి చెప్పాడు. ‘‘అతను దేనినైనా బ్రీఫ్ కేస్‌లో పెట్టుకుంటుండగా చూశారా?’’ ‘‘లేదు. మూయడమే చూశాను.’’ ‘‘అతను అంతకుమునుపే బ్రీఫ్ కేస్‌లో పట్టని పియానోనో, అలాంటి ఇంక దేన్నైనానో కారులో ఎక్కించి ఉండచ్చు. బ్రీఫ్ కేస్ మూస్తూండగా చూడడంతో అందులోనే ఏదో తీసుకెళ్లాడని మీరు భ్రమపడి ఉంటారేమో?’’ ‘‘పెద్దవి... ఉన్న స్థానంలోంచి మాయమైతే ఇట్టే గ్రహించగలను. అవేమీ మాయమవలేదు. ఓసారి జాక్సన్‌కి మా ఇంట్లోని ఓ తపాలా బిళ్లని చూపించి అది విలువైన తపాలా బిళ్ల అవడానికి ఎన్గ్రేవింగ్లో గల తప్పుని చూపించాను. ఇప్పుడు పోయిన వస్తువు లేదా వస్తువులు ఏమిటో నాకు అర్థం కావడం లేదు.’’ ‘‘సరే. నేను ప్రయత్నిస్తాను. జాక్సన్ అడ్రస్, ఫొటో ఇవ్వండి’’ బార్టామ్ కోరాడు. అతను అనుకున్న దానికన్నా ఎక్కువ ఫీజు ముట్టజెప్పాడు ఏండర్సన్. జాక్సన్‌ని ఇరవై నాలుగ్గంటల సేపు బార్టామ్ రహస్యంగా అనుసరించాడు. కానీ ఉపయోగం లేకపోయింది. అతను బద్ధకస్తుడిలా ఇంట్లోంచి బయటికి రానేలేదు. బయటికి వెళ్తే, అతని ఇంటిని రహస్యంగా సోదా చేయాలనుకున్న బార్టామ్ కోరిక నెరవేరలేదు. జాక్సన్‌నే కలిసి ‘ఏం దొంగిలించావు’ అని అడగాలనుకున్నాడు. కానీ అది తన వృత్తికి సరిపోదని విరమించుకున్నాడు. జాక్సన్ దొంగిలించిన వస్తువు ఏదో తెలుసుకోకుండానే రోజులు వారాలుగా మారాయి. ఐదేళ్లు గడిచాక ఓ రోజు ఏండర్సన్ మరణించాడని అతని భార్య దినపత్రికలో ప్రచురించిన సంస్మరణని బార్టామ్ చదివాడు. అతనికి వెంటనే జాక్సన్ గుర్తొచ్చాడు. ఏండర్సన్ ఫ్యూనరల్కి బార్టామ్ హాజరయ్యాడు. దానికి జాక్సన్ కూడా వచ్చాడు. ‘‘నన్ను మీకు పరిచయం చేసుకోనీండి మిస్టర్ జాక్సన్. నా పేరు బార్టామ్. నేను డిటెక్టివ్‌ని. ఐదేళ్ల క్రితం ఏండర్సన్ అకస్మాత్తుగా తన ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు బ్రీఫ్ కేస్‌ని మూస్తున్నారు. అతన్ని చూసి కళవళపడ్డారు. అది నిజమేనా?’’ ‘‘నిజమే’’ జాక్సన్ అంగీకరించాడు. ‘‘మీరు ఏదైనా దొంగిలించారా?’’ ‘‘అవును.’’ ‘‘అది విలువైందేనా?’’ ‘‘దాన్ని పోగొట్టుకుంటే ఎవరైనా మథనపడతారు కాబట్టి విలువైనదే. నేను దొంగిలించిన దాని గురించి రోజూ తలచుకుంటూనే ఉన్నాను.’’ ‘‘దాన్ని మీరు ఆ బ్రీఫ్ కేస్‌లోనే ఉంచి తీసుకెళ్లారా?’’ ‘‘ఆ బ్రీఫ్ కేస్ ఖాళీది అన్న రహస్యం ఏండర్సన్‌కి తెలీదు.’’ ‘‘ఐతే మీరు దొంగిలించిన వస్తువులని జేబులో పెట్టి తీసుకెళ్లారా?’’ ‘‘నేను అతని ఇంట్లోంచి ఏ వస్తువునీ దొంగిలించలేదు.’’ ‘‘మరి? ఇందాక దొంగనని ఒప్పుకున్నారు?’’ బార్టామ్ ప్రశ్నించాడు. ‘‘నేను దొంగిలించింది అతని మనశ్శాంతిని’’ జాక్సన్ మృదువుగా చెప్పాడు. (ఐజక్ అసిమోవ్ కథకి స్వేచ్ఛానువాదం) -
పెనుభూతం
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 8 తన పక్కింట్లోకి కొత్తగా ఎవరో అద్దెకి వచ్చారని సామాను చప్పుడు బట్టి జేడ్కి అర్థమైంది. వెంటనే లీజింగ్ ఆఫీస్‌కి ఫోన్ చేసి అడిగితే నిజమే అని తెలిసింది. ఆ రోజు జేడ్ ఫ్రిజ్‌లో రెండు రోజుల క్రితం పెట్టిన పీజాని వేడి చేసుకుని తిందామను కుంది. కానీ ఆ ఆలోచనని విరమించుకుని నలభై నిమిషాల్లో రెండు కేక్లని తయారుచేసింది. ఓ కేక్‌ని తనకి ఉంచుకుని, మరొక దాన్ని ప్లేట్లో పెట్టి మూతపెట్టి వెళ్లి పక్క అపార్ట్మెంట్ తలుపు తట్టింది. తలుపు తీసిన ముప్ఫై ఏళ్ల యువతికి తనని పరిచయం చేసుకుంది. ‘‘నా పేరు జేడ్ వాల్టర్. మీ పక్క అపార్ట్మెంట్లో ఉంటాను. మీరు ఇవాళే వచ్చారు కాబట్టి, వంట చేసే అవకాశం ఉండకపోవచ్చని కేక్ వండి తెచ్చాను.’’ దాన్నందుకున్న పక్కింటామె చెప్పింది. ‘‘థాంక్స్ మిసెస్ జేడ్ వాల్టర్. నా పేరు కరెన్. ఈయన నా భర్త డగ్.’’ ‘‘ప్లేట్‌ని తర్వాత తీసుకుంటాను. నేను పదిహేనేళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ జీవితం ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతోంది. నా భర్త వాల్టర్ చెప్పుల కంపెనీకి రిప్రజెంటేటివ్. నేను పెద్దగా టీవీ చూడను. కాబట్టి నిట్టింగ్ చేస్తూంటాను.’’ ‘‘మిసెస్ వాల్టర్. మేము సామాను సర్దుకున్నాక మీరు మా ఇంటికి కాఫీకి రావాలి’’ కరెన్ ఆహ్వానించింది. వాళ్లతో మాట్లాడుతూనే జేడ్ కళ్లు చురుగ్గా ఆ అపార్ట్‌మెంట్‌ని పరిశీలించాయి. సామాను బయటికి తీయని అట్టపెట్టెలు చాలా ఉన్నాయి. పాత ఫర్నిచర్ సెకండ్ హేండ్ షాపుల్లో కొన్నవిలా అనిపించాయి. డగ్ ప్యాంట్‌కి వెనక ఉన్న రివాల్వర్ని చూసింది. గోడకి పొడుగ్గా ఉన్న కేస్... రైఫిల్ ఉంచేదని గ్రహించింది. ‘‘మీరు గర్భవతి అనుకుంటాను?’’ జేడ్ ప్రశ్నించింది. ‘‘అవును. ఏడో నెల. మాకు పెంపుడు కుక్క లేదు. పిల్లలు లేరు. కాబట్టి మావల్ల మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.’’ ‘‘అంతేకాదు. ఈ కేక్‌ని ఎలా తయారుచేయాలో మీరు మా ఆవిడకి చెప్పాలి’’ ఓ చిన్న ముక్కని తుంపి తిని డగ్ నవ్వుతూ చెప్పాడు. ‘‘అది తిన్నాక ఆ మాట ఆవిడ చెప్పాలి. లేదా మీరు ఆమెని అవమానించినట్లే’’ జేడ్ నవ్వుతూ బదులు చెప్పింది. ‘‘మా పెళ్లయిన రెండేళ్లలో నేను కేవలం రెండుసార్లే కేక్ చేశాను’’ కరెన్ చెప్పింది. ‘‘మూడోసారి చేయొద్దన్నాను’’ డగ్ పూర్తిచేశాడు. జేడ్ తన అపార్ట్మెంట్లోకి వెళ్లాక రిసీవర్ అందుకుని తన భర్తకి ఫోన్ చేసింది. ‘‘హలో జేడ్?’’ ‘‘వాల్టర్! మన పక్కింట్లోకి ఓ దంపతులు దిగారు. నాకు వాళ్లు నచ్చలేదు. చవకబారు మనుషుల్లా కనిపించారు. అతని పేరు డగ్. అతని కళ్లు చూస్తే డ్రగ్ అడిక్ట్‌గా కనిపించాడు. బహుశా డ్రగ్ డీలరై ఉండచ్చు. మీరు తరచూ కేంపులకి వెళ్తూంటారు. ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటాను. మన లీజింగ్ ఆఫీస్‌కి ఫోన్‌చేసి వాళ్లని ఖాళీ చేయించమంటే మంచిది.’’ ‘‘వాళ్లని చూసిన కొద్ది నిమిషాలకే ఓ నిర్ణయానికి రాకు. ప్రయాణంలో అలసిపోయి అతని మొహం అలా కనిపించి ఉండచ్చు. ఓ నెల గమనించి కానీ మనం ఓ నిర్ణయానికి రాకూడదు. తలుపుని డబుల్ లాక్ చేయడం మర్చిపోకు. చెయిన్ పెట్టడం కూడా’’ వాల్టర్ హెచ్చరించాడు. వాల్టర్ కొద్దిరోజుల తర్వాత కేంప్‌కి వెళ్లాడు. మళ్లీ వచ్చాడు. మళ్లీ కేంప్‌కి వెళ్లాడు. మూడోసారి అతను కేంప్లో ఉండగా ఓ తెల్లవారుఝామున తలుపు చప్పుడుకి జేడ్కి మెలకువ వచ్చింది. ‘‘ఎవరది?’’ అడుగుతూ చేత్తో తడిమి బెడ్ సైడ్ దీపాన్ని వెలిగించి గడియారం వంక చూసింది. మూడూ ఇరవై ఐదు! ‘‘జేడ్! నేను డగ్ని.’’ పక్కింటాయన తనని ఇంత రాత్రప్పుడు పేరుపెట్టి పిలుస్తున్నాడు. ఎవరైనా వింటే ఏమనుకుంటారు? ‘‘మిసెస్ వాల్టర్. ఓసారి మీ ఫోన్ ఉపయోగించుకోవాలి. మాది పనిచేయడం లేదు’’ మళ్లీ అతని గొంతు వినిపించింది. ఆమెకి భయం వేసి చెప్పింది. ‘‘ఈ వీధి చివర ఇప్పుడు తెరిచి ఉండే బార్ ఉంది. అక్కడ నించి చేయండి.’’ ‘‘నేనక్కడి నించే వస్తున్నాను. అది మూసేసి ఉంది. కరెన్కి నొప్పులు వస్తున్నాయి. అంబులెన్స్‌కి ఫోన్ చేయాలి.’’ జేడ్కి తలుపు తీయాలని లేదు. ఎప్పుడూ మాసిన పాత ఆర్మీ జాకెట్, వెలిసిపోయిన జీన్స్‌తో కనిపించే డగ్కి తన భర్త ఇంట్లో లేడని తెలుసు. ‘‘మిసెస్ జేడ్! త్వరగా. నా భార్యకి నొప్పులు ఆరంభమయ్యాయి’’ డగ్ అర్థింపుగా కోరాడు. తిరస్కరించలేక జేడ్ తలుపు తెరిచే ఉంచి అక్కడే నిలబడి చెప్పింది. ‘‘ఫోన్ అక్కడ ఉంది.’’ ‘‘థాంక్స్ మిసెస్ జేడ్! ఇంత రాత్రి నిద్ర లేపినందుకు మన్నించండి.’’ అతన్నించి ఆల్కహాల్ వాసన వస్తోంది. టేబుల్ దగ్గరికి వెళ్లి రిసీవర్ అందుకుని దాన్ని మళ్లీ పెట్టేసి జేబులు తడుముకోసాగాడు. ‘‘ఈ జేబులోనే ఉండాలి...’’ అతను గొణగడం తను వినాలనే అని జేడ్కి అనిపించింది. అతను జేబులోంచి పర్స్, తాళం చెవుల గుత్తి, కొన్ని మేగజైన్ కటింగ్స్, ఓ ప్లాస్టిక్ పేకెట్ని తీశాడు. అందులోని తెల్లటి పొడిని చూడగానే అది వీధుల్లో అమ్మే మాదకద్రవ్యంగా జేడ్ గుర్తించింది. తన అనుమానం నిజమే అనుకుంది. తర్వాత అతను జేబులోంచి రివాల్వర్ని బయటికి తీశాడు. జేడ్ గుండె లయ తప్పింది. తక్షణం తన మనసులో అనేకసార్లు రిహార్సల్స్ వేసుకున్న విధంగా స్టీల్ కుర్చీని ఎత్తి అటు వైపు తిరిగి ఉన్న డగ్ తలమీద గట్టిగా మోదింది. చిన్నగా మూలుగుతూ అతను దబ్బున కిందపడ్డాడు. అతను జీవించే ఉన్నాడో లేక మరణించాడో జేడ్కి అర్థం కాలేదు. బల్లమీది రిసీవర్ని అందుకుని ఓ నంబర్‌కి డయల్ చేసి చెప్పింది.‘‘మా ఇంటికి ఆయుధంతో వచ్చిన ఓ దొంగని పట్టుకున్నాను’’ పేరు, అడ్రస్ మిగిలిన వివరాలు చెప్పి రిసీవర్ని పెట్టేసింది. పోలీసులు వచ్చేలోగా ఆ ఐదు నిమిషాలు జేడ్ తలుపు బయటే నిలబడింది. పోలీస్ సైరన్స్ వినిపించాయి. యూనిఫాంలో పొడుగ్గా ఉన్న ఇద్దరు ఆమె దగ్గరికి వచ్చారు. డగ్ తన ఇంట్లోకి రావడానికి ఏం మోసం చేశాడో వారికి వివరించింది. అతన్ని చూసి ఒకతను ఒక అడుగు వెనక్కి వేసి చెప్పాడు. ‘‘డగ్!’’ ‘‘మీకు తెలిసిన నేరస్థుడేనా?’’ జేడ్ అడిగింది. ‘‘కొంత నిజం. ఇతని పేరు డగ్లస్ మార్టిన్ ఫ్లెచర్. బేడ్జ్ నంబర్ 17582. నార్కో స్క్వాడ్‌లో పనిచేసే పోలీస్ ఆఫీసర్.’’ ‘‘పోలీసా?’’ జేడ్ కంఠం వణికింది. మరికొన్ని పోలీస్ కార్లు వచ్చాయి. కరెన్ ఏడుస్తోంది. జేడ్ ఆమె వంక చూడలేకపోయింది. ‘‘డగ్ సీక్రెట్ పోలీస్ కాబట్టి అతనేం చేస్తున్నాడో కరెన్ మీకెప్పుడూ చెప్పి ఉండదు. మీరు దుస్తులు మార్చుకుని మా వెంట పోలీస్ స్టేషన్‌కి రావాలి’’ ఓ అధికారి చెప్పాడు. ‘‘మీకు ఒక ఫోన్ కాల్ చేసుకునే హక్కుంది. మీ వారికి ఫోన్ చేయండి’’ అతను సూచించాడు. (జాయెస్ హేరింగ్టన్ కథకి స్వేచ్ఛానువాదం) -
సినిమాకు అనుకుంటే... సీరియలైంది...
మల్లాది వెంకట కృష్ణమూర్తి... 1970ల నుంచి ఇప్పటి దాకా నిర్విరామంగా రచననే నమ్ముకున్న కమర్షియల్ నవలా రచయిత, కథకుడు, కాలమిస్టు. కాలానికి తగ్గట్లు ఇతివృత్తాన్నీ, రచనాశైలినీ మార్చుకుంటూ, ఆయన రాసినవి - 150 దాకా నవలలు. అరడజను పైగా ట్రావెలాగ్లు. మూడు వేల కథలు. ఇవీ ఇన్నేళ్ళలో ఎప్పుడూ తన ఫోటో ప్రచురణకివ్వని మల్లాది అక్షరాలా పంచిన ఆస్తి. ‘సాక్షి’ కోసం ఆయన తొలిసారి రాసిన నవతరం డైలీ సీరియల్ క్రైమ్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ ‘త్రీ మంకీస్’. విశేష ఆదరణ పొందిన ఈ సీరియల్ ముగుస్తున్న వేళ మల్లాది మనోభావాల మేఘమాల... మల్లాది రైటింగ్ టేబుల్ రెంటాల జయదేవ ఈ వయసులో ఒక్క క్షణం ఆగి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, జరిగిన సంఘటనల క్రమం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకప్పుడు నమ్మినా, నమ్మకపోయినా ఇప్పుడు మాత్రం అంతా దైవఘటన అనే నమ్మకం, అనుభవం నాకు బలపడుతోంది. నిజానికి, అసలు ‘త్రీ మంకీస్’ కథ - సీరియల్ కాదు, సినీ స్క్రిప్ట్. కేవలం 13 రోజుల్లో రాశా! దర్శక - నిర్మాత పూరి జగన్నాథ్ కొన్నాళ్ళ క్రితం మాటల్లో నవతరానికి తగ్గట్లు ఒక క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ కథాంశం కావాలన్నారు. ఆ ఆలోచనలతో ఒక రోజు రాత్రంతా కూర్చొని, ‘త్రీ మంకీస్’ ఇతివృత్తం ఆలోచించి, సినిమాకు తగ్గట్లు వన్‌లైన్ ఆర్డర్ సిద్ధం చేశా. ఇంతలో ఆ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడింది. ఆ సమయంలో ‘సాక్షి’ సంపాదకులు పిలిచి, డైలీ సీరియల్ కావాలన్నారు. రకరకాలనుకున్నాక, సంపాదకులూ ‘నవ తరాన్ని ఆకర్షించే క్రైమ్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్’ కథాంశం కావాలన్నారు. ‘త్రీ మంకీస్’ ఆలోచన చెప్పగానే అందరికీ నచ్చింది. దాంతో, ఆ స్క్రిప్టును నవలకు తగ్గట్లు తీర్చిదిద్ది, రాసేశా. ఇటీవల నేను అతి వేగంగా 13 రోజుల్లో రాసిన నవలిది. సినిమా అనుకున్నది సీరియలవడం దేవుడి నిర్ణయమే.1992-’93లో ఉపగ్రహ టీవీ చానల్స్ రాకతో నవలా పాఠకులు తగ్గారు. ఒకప్పుడు హాట్‌కేకులైన పాపులర్ రచయితల నవలల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అప్పటి నవలలకు ఇప్పుడు గిరాకీ! ఆ క్రమంలో కొంతమంది ఇతర వ్యాసంగాల వైపు మళ్ళినా, అదే సమయంలో ‘లిపి పబ్లికేషన్స్’ అంటూ ప్రచురణ సంస్థ పెట్టుకొని, సొంతంగా పుస్తకాలు ప్రచురించడం మొదలుపెట్టా. గత నాలుగేళ్ళుగా కొవ్వలి, కొమ్మూరి సాంబశివరావు మొదలు నాతో సహా యండమూరి, యద్దనపూడి తదితరుల పాత పాపులర్ నవలలు మళ్ళీ బాగా అమ్ముడవుతున్నాయి. టీవీతో విసుగెత్తిన పాత తరం పాఠకులు మళ్ళీ తమ పాత తీపి జ్ఞాపకాలను ఈ నవలా పఠనంలో వెతుక్కుంటున్నారు. కానీ, దురదృష్టం ఏమిటంటే, అందరూ ఆ పాత పాఠకులే. ఈ ఇంగ్లీష్ మీడియమ్ చదువుల ఇంటర్నెట్ యుగంలో కొత్తగా పాఠకులు వచ్చి చేరుతున్నది తక్కువ. అప్పటి నవలా ప్రియులున్నంతకాలం ఈ నవలలు ఉంటాయి. వాళ్ళు పోయాక, ఇవీ పోతాయి. పాపులర్ నవలా శకానికి తెర పడుతుంది. రోజుకు 12 గంటలు రాతే! నాకు రాయడం తప్ప వేరే పని చేతకాదు కాబట్టి, నిర్విరామంగా రాస్తూనే ఉంటాను. ఒకటో తారీఖున పాలవాడు వచ్చి తలుపు కొట్టినప్పుడు డబ్బులివ్వాలిగా! (నవ్వులు...). తమాషా పక్కన పెడితే, అసలు విషయం ఏమిటంటే - రాయడంలోనే నాకు ఎక్కడ లేనంత ఆనందం వస్తుంది. ఇప్పటికీ రోజుకు కనీసం 10 నుంచి 12 గంటల పాటు రాయడం, చదవడం, వచ్చిన ఆలోచనల్ని వచ్చినట్లు రాసిపెట్టుకోవడం - ఇలా ఆ వ్యాసంగంలోనే ఉంటా. సంపాదన... అభిమాన ధనమే! ఇన్నేళ్ళుగా ఇన్ని నవలలు, కథలు రాశా కాబట్టి, నాకు చాలా ఆదాయం వస్తుందనీ, కోట్లలో గడించాననీ చాలామంది భావిస్తుంటారు. కానీ, పాఠకుల అభిమానధనం సంపాదించినంతగా, ధనం సంపాదించ లేదు. అందుకు నేను బాధపడడం లేదు. రచయితగా నా దృష్టి అంతా రచనాశిల్పం మీదే ఉండేది. నన్ను నేను మార్కెట్ చేసుకోవడం తెలియదు. క్రమంగా యండమూరి వల్ల కొంత నేర్చుకున్నా. కానీ, ఈ రోజుకీ డబ్బులు డిమాండ్ చేయడం, వసూలు చేసుకోవడం తెలియదు. మా నాన్న గారికి అప్పు తీసుకోవడం ఇష్టం లేదు. ఉన్నదాంట్లోనే గుట్టుగా సంసారం నడపాలన్న మధ్యతరగతి కుటుంబ సిద్ధాంతం ఆయనది. నాకూ అదే వచ్చింది. తొలిరోజుల్లో ఏ.జి. ఆఫీసులో కమర్షియల్ ఆడిట్ విభాగంలో పన్నెండేళ్ళు ఉద్యోగం చేశా. ప్రభుత్వోద్యోగంలో ఉండగా 1974 ఏప్రిల్‌లో మాత్రం అవసరానికి డబ్బుల్లేక చాలా అవస్థ పడ్డా. అది ఇప్పటికీ మర్చిపోలేను. చేతిరాత నుంచి కంప్యూటర్ దాకా! గతంలో నవలలు, కథలు స్వయంగా రాసేవాణ్ణి. నా చేతిరాత గుండ్రంగా ఉండదు. పైగా, ఆలోచనలు వచ్చినంత వేగంగా రాయాలనే తపనలో అది అలవాటు చేసుకోవడంతో చేతిరాత బాగా చెడిపోయింది. దాంతో, ఒకప్పటి హ్యాండ్ కంపోజిటర్లు కాదు కానీ, పత్రికల్లోని నేటి తరం డి.టి.పి. ఆపరేటర్లు ఇబ్బంది పడేవారు. అదే సమయంలో స్వామి తత్త్వవిదానంద అనే స్వామీజీ తన పుస్తకానికి తానే కంపోజ్ చేసుకున్నట్లు చెప్పారు. ఒక సన్న్యాసికి ఉన్నపాటి కమిట్మెంట్ మనకు లేకపోయిందే అని సిగ్గుపడి, వారం రోజుల్లో కంప్యూటర్లో కంపోజింగ్ చేయడం నేర్చుకున్నా. అలా 2004 నుంచి అంతా కంప్యూటర్ మీదే! పత్రికలకు నిర్వహించే శీర్షికల లాంటివి మాత్రం మా ఆవిడ డి. పద్మజకు (ఆమె పేరు నా కలం పేర్లలో ఒకటి) డిక్టేట్ చేస్తుంటా. నేను గబగబా రాసినవి కంపోజ్ చేసి ఇవ్వడానికి మాత్రం ఒక డి.టి.పి. కంపోజిటర్ను పెట్టుకున్నా! దేవుడు రాయించాడు! కొన్నేళ్ళక్రితం అనుకోకుండా జరిగిన అనుభవంతో ఆధ్యాత్మికత వైపు మళ్ళా. కేరళలో పుట్టి, కర్ణాటకలో ఉండి, చివరకు మహారాష్ట్రలోని గణేశ్పురిలో స్థిరపడ్డ జీవన్ముక్త అవధూత సద్గురు నిత్యానంద బాబా మార్గంలోకి వెళ్ళాను. అప్పటి నుంచి నా జీవితమే మారిపోయింది. (గద్గదికంగా...) అదంతా మరో పెద్ద కథ. 2003 నుంచి ఆధ్యాత్మిక నవలలు మాత్రం ‘జయం’, ‘పరంజ్యోతి’, ‘విధాత’ అనే మూడే వెలువరించా. 400కి పైగా ఆధ్యాత్మిక కథలు నా కలం నుంచొచ్చాయి. అవన్నీ నేను కాదు, నా మనసులో దేవుడిచ్చి న ఆలోచనలు, నాతో రాయించుకున్నవే. నా నెక్స్ట్ నవల ‘ప్రయాణం’ఆధ్యాత్మికమే! మారుతున్న తరానికి తగ్గట్లు... ప్రతి ఏడేళ్ళకూ తరం మారిపోతుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త తరం యువతీ యువకులను గమనించడం, మాట్లాడడం ద్వారా వాళ్ళకు తగ్గట్లు రాసేవాణ్ణి. పెరిగి పెద్దయ్యే వరకు మా ముగ్గురు అమ్మాయిలు (కావ్య, ఊహ, లిపి), వాళ్ళ స్నేహితులతో మాటామంతీ బాగా ఉపయోగపడింది. మా అమ్మాయిలు అమెరికాలో చదివి, అక్కడే ఉద్యోగాలకు వెళ్ళిపోయాక చుట్టుపక్కల పిల్లలతో మాట్లాడుతూ, కొత్త తరం అభిరుచులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. తాజా ‘త్రీ మంకీస్’ కూడా అలా ఆధునిక స్మార్ట్‌ఫోన్, ఫేస్బుక్ తరానికి తగ్గట్లు రాసిందే! సమాజంలో తగ్గిన విలువలకు ప్రతీకలైన పాత్రలనే హీరోలుగా పెట్టి, నవల రాయడం నాకిదే తొలిసారి. రోజుకు 16 గంటలు పనిచేస్తూ, ఏకబిగిన రాసేశా. తక్కువ డైలాగ్స్‌తో ఎక్కువ హాస్యం పలికించా. ఏమైనా, ఎవరూ ఇక్కడ శాశ్వతం కాదు. మనం ఈ ప్రపంచానికి వదిలివెళ్ళేది ఏమీ లేదు. రచయిత వెళ్ళిపోయినా, రేపు పొద్దున్న మిగిలేది అతని రచనలే. నా రచనలు శాశ్వతమని కాదు కానీ, కనీసం మరో 50 ఏళ్ళయినా ఇవి పాఠకులను అలరించి, ఆనందాన్ని కలిగించాలని నా భావన. ఫొటోలెందుకు ప్రచురణకు ఇవ్వనంటే..! నాకు అయిదుగురక్కలు, ఒక అన్నయ్య, ఇద్దరు తమ్ముళ్ళు. ఇంత పెద్ద సంసారాన్ని తన కొచ్చే కొద్దిపాటి ఆదాయంతో నడపడం నాన్న కెంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. అందుకే, అప్పట్లో ఫోటో తీయించుకోవడమనేది మాకు లగ్జరీ. ఫలితంగా, చిన్నప్పటి ఫోటోలు లేవు. ఇక, నేను రచయితనయ్యాక నా స్ఫూర్తి అయిన కొమ్మూరి సాంబశివరావు బాటను అనుసరించా. ఆయన లాగే నేనూ ఫోటోలేవీ పత్రికలకు ఇవ్వలేదు. నేనెవరో, ఎలా ఉంటానో తెలియకపోవడంతో సామాన్యులతో కలసిపోయి, సంగతులు తెలుసుకొనే అవకాశాన్ని కాపాడుకోగలిగా. జర్నలిస్టులు, సంపాదకులు, అభి మానులూ ఫోటో విషయంలో నా అభిప్రాయాన్ని మన్నించారు.


