సినిమాకు అనుకుంటే... సీరియలైంది... | If you want the film serial . | Sakshi
Sakshi News home page

సినిమాకు అనుకుంటే... సీరియలైంది...

Jan 10 2015 10:51 PM | Updated on Sep 2 2017 7:30 PM

సినిమాకు అనుకుంటే... సీరియలైంది...

సినిమాకు అనుకుంటే... సీరియలైంది...

మల్లాది వెంకట కృష్ణమూర్తి... 1970ల నుంచి ఇప్పటి దాకా నిర్విరామంగా రచననే నమ్ముకున్న కమర్షియల్ నవలా రచయిత,

మల్లాది వెంకట కృష్ణమూర్తి... 1970ల నుంచి ఇప్పటి దాకా నిర్విరామంగా రచననే నమ్ముకున్న కమర్షియల్ నవలా రచయిత, కథకుడు, కాలమిస్టు. కాలానికి తగ్గట్లు ఇతివృత్తాన్నీ, రచనాశైలినీ మార్చుకుంటూ, ఆయన రాసినవి - 150 దాకా నవలలు. అరడజను పైగా ట్రావెలాగ్‌లు. మూడు వేల కథలు. ఇవీ ఇన్నేళ్ళలో ఎప్పుడూ తన ఫోటో ప్రచురణకివ్వని మల్లాది అక్షరాలా పంచిన ఆస్తి. ‘సాక్షి’ కోసం ఆయన తొలిసారి రాసిన నవతరం డైలీ సీరియల్ క్రైమ్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ ‘త్రీ మంకీస్’. విశేష ఆదరణ పొందిన ఈ సీరియల్ ముగుస్తున్న వేళ మల్లాది మనోభావాల మేఘమాల...
 
 
మల్లాది రైటింగ్ టేబుల్

 రెంటాల జయదేవ
 
ఈ వయసులో ఒక్క క్షణం ఆగి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, జరిగిన సంఘటనల క్రమం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకప్పుడు నమ్మినా, నమ్మకపోయినా ఇప్పుడు మాత్రం అంతా దైవఘటన అనే నమ్మకం, అనుభవం నాకు బలపడుతోంది. నిజానికి, అసలు ‘త్రీ మంకీస్’ కథ - సీరియల్ కాదు, సినీ స్క్రిప్ట్.

కేవలం 13 రోజుల్లో రాశా!

దర్శక - నిర్మాత పూరి జగన్నాథ్ కొన్నాళ్ళ క్రితం మాటల్లో నవతరానికి తగ్గట్లు ఒక క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ కథాంశం కావాలన్నారు. ఆ ఆలోచనలతో ఒక రోజు రాత్రంతా కూర్చొని, ‘త్రీ మంకీస్’ ఇతివృత్తం ఆలోచించి, సినిమాకు తగ్గట్లు వన్‌లైన్ ఆర్డర్ సిద్ధం చేశా. ఇంతలో ఆ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడింది. ఆ సమయంలో ‘సాక్షి’ సంపాదకులు పిలిచి, డైలీ సీరియల్ కావాలన్నారు. రకరకాలనుకున్నాక, సంపాదకులూ ‘నవ తరాన్ని ఆకర్షించే క్రైమ్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్’ కథాంశం కావాలన్నారు. ‘త్రీ మంకీస్’ ఆలోచన చెప్పగానే అందరికీ నచ్చింది. దాంతో, ఆ స్క్రిప్టును నవలకు తగ్గట్లు తీర్చిదిద్ది, రాసేశా. ఇటీవల నేను అతి వేగంగా 13 రోజుల్లో రాసిన నవలిది. సినిమా అనుకున్నది సీరియలవడం దేవుడి నిర్ణయమే.1992-’93లో ఉపగ్రహ టీవీ చానల్స్ రాకతో నవలా పాఠకులు తగ్గారు. ఒకప్పుడు హాట్‌కేకులైన పాపులర్ రచయితల నవలల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.

అప్పటి నవలలకు ఇప్పుడు గిరాకీ!

 ఆ క్రమంలో కొంతమంది ఇతర వ్యాసంగాల వైపు మళ్ళినా, అదే సమయంలో ‘లిపి పబ్లికేషన్స్’ అంటూ ప్రచురణ సంస్థ పెట్టుకొని, సొంతంగా పుస్తకాలు ప్రచురించడం మొదలుపెట్టా. గత నాలుగేళ్ళుగా కొవ్వలి, కొమ్మూరి సాంబశివరావు మొదలు నాతో సహా యండమూరి, యద్దనపూడి తదితరుల పాత పాపులర్ నవలలు మళ్ళీ బాగా అమ్ముడవుతున్నాయి. టీవీతో విసుగెత్తిన పాత తరం పాఠకులు మళ్ళీ తమ పాత తీపి జ్ఞాపకాలను ఈ నవలా పఠనంలో వెతుక్కుంటున్నారు. కానీ, దురదృష్టం ఏమిటంటే, అందరూ ఆ పాత పాఠకులే. ఈ ఇంగ్లీష్ మీడియమ్ చదువుల ఇంటర్నెట్ యుగంలో కొత్తగా పాఠకులు వచ్చి చేరుతున్నది తక్కువ. అప్పటి నవలా ప్రియులున్నంతకాలం ఈ నవలలు ఉంటాయి. వాళ్ళు పోయాక, ఇవీ పోతాయి. పాపులర్ నవలా శకానికి తెర పడుతుంది.
 
రోజుకు 12 గంటలు రాతే!


నాకు రాయడం తప్ప వేరే పని చేతకాదు కాబట్టి, నిర్విరామంగా రాస్తూనే ఉంటాను. ఒకటో తారీఖున పాలవాడు వచ్చి తలుపు కొట్టినప్పుడు డబ్బులివ్వాలిగా! (నవ్వులు...). తమాషా పక్కన పెడితే, అసలు విషయం ఏమిటంటే - రాయడంలోనే నాకు ఎక్కడ లేనంత ఆనందం వస్తుంది. ఇప్పటికీ రోజుకు కనీసం 10 నుంచి 12 గంటల పాటు రాయడం, చదవడం, వచ్చిన ఆలోచనల్ని వచ్చినట్లు రాసిపెట్టుకోవడం - ఇలా ఆ వ్యాసంగంలోనే ఉంటా.

 సంపాదన... అభిమాన ధనమే!

ఇన్నేళ్ళుగా ఇన్ని నవలలు, కథలు రాశా కాబట్టి, నాకు చాలా ఆదాయం వస్తుందనీ, కోట్లలో గడించాననీ చాలామంది భావిస్తుంటారు. కానీ, పాఠకుల అభిమానధనం సంపాదించినంతగా, ధనం సంపాదించ లేదు. అందుకు నేను బాధపడడం లేదు. రచయితగా నా దృష్టి అంతా రచనాశిల్పం మీదే ఉండేది. నన్ను నేను మార్కెట్ చేసుకోవడం తెలియదు. క్రమంగా యండమూరి వల్ల కొంత నేర్చుకున్నా. కానీ, ఈ రోజుకీ డబ్బులు డిమాండ్ చేయడం, వసూలు చేసుకోవడం తెలియదు. మా నాన్న గారికి అప్పు తీసుకోవడం ఇష్టం లేదు. ఉన్నదాంట్లోనే గుట్టుగా సంసారం నడపాలన్న మధ్యతరగతి కుటుంబ సిద్ధాంతం ఆయనది. నాకూ అదే వచ్చింది. తొలిరోజుల్లో ఏ.జి. ఆఫీసులో కమర్షియల్ ఆడిట్ విభాగంలో పన్నెండేళ్ళు ఉద్యోగం చేశా. ప్రభుత్వోద్యోగంలో ఉండగా 1974 ఏప్రిల్‌లో మాత్రం అవసరానికి డబ్బుల్లేక చాలా అవస్థ పడ్డా. అది ఇప్పటికీ మర్చిపోలేను.  

 చేతిరాత నుంచి కంప్యూటర్ దాకా!

గతంలో నవలలు, కథలు స్వయంగా రాసేవాణ్ణి. నా చేతిరాత గుండ్రంగా ఉండదు. పైగా, ఆలోచనలు వచ్చినంత వేగంగా రాయాలనే తపనలో అది అలవాటు చేసుకోవడంతో చేతిరాత బాగా చెడిపోయింది. దాంతో, ఒకప్పటి హ్యాండ్ కంపోజిటర్లు కాదు కానీ, పత్రికల్లోని నేటి తరం డి.టి.పి. ఆపరేటర్లు ఇబ్బంది పడేవారు. అదే సమయంలో స్వామి తత్త్వవిదానంద అనే స్వామీజీ తన పుస్తకానికి తానే కంపోజ్ చేసుకున్నట్లు చెప్పారు. ఒక సన్న్యాసికి ఉన్నపాటి కమిట్‌మెంట్ మనకు లేకపోయిందే అని సిగ్గుపడి, వారం రోజుల్లో కంప్యూటర్‌లో కంపోజింగ్ చేయడం నేర్చుకున్నా. అలా 2004 నుంచి అంతా కంప్యూటర్ మీదే! పత్రికలకు నిర్వహించే శీర్షికల లాంటివి మాత్రం మా ఆవిడ డి. పద్మజకు (ఆమె పేరు నా కలం పేర్లలో ఒకటి) డిక్టేట్ చేస్తుంటా. నేను గబగబా రాసినవి కంపోజ్ చేసి ఇవ్వడానికి మాత్రం ఒక డి.టి.పి. కంపోజిటర్‌ను పెట్టుకున్నా!  

 దేవుడు రాయించాడు!

కొన్నేళ్ళక్రితం అనుకోకుండా జరిగిన అనుభవంతో ఆధ్యాత్మికత వైపు మళ్ళా. కేరళలో పుట్టి, కర్ణాటకలో ఉండి, చివరకు మహారాష్ట్రలోని గణేశ్‌పురిలో స్థిరపడ్డ జీవన్ముక్త అవధూత సద్గురు నిత్యానంద బాబా మార్గంలోకి వెళ్ళాను. అప్పటి నుంచి నా జీవితమే మారిపోయింది. (గద్గదికంగా...) అదంతా మరో పెద్ద కథ. 2003 నుంచి ఆధ్యాత్మిక నవలలు మాత్రం ‘జయం’, ‘పరంజ్యోతి’, ‘విధాత’ అనే మూడే వెలువరించా. 400కి పైగా ఆధ్యాత్మిక కథలు నా కలం నుంచొచ్చాయి. అవన్నీ నేను కాదు, నా మనసులో దేవుడిచ్చి న ఆలోచనలు, నాతో రాయించుకున్నవే. నా నెక్స్ట్ నవల ‘ప్రయాణం’ఆధ్యాత్మికమే!

మారుతున్న తరానికి తగ్గట్లు...

ప్రతి ఏడేళ్ళకూ తరం మారిపోతుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త తరం యువతీ యువకులను గమనించడం, మాట్లాడడం ద్వారా వాళ్ళకు తగ్గట్లు రాసేవాణ్ణి. పెరిగి పెద్దయ్యే వరకు మా ముగ్గురు అమ్మాయిలు (కావ్య, ఊహ, లిపి), వాళ్ళ స్నేహితులతో మాటామంతీ బాగా ఉపయోగపడింది. మా అమ్మాయిలు అమెరికాలో చదివి, అక్కడే ఉద్యోగాలకు వెళ్ళిపోయాక చుట్టుపక్కల పిల్లలతో మాట్లాడుతూ, కొత్త తరం అభిరుచులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. తాజా ‘త్రీ మంకీస్’ కూడా అలా ఆధునిక స్మార్ట్‌ఫోన్, ఫేస్‌బుక్ తరానికి తగ్గట్లు రాసిందే! సమాజంలో తగ్గిన విలువలకు ప్రతీకలైన పాత్రలనే హీరోలుగా పెట్టి, నవల రాయడం నాకిదే తొలిసారి. రోజుకు 16 గంటలు పనిచేస్తూ, ఏకబిగిన రాసేశా. తక్కువ డైలాగ్స్‌తో ఎక్కువ హాస్యం పలికించా. ఏమైనా, ఎవరూ ఇక్కడ శాశ్వతం కాదు. మనం ఈ ప్రపంచానికి వదిలివెళ్ళేది ఏమీ లేదు. రచయిత వెళ్ళిపోయినా, రేపు పొద్దున్న మిగిలేది అతని రచనలే. నా రచనలు శాశ్వతమని కాదు కానీ, కనీసం మరో 50 ఏళ్ళయినా ఇవి పాఠకులను అలరించి, ఆనందాన్ని కలిగించాలని నా భావన.
 
ఫొటోలెందుకు  ప్రచురణకు ఇవ్వనంటే..!


నాకు అయిదుగురక్కలు, ఒక అన్నయ్య, ఇద్దరు తమ్ముళ్ళు. ఇంత పెద్ద సంసారాన్ని తన కొచ్చే కొద్దిపాటి ఆదాయంతో నడపడం నాన్న కెంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. అందుకే, అప్పట్లో ఫోటో తీయించుకోవడమనేది మాకు లగ్జరీ. ఫలితంగా, చిన్నప్పటి ఫోటోలు లేవు. ఇక, నేను రచయితనయ్యాక నా స్ఫూర్తి అయిన కొమ్మూరి సాంబశివరావు బాటను అనుసరించా. ఆయన లాగే నేనూ ఫోటోలేవీ పత్రికలకు ఇవ్వలేదు. నేనెవరో, ఎలా ఉంటానో తెలియకపోవడంతో సామాన్యులతో  కలసిపోయి, సంగతులు తెలుసుకొనే అవకాశాన్ని కాపాడుకోగలిగా. జర్నలిస్టులు, సంపాదకులు, అభి మానులూ ఫోటో విషయంలో నా అభిప్రాయాన్ని మన్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement