టోఫెల్


 విదేశీ విద్య

 

టోఫెల్ ప్రపంచంలో అత్యంత విస్తృతమైన ఆంగ్లభాష పరీక్ష. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో చదవాలనుకునే వారికి నిర్వహించే పరీక్ష. ఇది విద్యార్థికి ఇంగ్లిష్‌లో ఉన్న పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఉద్దేశించింది. ఆస్ట్రేలియా, కెనడా, యూకే, యూఎస్ వంటి 130 దేశాలు ఈ టోఫెల్ పరీక్షను గుర్తిస్తున్నాయి. దాదాపు 9000 పైగా కాలేజీలు, యూనివర్సిటీలు వివిధ కోర్లుల్లో ప్రవేశానికి ఈ పరీక్షలో వచ్చిన స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి. పరీక్ష స్కోర్ కార్డ్ రెండేళ్లపాటు చెల్లుతుంది. టోఫెల్‌లో వచ్చిన స్కోరు ఆధారంగా కూడా ఆయా దేశాలు వీసా ఇస్తున్నాయి.

 

 పరీక్ష ఎలా ఉంటుంది?

 ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, వినడం, చదవడంలో ఉండే నైపుణ్యాలను టోఫెల్‌లో పరీక్షిస్తారు. యూనివర్సిటీ స్థాయిలో ఇంగ్లిష్‌లో సామర్థ్యాన్ని తెలుసుకుంటారు. ఈ పరీక్షలో మంచి స్కోర్ చేసిన వారు టాప్ యూనివర్సిటీల్లో/ కాలేజీల్లో అవకాశాలు పొందవచ్చు. ఈ పరీక్షలో పుస్తకం నుంచి ఓ పేరాని చదవమనొచ్చు. లేదా ప్రశ్నలు వేసి సమాధానం చెప్పమని అడగొచ్చు లేదా మాట్లాడిన విషయంపై మీ స్పందన కోరొచ్చు. ఇది ఒక రకంగా ఇంటర్వ్యూలా సాగుతుంది. అభ్యర్థి మాట్లాడే విధా నం, భాషను విరివిగా మాట్లాడుతున్నాడా... స్లాంగ్ ఎలా ఉంది అనే విషయాలను కూడా పరీక్షిస్తారు.

 

 దరఖాస్తు:


 టోఫెల్ సంవత్సరమంతా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనిని ఆన్‌లైన్, ఫోన్, ఈమెయిల్ ద్వారా లేదా టోఫెల్ ఐబీటీ రిసోర్స్ సెంటర్‌కు నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షకు వారం రోజుల ముందు రిజిస్ట్రేషన్ క్లోజ్ చేస్తారు. పరీక్ష ఫీజు మనదేశ విద్యార్థులకు 165 డాలర్లు.

 

 పరీక్షలు:


 సంవత్సరం అంతా పరీక్షలు రాసే సౌలభ్యం ఉన్నప్పటికీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో టోఫెల్‌ను ఎక్కువ మంది రాయడానికి ఆసక్తి చూపుతారు. దాంతో ఈ నెలల్లో టోఫెల్ రాయాలనుకునే వారికి డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల తేదీలు దొరకవు. కాబట్టి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ముందుగా తేదీలను ఖరారు చేస్తారు.

 

ప్రిపరేషన్ :

నాలుగున్నర గంటల వ్యవధిలో నిర్వహించే టోఫెల్ పరీక్షకు ప్రాక్టీసే ముఖ్యం. రీడింగ్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి. ఇంగ్లిష్ పేపర్‌లో వచ్చే ఆర్టికల్స్ రెగ్యులర్‌గా చదవడం, పేపరును పైకి చదవడం, ఆర్టికల్ చదివిన తర్వాత ఒక నిమిషం ఆలోచించి దానిపై వెంటనే మీ అభిప్రాయం చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఆన్‌లైన్ వీడియో చాటింగ్ చేయడం, స్నేహితులతో మాట్లాడటం, నచ్చిన అంశాన్ని తీసుకొని దానిపై ఉపన్యసించడం వల్ల రీడింగ్ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవచ్చు. ఏదో మాట్లాడుతున్నాం అని కాకుండా ఉచ్ఛారణ బాగుండేలా చూసుకోవాలి. ‘ప్రాక్టీస్ మేక్స్ పర్‌ఫెక్ట్’ అన్నట్లు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. అలాగే గ్రామర్, వొకాబులరీపై దృష్టి పెట్టాలి. మీ సొంత పద సంపదను అభివృద్ధి చేయండి. రికార్డు చేసిన ఉపన్యాసాలను వినండి.ప్రాక్టీస్ చేస్తుంటే సమయం తెలీదు. కాబట్టి ప్రయాణాల్లో సైతం సాధన చేయడం వల్ల సమయం కలిసి వస్తుంది. అలాగే పాసేజ్ చదివినప్పుడు అందులో వచ్చే మంచి పదాలను గుర్తుంచుకోవడం, మీ భావాలను ఒక క్రమ పద్ధతిలో పెట్టడం నేర్చుకోవాలి. ఇంగ్లిష్‌లో ఉండే సామెతలను (ఇడియమ్స్) సందర్భానుసారం ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. టోఫెల్ ప్రాక్టీస్ మెటీరియల్‌ను అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 వివరాలకు: www.ets.org/toefl

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top