ప్రకృతిలో సాగుబడి

Divya Reddy Agriculture in Milk And Food - Sakshi

బీటెక్‌ చదివి వ్యవసాయం వైపు మొగ్గు

దేశీ ఆవు పాల ఉత్పత్తిలో విజయం

ప్రకృతి వ్యవసాయంపై జాగృతి

క్లిమామ్‌ వెల్‌నెస్‌ ఫామ్స్‌తో ముందడుగు

సంపూర్ణ ఆరోగ్యం కోసం దివ్యారెడ్డి కృషి

ఇంజినీరింగ్‌ పట్టా చేతికి రాకుండానే క్యాంపస్‌ ఇంటర్వ్యూలోఎంపికైపోయి నాలుగంకెల వేతనం అందుకోవాలి.. ఏడాది తిరక్కుండా కంపెనీ తరఫున ఫారిన్‌ వెళ్లి డాలర్లు సంపాదించాలి. మూడు పదుల వయసులు దాటకుండానే సొంత ఇల్లు,బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉండి తీరాలి.. సగటు బీటెక్‌ విద్యార్థి ఆలోచన ఇలాగే ఉంటుంది.ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు వ్యవసాయం గురించి ఆలోచిస్తారా..! అంటే అలాంటి వారు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోతారు. అలాంటప్పుడు‘అల్లోల్ల దివ్యారెడ్డి’ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

సాక్షి,సిటీబ్యూరో: ఆర్థికంగా ఉన్నత కుటుంబానికి చెందిన దివ్యారెడ్డి పుట్టి పెరిగిన వాతావరణం అంతా సిటీలోనే అయినా.. ఇంజినీరంగ్‌ పూర్తి చేసినా ఆమె ఆలోచనలు మాత్రం గ్రామాల వైపు సాగాయి. ముఖ్యంగా దేశీయ ‘గో సంబంధ వ్యవసాయం’తో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని భావించిన ఆమె ఆ దిశగా అడుగులు వేశారు. ప్రస్తుతం ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో పిల్లల నుంచి పెద్దల వరకు తాగుతున్న పాలు కల్తీ అని గుర్తించిన దివ్యారెడ్డి.. స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలు, పాల ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసేందుకు ‘క్లిమామ్‌ వెల్‌నెస్‌ ఫామ్స్‌’ను ప్రారంభించారు. దీనిద్వారా దేశీయ ఆవు పాలతో పాటు నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులను తయారు చేస్తూ నగరవాసులకు అందిస్తున్నారు. ఈమె ప్రారంభించిన ఈ ఉద్యమానికి పదుల సంఖ్యలో అవార్డులు సైతం వరించాయి. 

నగరం మెచ్చిన ఉత్పత్తులు
దివ్యారెడ్డి తన క్లిమామ్‌ ఫామ్‌ నుంచి నగరంలో రోజుకు 600 లీటర్ల పాలను సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మియాపూర్‌ ప్రాంతాలతో పాటు బంజారాహిల్స్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ వాసులు ఈ పాల గురించి తెలుసుకుని మరీ ఆర్డర్‌పై తెప్పించుకుంటున్నారు. దివ్యారెడ్డి నడుపుతున్న ఫామ్‌లో ఉత్పత్తి అయ్యే పాలు, పాల ఉత్పత్తుల కంటే డిమాండ్‌ అధికంగా ఉండంతో తనలా ఆలోచించే మరో 20 మందికి స్వచ్ఛమైన పాలపై అవగాహన కలిగించి ఫామ్స్‌ను ఏర్పాటుకు ప్రోత్సహించారు. అలాగే సేంద్రీయ పద్ధతిలో పండించించిన కొర్రలు, బియ్యం, సామలు, అరికెలు, ఊదలు, అండు కొర్రలతో పాటు ఆయిల్, డైఫ్రూట్స్‌ను జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు సమీపంలో ‘క్లిమామ్‌ ఫామ్‌ కేఫ్‌’ను ప్రారంభించారు. అలాగే, ఈ కేఫ్‌లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులకు ‘సేంద్రియ వ్యవసాయం’పై అవగాహన కల్పిస్తున్నారు. 

ఆవులపై అధ్యయనం చేసి.. 
ప్రస్తుతం గ్రామాల్లో కూడా చాలామంది హైబ్రీడ్‌ ఆవులవైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇవి దేశీయ ఆవులతో పోలిస్తే ఎక్కువగా పాలు ఇస్తాయని వాటినే పెంచేందుకు ఇష్టపడుతుంటారు. మరోపక్క గతంలో ఆవులను పాల కంటే వాటి పేడను ఎరువుగా వాడి సేంద్రియ వ్యవసాయం చేసేవారు. దాంతో దేశీయ ఆవులు సంతతి తగ్గిపోయింది. దాంతో పాటే ప్రజల ఆరోగ్య సమస్యలు సైతం పెరగనారంభించాయి. ఇలాంటి పరిస్థితితుల్లో సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే దేశీ ఆవు పాలు, సంబంధిత ఉత్పత్తులు ప్రజలకు అందించడంతో పాటు ఆవు మలమూత్రాలతో సేంద్రియ వ్యవసాయాన్ని చేయాలని 2015లో దివ్యారెడ్డి సంగారెడ్డి సమీపంలోని ఓల్డ్‌ ముంబై జాతీయ రహదారికి ఆనుకొని ‘క్లిమామ్‌ వెల్‌నెస్‌ ఫామ్స్‌’ను ప్రారంభించారు. తొలుత 20 దేశీయ ఆవులతో మొదలైన ఈ ఫామ్స్‌లో ఇప్పుడు 200 ఆవులున్నాయి. ప్రారంభంలో కేవలం తమ ఇంటి అవసరాలు, బంధువులకు మాత్రమే సరఫరా చేసిన ఈ పాలు ఇప్పుడు సిటీలో వందల మందికి సరఫరా చేసే స్థాయికి తీసుకెళ్లారు.

ప్రజల్లో అవగాహన పెరగాలి
ఒకప్పుడు గ్రామాల్లో పశువులను పాలకోసం కాకుండా వాటి మలమూత్రాలను ఎరువుగా వాడి వ్యవసాయం చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఆదాయం కోసం హైబ్రీడ్‌ వైపు పరుగులు తీస్తున్నారు. ఈ ఆలోచన తప్పు. పల్లెలకు గత వైభవం రావాలి. మళ్లీ సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు పడేలా నేనొక ప్రేరణగా నిలవాలన్న ఉద్దేశంతో క్లిమామ్‌ వెల్‌నెస్‌ ఫామ్స్‌ మొదలెట్టా. నేను చేస్తున్నది ఉత్తమమైన పద్ధతి అని అందరికీ ప్రాక్టికల్‌గా చూపిస్తున్నా. సేంద్రియ ఆహారం అందరికీ అందాలన్నది నా ఉద్దేశం.–  దివ్యారెడ్డి, క్లిమామ్‌ వెల్‌నెస్‌ ఫామ్స్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top