56 అంగుళాల ఛాతీ అక్కర్లేదు | priyanka gandhi fire to narendra modi | Sakshi
Sakshi News home page

56 అంగుళాల ఛాతీ అక్కర్లేదు

Apr 28 2014 1:07 AM | Updated on Mar 18 2019 9:02 PM

56 అంగుళాల ఛాతీ అక్కర్లేదు - Sakshi

56 అంగుళాల ఛాతీ అక్కర్లేదు

‘‘ఈ దేశాన్ని నడపడానికి 56 అంగుళాల ఛాతీ అవసరం లేదు. అందుకు విశాల హృదయం అవసరం. ఈ దేశాన్ని నడపడానికి క్రూరమైన శక్తితో పనిలేదు. కానీ, నైతిక బలం, మనోబలం కావాలి’’ అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై మాటలతో పంచ్‌లు విసిరారు.

దేశాన్ని నడపడానికి విశాల హృదయం కావాలి  మోడీపై ప్రియాంక పంచ్‌లు
 
రాయ్‌బరేలీ: ‘‘ఈ దేశాన్ని నడపడానికి 56 అంగుళాల ఛాతీ అవసరం లేదు. అందుకు విశాల హృదయం అవసరం. ఈ దేశాన్ని నడపడానికి క్రూరమైన శక్తితో పనిలేదు. కానీ, నైతిక బలం, మనోబలం కావాలి’’ అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై మాటలతో పంచ్‌లు విసిరారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ కూడా ప్రియాంకపై ఎదురు దాడి చేసింది. ఆమె భర్త వాద్రా అవినీతిపై వీడియో, పుస్తకాన్ని విడుదల చేసి ప్రశ్నలు సంధించింది. దీంతో ప్రియాంక-బీజేపీ మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరినట్లయింది. మోడీ ఇటీవలే గోరఖ్‌పూర్‌లో పర్యటించిన సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ను గుజరాత్‌లా మార్చాలంటే అందుకు 56 అంగుళాల ఛాతీ కావాలని అన్నారు. ఎస్పీ అధినేత ములాయంను ఉద్దేశించి ‘‘యూపీని గుజరాత్‌లా మార్చడం అంటే ఏంటో తెలుసా నేతాజీ. కోతల్లేకుండా  విద్యుత్‌ను 24 గంటలపాటు, 365 రోజులూ అన్ని గ్రామాలకు ఇవ్వడం. మీరు ఇది చేయలేరు. యూపీని గుజరాత్‌లా అభివృద్ధి చేసే దమ్ములు మీకు లేవు. అందుకు 56 అంగుళాల ఛాతీ కావాలి’’ అని మోడీ అన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాయ్‌బరేలీలో పర్యటించిన సందర్భంగా ప్రియాంక పై విధంగా స్పందించారు. దేశ సంస్కృతిని కాపాడేందుకు అవసరమైతే జీవితాన్ని కూడా త్యాగం చేయాల్సి ఉంటుందన్నారు. ఈ దేశం మహాత్మాగాంధీతోపాటు, అన్ని మతాలకు చెందినదని, స్వాతంత్య్రం కోసం వారు తమ ప్రాణాలను ధారపోశారని ఆమె గుర్తు చేశారు. ఈసారి ఎన్నికల్లో దేశాన్ని శక్తిమంతం చేసేందుకు, దేశ ఐక్యతను కాపాడేందుకు ఓటేయాలని ప్రియాంక పిలుపునిచ్చారు.
 
బీజేపీ అబద్ధాలకు బెదిరిపోను

 తన భర్త రాబర్ట్‌వాద్రాపై బీజేపీ పుస్తకం విడుదల చేసిన నేపథ్యంలో ప్రియాంక మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు ఆందోళనలో ఉన్న ఎలకల్లా పరుగులు తీస్తున్నారని, వారి అబద్ధాలకు బెదిరిపోనని, వారి విధ్వంసక రాజకీయాలపై తాను మరింతగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. వారు చెప్పే దానిలో కొత్తేమీ లేదన్నారు.
 
 వాద్రా అక్రమాలపై బీజేపీ పుస్తకం, వీడియో

 రాబర్ట్ వాద్రా అక్రమాలకు సంబంధించి ‘రాబర్ట్ వాద్రా నమూనా అభివృద్ధి’ పేరుతో బీజేపీ ఓ వీడియో డాక్యుమెంటరీ, ఆరు పేజీలతో ఓ చిన్న పుస్తకాన్ని ఆదివారం ఢిల్లీలో విడుదల చేసింది. రాజస్థాన్, హర్యానాలో వాద్రాకు సంబంధించిన భూ లావాదేవీలను అందులో ప్రస్తావించింది. గాంధీ కుటుంబం మద్దతుతో ‘వాద్రా నమూనా’ విజయం సాధించిందని దుయ్యబట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement