యూపీ విజయం వెనుక ఏమా మంత్రదండం?

యూపీ విజయం వెనుక ఏమా మంత్రదండం? - Sakshi


ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు బీజేపీ బలం.. కేవలం పది లోక్సభ స్థానాలు. మరిప్పుడో.. ఏకంగా 73 సీట్లు. ఆ రాష్ట్రంలో ఉన్న బలమైన ప్రాంతీయ శక్తులు సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా తుడిచిపెట్టేసి భారీ సంఖ్యలో ఎంపీ సీట్లను గెలుచుకుంది. యూపీ దక్కితే కేంద్రంలో అధికారం చేజిక్కినట్లేనని చెబుతారు. అలాంటి యూపీని బీజేపీ గెలుచుకోవడానికి కారణం ఎవరు? నరేంద్రమోడీ మ్యాజిక్ ఒక్కటే అంతపని చేసిందా? సం'కుల' సమరం సాగుతుండే ఉత్తరప్రదేశ్లో దాదాపు 11 నెలల పాటు ముమ్మరంగా కసరత్తు చేసి, తనకు ఎదురైన అవమానాలు, పరాభవాలను కూడా అవకాశాలుగా మలచుకుని, 73 ఎంపీ సీట్లను పళ్లెంలో పెట్టి నరేంద్రమోడీకి అప్పగించిన ఘనత గుజరాత్ మంత్రి అమిత్షాకే దక్కుతుంది. ఇప్పటివరకు యూపీలో బీజేపీకి గరిష్ఠంగా దక్కిన స్థానాలు.. 57 మాత్రమే. అదీ 1998లో. కానీ ఇప్పుడు ఏకంగా 91% స్థానాలను దక్కించుకుంది. దానివల్లే జాతీయస్థాయిలో 280కి పైగా సీట్లు సాధించగలిగింది.



కులమతాల కుమ్ములాటలు ఎప్పుడూ జరుగుతుండే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమిత్షా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 11 నెలల పాటు మకాం వేశారు. ఆయనను గుజరాత్ రాష్ట్రంలో ఉండొద్దని కోర్టు ఆదేశించినప్పుడు దాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తన బాస్ మోడీ ఆదేశాలతో వెంటనే ఉత్తరప్రదేశ్ వెళ్లిపోయి, అక్కడ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా అంచనా వేశారు.



యూపీలో ప్రధానంగా ముస్లింలు, జతావాలు, యాదవులు కలిసి దాదాపు 41 శాతం వరకు ఉంటారు. వీళ్లంతా ఇన్నాళ్ల బట్టి బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. దశాబ్ద కాలం నుంచి రాష్ట్రంలో అధికారం లేదు. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు గట్టిగా ప్రచారం చేయడానికి కరిష్మా ఉన్న నాయకుడు కూడా ఎవరూ లేరు. కళ్యాణ్ సింగ్ లాంటి నాయకులు అప్పటికే వయసు మీరడంతో పాటు వాళ్లకు మాస్ అప్పీల్ లేదు. మరోవైపు మాయావతి లాంటి నాయకులు ఉధృతంగా ప్రచారం చేస్తారు. ఇన్ని ప్రతికూలాంశాలను తట్టుకోవాలంటే ఏం చేయాలో పక్కా వ్యూహాన్ని రూపొందించుకున్నారు అమిత్ షా. ఇన్నాళ్లుగా తమకు మద్దతు ఇవ్వని వర్గాల వద్దకు ఇంటింటికీ వెళ్లి వాళ్లకు నచ్చజెప్పారు. రాష్ట్రంలో మొత్తం 450 ర్యాలీలు నిర్వహించారు. ఇందుకోసం 450 వీడియో రథాలు ఉపయోగించి వాటిద్వారా నరేంద్రమోడీ ప్రసంగాలను అన్నిచోట్లా వినిపించారు.



కులసంఘాల పెద్దలందరితో విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ మంచి చేసుకున్నారు. దాదాపు పుష్కర కాలం నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కూడా చేయకపోవడంతో దూరమైన ప్రజలందరినీ మళ్లీ దగ్గరకు తెచ్చుకున్నారు. లక్ష్యం సాధించారు. 80 సీట్లకు గాను 73 స్థానాల్లో పాగా వేసి మోడీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top