యువ మేధావి విషాదాంతం

యువ మేధావి విషాదాంతం - Sakshi


‘విముక్తిని కలిగించేదే విద్య’ అన్న మకుటంతో మెరిసిపోయే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో సరిగ్గా దానికి విరుద్ధమైన విధానాలు కొనసాగుతున్నాయని అక్కడి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఎంతో బంగారు భవిష్యత్తుగల యువ దళిత మేధావి వేముల రోహిత్ జీవితం ఆ పరిణామాల పర్యవసానంగానే అర్ధాంతరంగా ముగిసిపోయింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకుడొకరిపై దౌర్జన్యం చేశారన్న ఆరోపణపై కొంతకాలం క్రితం యూనివర్సిటీ బహిష్కరించిన అయిదుగురు విద్యార్థుల్లో రోహిత్ ఒకరు.


 


ఆదివారం ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన లేఖలో తన మరణానికి ఎవరూ (మిత్రులైనా, శత్రువులైనా) కారకులు కాదని పెద్ద మనసుతో చెప్పినా ఎంతో కవితాత్మకంగా, తాత్వికతతో రాసిన ఆ లేఖ... రోహిత్ సున్నిత మనస్తత్వానికీ, ఆయన ఎదుర్కొన్న సమస్యలకూ, అవి ఆయనలో కలిగించిన మనోవేదనకూ అద్దం పట్టింది. తారస్థాయికి ఎదగాలని ఆకాంక్షించిన ఒక సృజనాత్మక యువ తేజం మధ్యలోనే ఆరిపోయింది.


 


విద్యాలయాల్లోనైనా, విశ్వవిద్యాలయాల్లోనైనా విద్యార్థి సంఘాలుండటం... వాటి మధ్య నిరంతర భావ సంఘర్షణ కొనసాగుతుండటం అసహజం కాదు. ఒక్కో సారి అవి కొట్లాటలకు దారితీస్తాయి కూడా. అలాంటివి జరిగినప్పుడు నిబంధన లను అనుసరించి విద్యా సంస్థ వ్యవహరిస్తుంది. కేసులేమైనా ఉంటే న్యాయస్థానాలు విచారించి చర్య తీసుకుంటాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈ ప్రక్రియ దెబ్బతింది. పద్ధతిగా సాగుతున్న వ్యవహారం కాస్తా రాజకీయ నాయకుల చేతుల్లో పడి అస్తవ్యస్థమైంది. ఫలితంగా అయిదుగురు దళిత విద్యార్థులు రోడ్డునపడవలసి వచ్చింది.


 


విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న వరస ఉదంతాలను ఒక్కసారి గమనిస్తే ఈ విద్యార్థులకు జరిగిన అన్యాయం ఎటువంటిదో అర్ధమవుతుంది. అంబేడ్కర్ విద్యార్థి సంఘాన్ని అవమానపరుస్తూ ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేశాడన్న కారణంతో ఏబీవీపీ నాయకుడు సుశీల్‌ను తాము ప్రశ్నించామని, అందుకాయన రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాడని దళిత విద్యార్థులంటున్నారు. కాదు...తనపై ఆ విద్యార్థులు దాడికి పూనుకున్నారని, ఫలితంగా గాయాలయ్యాయని సుశీల్ ఆరోపిం చాడు. ఆస్పత్రిలో కూడా చేరాడు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశాడు. ఆయన ఆరోపణ నిజమైన పక్షంలో అందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవా ల్సిందే. దాన్నెవరూ తప్పుబట్టరు.


 


అయితే విశ్వవిద్యాలయం నియమించిన బోర్డే ఈ ఆరోపణకు తగిన ఆధారాలు లభించలేదని మధ్యంతర నివేదికలో తెలిపింది. ఇలాంటి ఘటనలు ఇక ముందు చోటు చేసుకోకుండా ఇరు పక్షాలనూ హెచ్చరించి దీన్ని ముగించాలని పేర్కొంది. ఆ నివేదిక ఆగస్టు 12 నాటిది.  మరో 19 రోజులకు... అంటే ఆగస్టు 31న ఆ బోర్డే తుది నివేదిక ఇచ్చింది. అయిదుగురు దళిత విద్యార్థులనూ సస్పెండ్ చేయాలని ఆ తుది నివేదిక సిఫార్సు చేయడం, దానికి అను గుణంగా చర్యలు తీసుకోవడం చకచకా పూర్తయ్యాయి.


 


ఈ రెండు నివేదికల మధ్యా ఏమైంది? ఇంత పరస్పర విరుద్ధమైన నివేదికల్ని బోర్డు ఎలా ఇవ్వగలిగింది? కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఆగస్టు 17న లేఖ రాసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు కారణమని ఏఎస్‌ఏ ఆరోపిస్తున్నది. లేఖ రాసిన మాట నిజమే అయినా, తనకు తెలిసిన అంశాలను స్మృతి ఇరానీ దృష్టికి తీసుకురావడమే చేశానంటున్నారు దత్తాత్రేయ. ఒక ప్రజాప్రతినిధిగా ఆయనకు ఆ హక్కు ఉంటే ఉండొచ్చు. కానీ అంతకన్నా ముందు దీనికి సంబంధించి విద్యార్థుల్లోని మరో పక్షం వాదనేమిటో తెలుసుకునే అవసరం ఆయనకు లేదా?


 


‘ఈమధ్య కాలంలో ఆ విశ్వవిద్యాలయం కులతత్వ, తీవ్రవాద, జాతి వ్యతిరేక రాజకీయాలకు స్థావరంగా మారిందంటూ' ఆరోపణలు చేసినప్పుడు అందుకు గల ఆధారాలేమిటో గమనించుకోవద్దా? అయిదుగురు దళిత విద్యార్థుల తలరాతలను నిర్దేశించే స్థాయి లేఖ ఇంత యాంత్రికంగా ఉండవచ్చునా? ఆయన రాసిన లేఖను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెనువెంటనే సీరియస్‌గా తీసుకుని విశ్వవిద్యాలయానికి పంపడం, దాని అంతరార్ధాన్ని గ్రహించినట్టుగా దళిత విద్యార్థులపై చర్యలు మొదలుకావడం చిత్రంగా లేదా?


 


ఉన్నత శ్రేణి విద్యాలయాలుగా పేరుగాంచిన సంస్థల వాస్తవ ప్రమాణాలు క్రమేపీ ఎలా దిగజారుతున్నాయో తెలిపే మరో ఉదంతమిది. నిరుడు మద్రాస్ ఐఐటీ సైతం ఇలాగే ప్రవర్తించింది. క్యాంపస్‌లోని అంబేడ్కర్-పెరియార్ స్టూడెంట్ సర్కిల్(ఏపీఎస్‌సీ) జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న దంటూ ఓ ఆకాశరామన్న రాసిన లేఖను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మద్రాస్ ఐఐటీకి పంపినప్పుడు దాన్నే ఆదేశంగా శిరసావహించిన విద్యా సంస్థ ఏపీఎస్‌సీ కార్యకలాపాలను క్యాంపస్‌లో నిర్వహించరాదంటూ నిషేధించారు. తమ దృష్టికొచ్చిన విషయాన్ని మద్రాస్ ఐఐటీకి తెలియజేశామే తప్ప చర్య తీసుకోవాలని ఆదేశించలేదని ఆ తర్వాత మానవ వనరుల శాఖ తెలిపింది. ఫలితంగా నగుబాటు పాలయింది ఐఐటీ నిర్వాహకులే. ఇప్పుడు సైతం దత్తాత్రేయ ఆ మాటే చెబు తున్నారు. బహుశా మానవ వనరుల శాఖ కూడా అలాగే అనవచ్చు.


 


కానీ వైస్‌చాన్సలర్‌గా బాధ్యతలు నిర్వహించేవారి విజ్ఞత ఎటుపోయినట్టు? 5,000మంది విద్యార్థులు చదువుతున్న సంస్థలో అయిదుగురు పిల్లలు, వారికి మద్దతుగా మరికొందరు ఈ చలికాలంలో ఇన్నాళ్లుగా ఆరుబయట ఆందోళన చేస్తుంటే ఆయనకు చీమ కుట్టినట్టయినా అనిపించలేదా? ఆ పిల్లల్ని పిలిపించి మాట్లాడదామన్న స్పృహ ఆయనకు ఏ క్షణంలోనూ కలగలేదా? సమాజ ఉన్నతికి దోహదపడగల మేధావులను రూపొందించే ఉన్నత శ్రేణి సంస్థకు నేతృత్వం వహిస్తున్నవారు ప్రవర్తించవలసిన తీరు ఇలాగేనా?


 


రోహిత్ ఆత్మహత్య ఈ విశ్వవిద్యాలయంలో జరిగిన 12వ బలవన్మరణమని చెబుతున్నారు. ఇందులో పదిమంది దళిత విద్యార్థులని అంటున్నారు. ఆ వర్గాలనుంచి ఎవరైనా ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఇంటిల్లిపాదీ ఎన్ని త్యాగాలు చేయవలసి ఉంటుందో ఒక్కసారి గమనంలోకి తెచ్చుకుంటే వారి విషయంలో ఎంత బాధ్యతగా వ్యవహ రించాలో వైస్‌చాన్సలర్‌కైనా, ఇతర ఆచార్యులకైనా అర్ధమవుతుంది. మరింతమంది రోహిత్‌లు బలికాకూడదనుకుంటే ఇప్పటికైనా వారు స్వతంత్రంగా వ్యవహ రించడం నేర్చుకోవాలి. విశ్వవిద్యాలయంలోని పరిస్థితులను చక్కదిద్దాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top