గుత్తిలోని సీపీఐ కాలనీకి చెందిన ఉరుకుందమ్మ(34) అనే వివాహిత గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ చాంద్‌బాషా తెలిపారు.
గుత్తి : గుత్తిలోని సీపీఐ కాలనీకి చెందిన ఉరుకుందమ్మ(34) అనే వివాహిత గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ చాంద్‌బాషా తెలిపారు. ఆయన కథనం మేరకు... బేల్దారి పని చేసే భర్త మల్లికార్జున తాగుడుకు బానిసయ్యాడు. తాగేందుకు అప్పులు సైతం చేశాడు. వాటిని తీర్చేందుకు ఒత్తిడి పెరగడంతో భార్యను వేధిస్తున్నాడు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె చివరకు ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇదే విషయాన్ని సోదరునికి ఫోన్ చేసి తెలిపింది.
ఇంట్లో భర్త లేకపోగా, పిల్లలను బయటకు పంపి ఆ తరువాత ఆమె ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సోదరుడు ఇంటికొచ్చే సరికే ఆమె ఉరికి వేలాడుతుండడంతో ఆగమేఘాల మీద కిందకు దింపి ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతురాలికి విశ్వనాథ్, ఉషా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చాంద్‌బాషా తెలిపారు.