రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం | CM Revanth Reddy Key Comments On Farmers Issues In Meeting With CPI Leaders | Sakshi
Sakshi News home page

రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం

May 26 2026 1:35 AM | Updated on May 26 2026 1:35 AM

CM Revanth Reddy Key Comments On Farmers Issues In Meeting With CPI Leaders

సీపీఎం నేతలతో జరిగిన భేటీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

సీపీఎం నాయకులతో సమావేశంలో సీఎం వ్యాఖ్యలు

కనీస వేతనాల సవరణ చట్టంపై సీఎంకు ధన్యవాదాలు తెలిపిన సీపీఎం బృందం

సాక్షి, హైదరాబాద్‌: రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటిస్తున్నప్పటికీ పంటలను మాత్రం పూర్తిస్థాయిలో కొనడం లేదని అన్నారు. సోమవారం సచివాలయంలో సీపీఎం రాష్ట్ర నాయకులు.. ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ నేతృత్వంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పండిన పంటలో 30 శాతం కూడా సేకరించడం లేదని విమర్శించారు. పంట కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించాలని వారికి సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తోందన్నారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తూ కొనుగోలు చేస్తున్నామని, మొక్కజొన్నను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కొనుగోళ్లపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నామని సీఎం చెప్పారు. బెంగాల్‌ ఎన్నికల కారణంగా హమాలీల కొరత ఏర్పడిందని, ఎండ తీవ్రత వల్ల మధ్యాహ్న సమయంలో పనులు మందగిస్తున్నాయని పేర్కొన్నారు. 

మూసీ నిర్వాసితులకు అక్కడే ఇళ్లు..: కాగా, మూసీ నిర్వాసితులకు స్థానికంగానే ఇళ్లు మంజూరు చేస్తామని సీపీఎం నేతలకు సీఎం హామీ ఇచ్చారు. మూసీ అంశంపై బీఆర్‌ఎస్, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మూసీని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాజెక్ట్‌ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్, భోజనం అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని, ఆరుట్ల స్కూల్‌ను ఒకసారి సందర్శించాలని సీపీఎం నాయకులను సీఎం ఆహ్వానించారు. ఈ భేటీలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనీస వేతనాల సవరణ చట్టాన్ని తీసుకువచ్చినందుకు సీపీఎం నాయకులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement