ఎల్డీఎఫ్‌లో చిచ్చు.. కేరళ రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌ | Big Twist In Kerala Politics: Deputy LoP Row Triggers LDF Clash | Sakshi
Sakshi News home page

ఎల్డీఎఫ్‌లో చిచ్చు.. కేరళ రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌

Jun 5 2026 10:15 AM | Updated on Jun 5 2026 10:23 AM

Big Twist In Kerala Politics: Deputy LoP Row Triggers LDF Clash

కేరళలో ఎన్నికల పరాజయం తర్వాత ఎల్‌డీఎఫ్‌లో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా అసెంబ్లీలో డిప్యూటీ ప్రతిపక్ష నేత పదవిపై సీపీఎం–సీపీఐ మధ్య తీవ్ర పోటీ చెలరేగడంతో లెఫ్ట్‌ కూటమిలో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. ఒకవైపు ఈ పదవి తమకే దక్కాలని సీపీఐ గట్టిగా పట్టుబడుతుండగా, మరోవైపు సంప్రదాయాలను చూపిస్తూ సీపీఎం వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది.

కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష డిప్యూటీ నేత పదవిపై ఎల్‌డీఎఫ్‌లో భాగస్వామ్య పార్టీలైన సీపీఎం, సీపీఐ మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తాయి. రెండో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న తమకే ఈ పదవి దక్కాలని సీపీఐ స్పష్టం చేస్తూ.. ఈ విషయంలో జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోవాలని కూడా కోరింది. ఇక సీపీఎం మాత్రం గత సంప్రదాయాలను ప్రస్తావిస్తూ, ఈ పదవిని ఎప్పటినుంచో తమ పార్టీనే నిర్వహిస్తోందని వాదిస్తోంది. 

ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్న నేపథ్యంలో కీలక పదవుల పంపకంలో మార్పులు అవసరం లేదని సీపీఎం నేతలు చెబుతున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ చేతిలో ఎల్‌డీఎఫ్ ఓటమి పాలైన తర్వాత కూటమిలో అంతర్గత సమీక్షలు, చర్చలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయివరకు సమావేశాలు జరుగుతూ, ఎన్నికల పరాజయానికి కారణాలపై విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే ఈ అంతర్గత చర్చల మధ్యే సీపీఎం–సీపీఐ మధ్య పదవుల వివాదం మరింత వేడెక్కింది. 

అంతకుముందే ప్రతిపక్ష నేత పదవిపై కూడా పినరయి విజయన్ పేరుకు సీపీఐ అభ్యంతరం తెలిపిన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఓటమికి నాయకత్వమే కారణమన్నది సీపీఐ వాదనగా ఉంది. మొత్తంగా, ఎన్నికల పరాజయం తర్వాత ఎల్‌డీఎఫ్‌లో మొదలైన అంతర్గత చిచ్చు ఇప్పుడు కీలక పదవుల పంపకంపైకి చేరి, కూటమి ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement