చాకిరేవుకెళ్తూ ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.
చాకిరేవుకెళ్తూ...తిరిగిరాని లోకానికి
Jan 30 2017 11:45 PM | Updated on Apr 3 2019 7:53 PM
–ఆటో బోల్తాపడి యువతి మృతి
సంజామల: చాకిరేవుకెళ్తూ ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గుళ్తదుర్తి రహదారిలో రైల్వేబ్రిడ్జి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంజామలకు చెందిన చాకలి శ్రీను, సావిత్రి దంపతులు బట్టలు ఉతికేందుకు గ్రామ సమీపంలోని గుళ్లదుర్తి రహదారిలో ఉన్న ఎస్సార్బీసీ కాలువ వద్దకు ఆటోలో బయలు దేరారు. అయితే రైల్వేబ్రిడ్జి సమీపంలో ఆటో అదుపుతప్పి రోడ్డుపక్కనున్న పొలాల్లో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సావిత్రి (30) తలకు బలమైన గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందింది. భర్త శ్రీనుతో పాటు డ్రైవరుకు ప్రమాదం తప్పింది. సమీపంలోనే బట్టలుతుకుతున్న రజకులు, పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తున్న రైతు కూలీలు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త శ్రీనుతో పాటు కుమారుడు, కుమార్తె సంతానం.
Advertisement


