బదిలీల ఫీవర్ | transfers in govt employees in vizianagaram district | Sakshi
Sakshi News home page

బదిలీల ఫీవర్

Jun 14 2016 9:40 AM | Updated on Sep 4 2017 2:28 AM

జిల్లాలోని ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా బదిలీలపైనే చర్చ. ఎవరెవరు బదిలీ కోరుకుంటున్నారు?

  • జిల్లా ఉద్యోగుల్లో ఒకటే చర్చ
  • రంగంలోకి దిగిన నేతలు
  • ఊపందుకుంటున్న పైరవీలు
  • భారీగా చేతులు మారుతున్న నగదు
  •  
    జిల్లాలోని ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా బదిలీలపైనే చర్చ. ఎవరెవరు బదిలీ కోరుకుంటున్నారు? ఎవర్ని ఎక్కడకు వేస్తున్నారు? అసలు వెళ్లడంవల్ల ఏం ప్రయోజనం? ఇక్కడే ఉండిపోదామా... కోరుకున్న చోటకు వెళ్దామా? ఇక్కడి ఉన్నతాధికారి వేధింపులు తప్పించుకోవాలంటే... వెళ్లడమే బెటర్. ఇక ఆయనే బదిలీ అయిపోతే... ఉండిపోవడమే ఉత్తమం. ఇదీ ప్రతీ చోటా వినిపిస్తున్న వాదనలు. సందట్లో సడేమియాలా పైరవీలకు తలుపులు తెరిచేసినవారు కొందరు. బేరాలు మొదలెట్టేసినవారు వేరొకరు.
     
    విజయనగరం : ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న బదిలీల ఉత్తర్వులు విడుదలయ్యాయి. 20వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. ఐదేళ్లు పైబడిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని, మూడేళ్లు పైబడిన వారు బదిలీకి అర్హులని, ఏజెన్సీలో రెండేళ్లు పనిచేసిన వారికి బదిలీకి అవకాశం కల్పించాలని, ఆ శాఖలో 20శాతానికి మించి బదిలీలు జరగకూడదని, ఉద్యోగుల సర్వీసు వివరాలను అన్‌లైన్‌లో పెట్టాలని ఇలా చాలా అంశాలతో ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

    ఉద్యోగుల వివరాలన్నీ ఈ నెల 14వ తేదీలోగా సమర్పించాలని సూచన ప్రాయ ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతా సిద్ధం చేసుకుని 15, 16, 17, 18వ తేదీల్లో బదిలీ ప్రక్రియ చేపట్టే యోచనలో ఉన్నత స్థాయి వర్గాలు ఉన్నాయి.   కొన్ని కేడర్‌లు జిల్లా స్థాయిలోనూ, మరికొన్ని కేడర్‌లను రీజినల్ స్థాయిలోనూ, ఇంకొన్ని కేడర్‌ల బదిలీలు రాష్ట్ర స్థాయిలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
     
    ఎవరుంటారో...ఎవరొస్తారో ?
    జిల్లా అధికారుల బదిలీలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. అడిషనల్ జాయింట్ కలెక్టర్ యు.సి.జి.నాగేశ్వరరావుకు ఈసారి బదిలీ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా రెవెన్యూ అధికారి జితేంద్ర బదిలీ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. డీఆర్‌డీఏ పీడీ, డ్వామా పీడీలపైనా చర్చ జరుగుతోంది.

    ఇంకా వయోజన విద్యాశాఖ డెప్యూటీ డెరైక్టర్ అమ్మాజీరావు కూడా బదిలీపై ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.వి.నాగరాణి తన మాతృశాఖకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రాజీవ్ విద్యా మిషన్ పీఓ లింగేశ్వరరెడ్డి కూడా బదిలీకవాలని యోచిస్తున్నట్టు సమాచారం.
     
    జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణారావు స్థానంలో మరొకరు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, పౌరసరఫరాల సంస్థ డీఎం, జిల్లా పౌరసరఫరాల అధికారి, హౌసింగ్ కార్పొరేషన్ పీడీ, స్త్రీ, శిశు సంక్షేమ సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ తదితర పోస్టుల్లో కొత్త వారు వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే జిల్లాలో భారీ మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
     
    ఆయనపైనే అందరి దృష్టి
    జిల్లాలోని ఓ ఉన్నతాధికారి బదిలీపైనే కొందరు అధికారులు లింకు పెట్టుకుంటున్నారు. ఆ అధికారి బదిలీ అయితే ఇక్కడే కొనసాగుతామని, ఆయన ఇక్కడే ఉంటే వెళ్లిపోవడానికి సిద్ధమని కొందరు అధికారులు బాహాటంగానే చెబుతున్నారు. ఆయన సతాయింపు భరించలేకపోతున్నామని, ఆయన పదజాలాన్ని తట్టుకోలేమని, ఎంతటి సమర్ధమైన అధికారినైనా పురుగులా చూస్తున్నారని, మౌఖికంగా ఏదైనా చేసేయమంటారని, చెప్పినది చేయకపోతే టార్గెట్ చేస్తారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండటం కన్న వెళ్లిపోవడమే మేలనే అభిప్రాయంతో కొందరు ఉన్నారు. ఆయనకే బదిలీ అయితే జిల్లాలో ఉండటమే మంచిదనే నిర్ణయానికొచ్చారు. మరి ఏమవుతుందో చూడాలి.
     
     
    సొమ్ము చేసుకుంటున్న నేతలు
    ఉద్యోగుల ఆసక్తి, ఆత్రుతను పలువురు నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. మంచి పోస్టింగ్ కోసం, కావల్సిన ప్రాంతం కోసం అధికారులు, ఉద్యోగులు ఎప్పుడైతే పైరవీలకు దిగారో ఇదే అదనుగా నేతలు రంగంలోకి దిగారు. ఒక్కో దానికి ఒక్కో రేటు నిర్ణయించేసి, ఒప్పందాలు చేసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే కొందరు కీలక ప్రజాప్రతినిధులను ఆశ్రయించారు. అందుకు తగ్గ హామీలను పొందారు. జిల్లాలోని కీలకమైన పోస్టుల కోసం రూ. లక్షలు వెచ్చిస్తున్నట్టు తెలుస్తోంది. పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ అనే తేడా లేకుండా అన్ని శాఖల్లోనూ ప్రస్తుతం జోరగా పైరవీలు సాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement