దేవుడి శాఖలో బదిలీ.. గోడకు కొట్టిన బంతి! | Government allows general transfers in temples | Sakshi
Sakshi News home page

దేవుడి శాఖలో బదిలీ.. గోడకు కొట్టిన బంతి!

Jun 8 2026 2:49 AM | Updated on Jun 8 2026 2:49 AM

Government allows general transfers in temples

పైరవీ చేస్తే చాలు మళ్లీ పాతగుడిలోనే పోస్టు

అపహాస్యమవుతున్న ప్రభుత్వ సాధారణ బదిలీ తంతు

వాటిని సరిదిద్దకుండానే కొత్త బదిలీ కసరత్తు మొదలు

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇతర ఉద్యోగులు

సాక్షి, హైదరాబాద్‌: ఆ అధికారులు యాదగిరిగుట్ట దేవాలయంలో పనిచేస్తున్నారు... సాధారణ బదిలీల్లో భాగంగా వారు వేరే ఆలయాలకు బదిలీ అయ్యారు... కానీ, రెండుమూడు నెలల్లోనే తిరిగి యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చేశారు. డిప్యూటేషన్‌ అనో, పరిపాలనపరమైన సర్దుబాటు అనో వారిని తిరిగి మార్చారు. ఇది ఒక్క యాదగిరిగుట్ట ఆలయానికే పరిమితం కాలేదు. ఇది జరిగి ఏడాదికిపైగా గడుస్తోంది. 

ఇప్పుడు మళ్లీ సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతించటంతో, రాష్ట్రంలోని ఆరు ప్రధాన దేవాలయాల్లో మళ్లీ బదిలీల కసరత్తు మొదలైంది. కానీ, గతేడాది జరిగిన బదిలీల్లో పైరవీలు చేసుకుని పాత దేవాలయాలకే వచ్చిన వారిని కదిలించకుండా ఇప్పుడు కొత్త బదిలీలకు కసరత్తు చేస్తుండటం వివాదాస్పదమవుతోంది. దేవాదాయ శాఖ వ్యవహారాలపై ప్రభుత్వానికి పట్టులేకపోవటంతో స్థానిక నేతలు, కొందరు అధికారులు చెప్పిందే వేదంగా మారింది.

ఆరు ప్రధాన ఆలయాల్లో...
ప్రభుత్వ శాఖల్లో నెలరోజులపాటు సాగిన సాధారణ బదిలీల ప్రక్రియ ముగియటంతో ప్రభుత్వం వారం క్రితం బదిలీలపై నిషేధం విధించింది. కానీ, సరస్వతీ నది అంత్య పుష్కరాల నేపథ్యంలో దేవాదాయ శాఖలో బదిలీలు జరగలేదు. ఇప్పుడు పుష్కరాలు ముగియటంతో సాధారణ బదిలీలు చేసుకునేందుకు ప్రభుత్వం తాజాగా ఆనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో ఆరు ప్రధాన దేవాలయాలైన యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, బాసర, కొండగట్టు, కొమురవెల్లిలోని ఉద్యోగులను బదిలీ చేసేందుకు కసరత్తు మొదలైంది. 

ఏడాది క్రితం ఈ ఆరు ఆలయాల్లో 40 శాతం మందిని బదిలీ చేశారు. ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులోని నిబంధనల మేరకు బదిలీలు చేయబోతున్నారు. కానీ, గత బదిలీల్లో చోటు చేసుకున్న ఇష్టారాజ్యాన్ని సరిదిద్దకుండానే కొత్త బదిలీలు చేయనుండటం పట్ల ఆయా ఆలయాల్లోని మిగతా ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అప్పుడేం జరిగింది... 
ఈ ఆరు దేవాలయాలల్లోని 40 శాతం మంది ఉద్యోగులను బదిలీ చేశారు. కానీ, వారిలో కొందరికి పాత దేవాలయాలపై ‘మమకారం’ అలాగే ఉంది. దీంతో ఆ ఉద్యోగులు పలుకుబడి ఉన్న నేతలు, కొందరు అధికారులను ‘కలిశారు’. ఇంకేముంది, ఆయా దేవాలయాల్లో ‘అవసరం’ ఉందంటూ డిప్యూటేషన్‌/సర్దుబాటు పేరుతో ఆర్డర్లు జారీ అయ్యాయి. వెంటనే ఆ పైరవీ ఉద్యోగులు పాత దేవాలయాల్లో వాలారు. బదిలీ అయినా, గోడకు కొట్టిన బంతి మాదిరి వచ్చిన వారిని అలాగే ఉంచి, ఇతర ఉద్యోగులను బదిలీ చేయబోతున్నారు. 

భారీ ఆదాయమార్గంగా ఉన్న యాదగిరి గుట్ట ఆలయాన్ని వదిలి వెళ్లేందుకు చాలామంది ఇష్టపడటం లేదు. బదిలీ అయి వెళ్లిన వారిలో కొందరు తిరిగి ఇక్కడికి వచ్చి చేరుతుండటంతో ఇక్కడ ఖాళీలు లేక గందరగోళం నెలకొంది. ఇక వేములవాడలో దాదాపు ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ సిబ్బంది సరిపోక ఇబ్బంది నెలకొంది. ఇక్కడ ఓ నేత జోక్యం దీనికి కారణంగా మారింది. గతంలో ఈ ఆలయానికి చెందిన ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ యాదగిరిగుట్టకు బదిలీ అయ్యాడు. ఆయనకు ఇటీవల సూపరింటెండెంట్‌గా పదోన్నతి వచ్చింది. మాతృ దేవాలయంలోనే పదోన్నతి తీసుకోవాల్సి ఉంటుంది. 

కానీ, ఆ ఉద్యోగిని అక్కడ చేర్చుకోకుండా ఆ నేత అడ్డుకున్నారు. దీంతో కొండగట్టు దేవాలయానికి మార్చారు. కానీ అక్కడ సూపరింటెండెంట్‌ పోస్టు ఖాళీ లేకపోవటంతో ఆ ఉద్యోగి పదోన్నతి గందరోగళంగా మారింది. ఇప్పటికీ సీనియర్‌ అసిస్టెంట్‌గానే పనిచేయాల్సి వచ్చింది. అతని జూనియర్లు కొందరు పదోన్నతి పొందటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దేవాదాయశాఖలో ఇంత గందరగోళం ఉన్నా ప్రభుత్వం దృష్టి   సారించలేకపోతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement