బదిలీలతో ఎట్టకేలకు పట్టణాలకు! | Transfers in the medical and health departments completed | Sakshi
Sakshi News home page

బదిలీలతో ఎట్టకేలకు పట్టణాలకు!

Jun 12 2026 3:56 AM | Updated on Jun 12 2026 3:56 AM

Transfers in the medical and health departments completed

వైద్య,ఆరోగ్య శాఖలోని 157 కేడర్లలో 4,869మంది బదిలీలు పూర్తి 

పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టరేట్‌లోనే 2,258 మంది

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆరోగ్యశాఖలో భారీ స్థాయిలో చేపట్టిన బదిలీల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. 157 కేడర్లలో మొత్తం 4,869 మంది ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిలో అత్యధికంగా పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టరేట్‌ పరిధిలోనే 2,258 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు. వైద్య,ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాలతోపాటు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, టీచింగ్‌ హాస్పిటళ్లలో అవసరాలకు అనుగుణంగా డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందిని పునర్వ్యవస్థీకరించారు. 

దీర్ఘకాలం హైదరాబాద్‌ వంటి ఒకే స్టేషన్‌లో పనిచేసిన వారిని జిల్లాలకు పంపడం వల్ల, జిల్లాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన పలువురు వైద్యులు, సిబ్బందికి హైదరాబాద్‌ పోస్టింగ్‌ల అవకాశాలు లభించాయి. ఈసారి బదిలీల్లో నాన్‌ ఫోకల్‌ ఏరియాల్లో పనిచేస్తున్న వైద్యులకు ఫోకల్‌ ఏరియాలైన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలతో పాటు పాత ఉమ్మడి జిల్లాల హెడ్‌ క్వార్టర్లలో పోస్టింగులు దక్కడం గమనార్హం. 

ఎన్‌ఎంసీ తనిఖీల దృష్ట్యా జాగ్రత్తలు 
త్వరలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, అనుబంధ టీచింగ్‌ హాస్పిటళ్లలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తనిఖీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం బదిలీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి మెడికల్‌ కాలేజీలో అవసరమైన సంఖ్యలో అధ్యాపకులు, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా పోస్టింగ్‌లను సర్దుబాటు చేసింది.  

ఎవరికి అవకాశం? ఎవరు మినహాయింపు? 
ఆయా విభాగాల్లోని కేడర్‌ను బట్టి 40 శాతం ఉద్యోగులను మాత్రమే బదిలీ చేశారు. సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల విషయంలో దానిని 10 శాతానికి పరిమితం చేశారు. అది కూడా ప్రభుత్వం ఒకే స్టేషన్‌లో నాలుగు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు మాత్రమే బదిలీకి అవకాశం కల్పించింది. నాలుగు సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్‌ ఉన్న ఉద్యోగులకు పెద్ద ఎత్తున బదిలీలు ఇస్తే జిల్లాల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు భావించారు. 

అయినా ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు మూడేళ్లు పైబడి సర్వీస్‌ ఉండి రిక్వెస్ట్‌ బదిలీలు, అనారోగ్య సమస్యలు, వితంతు ఉద్యోగులకు సంబంధించి బదిలీల ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ఫైనాన్స్‌ విభాగ అనుమతితో ఈనెల 16 వరకు ఈ ప్రక్రియ కొనసాగించనున్నట్లు తెలిసింది. బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టడంలో మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు కార్యదర్శి క్రిస్టినా, సంక్షేమ కమిషనర్‌ సంగీత సత్యనారాయణ, డీఎంఈ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌ ప్రధానపాత్ర పోషించారని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement