నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వరంగల్–ఖమ్మం హైవేపై పెద్దనాగారం పరిధిలోని వశ్రాంతండా స్టేజీ వద్ద నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై సమాచారం మేరకు నర్సింహులపేట పోలీసులు శనివారం అర్ధరాత్రి మెరుపుదాడి చేశారు. పెద్దనాగారానికి చెందిన ఓ వ్యక్తి వశ్రాంతండా స్టేజీ వద్ద ఉన్న ఇంటిని కిరాయికి తీసుకున్నాడు. రాత్రి కాగానే అక్కడ ఒక్క మనిషి కన్పించడు. పెద్దనాగారానికి చెందిన నిర్వాహకుడు నడిపిస్తున్న వ్యభిచార గృహంపై పక్కా సమాచారంతో ఎస్సై బానోత్ వెంకన్న సిబ్బందితో కలిసి దాడి చేశారు.
ఇందులో ఓ మహిళ, ముగ్గురు విటులు పట్టుబడ్డారు. పెద్దనాగారానికి చెందిన ఓ వ్యక్తి పరారయ్యాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన మహిళగా, తొర్రూరుకు చెందిన వ్యక్తులుగా ముగ్గురిని గుర్తించారు. తొర్రూరుకు చెందిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అని తెలుస్తోంది. దీనిపై ఎస్సై వెంకన్నను వివరణ కోరగా సమాచారం మేరకు దాడులు చేయగా ఒక మహిళ, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఒకరు పరారీలో ఉన్నారన్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, ప్రశాంత వాతావరణంలో ఉన్న నర్సింహులపేట మండలంలో వ్యభిచార గృహం నడుస్తుందనే విషయం తేలియగానే పలువురు ఆశ్చర్యపోతున్నారు.


