ఉయ్యాలే ఉరి తాడైంది | six yearold boy dien in artsy struck | Sakshi
Sakshi News home page

ఉయ్యాలే ఉరి తాడైంది

Dec 29 2015 1:35 AM | Updated on Sep 28 2018 3:41 PM

ఉయ్యాలే ఉరి తాడైంది - Sakshi

ఉయ్యాలే ఉరి తాడైంది

ఉయ్యాలే ఉరితాడయింది.. ఆ బాలుడి పాలిట అది యమపాశంగా మారి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అప్పటి వరకు ఆడుతూ..

►  మెడకు చీర బిగుసుకుని బాలుడి దుర్మరణం
►  ఆరేళ్ల బాలుడు ఆటాడుతుండగా ఘటన
 
 గుండుగొలనుకుంట (ద్వారకాతిరుమల) :
ఉయ్యాలే ఉరితాడయింది.. ఆ బాలుడి పాలిట అది యమపాశంగా మారి నిండు ప్రాణాన్ని  బలితీసుకుంది. అప్పటి వరకు ఆడుతూ.. పాడుతూ సరదాగా గడిపిన ఆ బాలుడి మెడకు ప్రమాదవశాత్తు  ఉయ్యాలగా వేసిన చీర బిగుసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ హృదయ విదారక ఘటన మండలంలోని గుండుగొలనుకుంట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.
 
 మృతుని బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేడేపల్లి విఘ్నేశ్వరరావు, రత్నసుధ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు. వీరు కూలి పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. ఇందులో పెద్ద కుమారుడు షణ్ముఖసాయి(6) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజులానే షణ్ముఖసాయిని పాఠశాలకు పంపి, వారి తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లారు.
 
  అయితే పాఠశాలకు క్రిస్మస్ సెలవులు కావడంతో ఆ బాలుడు ఇంటికి చేరుకున్నాడు. ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో అలవాటు ప్రకారం ఎప్పుడు ఆడుకునే పక్కింటికి వెళ్లాడు. ఆ ఇంటి వద్ద కూడా ఎవరూ లేరు. ఇదిలా ఉంటే ఆ ఇంటి వారు తమ చంటిపిల్లలను నిద్రపుచ్చేందుకు వరండాలో వేసిన చీర ఉయ్యాలను బాలుడు షణ్ముఖసాయి చూశాడు.
 
  ఉయ్యాలగా ఉన్న చీరను మధ్యకు ముడివేసి ఉండడాన్ని గమనించి ఊగేందుకు వీలుగా లేదని దాన్ని పట్టుకుని కొద్దిసేపు ఆటలాడాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న మంచం ఎక్కి ముడివేసి ఉన్న చీరలో తలపెట్టి కిందకు దూకాడు. దీంతో మెడకు చీర బిగుసుకుని ఉరిపడటంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళుతున్న పలువురు బాలుడు ఊగుతుండడాన్ని గమనించి దగ్గరకు వెళ్లి చూడగా, అప్పటికే మృతిచెందాడు. ఆశతో కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన ద్వారకాతిరుమల పీహెచ్‌సీకి తీసుకెళ్లగా, వైద్యులు అప్పటికే బాలుడు చనిపోయినట్టు నిర్ధారించారు. షణ్ముఖసాయి మృతితో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement