నీళ్ల సాంబారు.. చప్పిడి మెతుకులు | mid day meals low quality in hindupur | Sakshi
Sakshi News home page

నీళ్ల సాంబారు.. చప్పిడి మెతుకులు

Jul 25 2016 11:44 PM | Updated on Aug 29 2018 7:54 PM

నీళ్ల సాంబారు.. చప్పిడి మెతుకులు - Sakshi

నీళ్ల సాంబారు.. చప్పిడి మెతుకులు

చప్పిడి ముద్దగా మారిన అన్నం.. నీళ్ల సాంబారు, పోషక విలువలు లేని భోజనం.. శుభ్రత లేని పరిసరాలు.. దీంతో మధ్యాహ్న భోజనం అంటేనే విద్యార్థులు విముఖత చూపుతున్నారు.

– విద్యార్థులకు రుచించని మధ్యాహ్న భోజనం
– సర్కారు బడుల్లో అందని పోషకాహారం


హిందూపురం అర్బన్‌ : చప్పిడి ముద్దగా మారిన అన్నం.. నీళ్ల సాంబారు, పోషక విలువలు లేని భోజనం.. శుభ్రత లేని పరిసరాలు.. దీంతో మధ్యాహ్న భోజనం అంటేనే విద్యార్థులు విముఖత చూపుతున్నారు. భోజన ఏజెన్సీలకు బకాయిలు సరైన సమయంలో ఇవ్వకపోవడం.. పప్పుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం తదితర కారణాల రీత్యా మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడుతోంది. అప్పులు చేసి పిల్లలకు భోజనం వండి పెడుతున్నామని ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు. సర్కారు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం అమలై పదేళ్లు పూర్తయినా క్షేత్రస్థాయిలో మాత్రం తీరు మారడం లేదు.


హిందూపురం పట్టణంలో 88 ప్రాథమిక, 15 ప్రాథమికోన్నత, 18 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు సుమారు 31 వేల మంది ఉన్నారు. వీరందరికీ భోజన సదుపాయం కల్పించేందుకు 122 ఏజెన్సీలు ఉన్నాయి. అయితే చాలా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అధ్వానంగా సాగుతోంది. ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థికి భోజన ఖర్చు నిమిత్తం రూ.4.60, ఉన్నత పాఠశాలలో రూ.6.38 చొప్పున ఇస్తున్నారు. దీంతో పాటు ప్రాథమిక స్థాయి విద్యార్థికి 100 గ్రాములు, ఉన్నత పాఠశాల విద్యార్థికి 150 గ్రాముల చొప్పున బియ్యం సరఫరా చేస్తున్నారు. కూరగాయలు, చింతపండు, కందిపప్పు ఇలా ప్రతి వస్తువు ధర గత ఏడాది కంటే 15 శాతం పైగా పెరిగాయి. ఈ ధరల మోత భరించలేని నిర్వాహకులు నాణ్యతపై ప్రభావం చూపుతున్నారు.

 

మధ్యాహ్న భోజనం తినలేక చాలామంది పిల్లలు ఇళ్ల నుంచి తెచ్చుకుని తింటున్నారు. మరికొందరు నేరుగా ఇళ్లకే వెళ్లిపోతున్నారు. కోడిగుడ్డు, అరటిపండు నెలకు ఓసారి కూడా ఇవ్వట్లేదు. ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వం ప్రకటించిన మెనూ గాలికి వదిలేసి తమకు అనుకూలమైన రీతిలో భోజనాలు సిద్ధం చేసుకుంటున్నారు. నాణ్యతలేని కూరగాయలు, గుడ్డు, అరటిపండుకు స్వస్తి పలికి ఏజెన్సీ నిర్వాహకులు డబ్బులు మిగులు చేసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీనికితోడు పాఠశాలలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా వేధిస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే రెండు నెలలుగా బకాయిలు చెల్లించ లేదని అప్పులు చేసి వంటలు చేస్తున్నామని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. కాగా మధ్యాహ్న భోజనం నాణ్యతపై దృష్టి సారిస్తామని ఎంఈఓ గంగప్ప తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement