ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నా భోజన పథకం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ విచారణ అనంతరం చర్యలకు ఉపక్రమించింది.
ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, కడుపు నొప్పితో 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే గ్రామంలోని ఓ శుభకార్యంలో మిగిలిపోయిన పప్పు, కూరలను.. మధ్యాహ్న భోజనంలో వడ్డించారని.. వాటిని తినడంవల్లే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని ప్రచారం నడిచింది. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆరోగ్య శాఖ సమన్వయంతో విద్యాశాఖ విచారణకు ఆదేశించింది.
విచారణలో.. కుకింగ్ ఏజెన్సీ పీఎం పోషణ్ మార్గదర్శకాలకు విరుద్ధంగా బయట వండిన ఆహార పదార్థాలను విద్యార్థులకు వడ్డించినట్లు తేలింది. అలాగే మధ్యాహ్నా భోజన పథకాన్ని పర్యవేక్షించాల్సిన ఎండీఎం(మిడ్ డే మీల్స్) టీచింగ్ స్టాఫ్ కూడా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎండీఎం ఇంఛార్జి టీచర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు రూల్స్ ఉల్లంఘనకు పాల్పడ్డ ఆ ఏజెన్సీని తప్పిస్తున్నట్లు స్యూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.



