కొడుకుపై కేసు నమోదు... ఫ్యామిలి ఆత్మహత్యాయత్నం | Family suicide attempt due to college ragging | Sakshi
Sakshi News home page

కొడుకుపై కేసు నమోదు... ఫ్యామిలి ఆత్మహత్యాయత్నం

Aug 22 2015 12:09 PM | Updated on Nov 9 2018 4:20 PM

కుమారుడిపై ర్యాగింగ్ కేసు నమోదు కావడంతో మనస్తాపం చెందిన మక్కిన కిషన్‌రావు తన కుటుంబసభ్యులతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

కరీంనగర్ : కుమారుడిపై ర్యాగింగ్ కేసు నమోదు కావడంతో మనస్తాపం చెందిన మక్కిన కిషన్‌రావు తన కుటుంబసభ్యులతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి కరీంనగర్ జిల్లా గోదావరిఖని మండలంలోని సెంటినరీకాలనీలో చోటు చేసుకుంది. వివరాలు... కిషన్‌రావు కుమారుడు సాయిభార్గవ్ ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ విబాగంలో రెండో ఏడాది చదువుతున్నాడు.

కాగా, కళాశాలకు చెందిన సీనియర్లు, జూనియర్లను ర్యాగింగ్ చేస్తుండగా ఘర్షణ జరిగింది. దీంతో జూనియర్లు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి... విచారణ ప్రారంభించారు. అయితే, ఈ విచారణలో ఓ జూనియర్ విద్యార్థి సాయిభార్గవ్ ర్యాగింగ్ చేయలేదని... ఆ సమయంలో జరిగిన ఘర్షణను అతడు అడ్డుకున్నాడని చెప్పాడు.

అయినా పోలీసులు సాయిభార్గవ్‌పై కేసు నమోదు చేశారు. దీంతో కళాశాల యాజమాన్యం సాయిభార్గవ్‌కు టీసీ ఇచ్చి పంపించింది. దీంతో మనస్తాపం చెందిన అతని కుటుంబసభ్యులు తండ్రి కిషన్‌రావు, తల్లి సునీత, చెల్లి యామినితో కలిసి పురుగుల మందు తాగారు. విషయం తెలిసిన స్థానికులు వీరిని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement