అమరావతి గడ్డపై నుంచే ప్రజలకు న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
గుంటూరు: హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండేలా విభజన చట్టంలో చేర్చారని, అమరావతి నుంచే పాలించాలని, ఈ గడ్డపై నుంచే ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ముందుగా ఇక్కడికి వచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. శుక్రవారం ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కోర్ కేపిటల్ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేయించామని, తాత్కాలిక రాజధానిని కూడా ప్రారంభించామని చెప్పారు. ఈ రోజు మరో సుదినమని, కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు.