శామ్‌సంగ్ ఏ06 5జీ ఫోన్‌కు ప్రభుత్వ ధర రూ.13,398 , ఆన్‌లైన్‌లో ఉన్న ధర రూ.9,380
రూ.77.98 కోట్ల స్మార్ట్ ఫోన్ డీల్‌లో ప్రజాధనం లూటీ
అంగన్‌వాడీలకు 58,204 ఫోన్ల కొనుగోలులో అవినీతి
4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ ఫోన్‌కు రూ.13,398 వ్యయం
ఆన్‌లైన్‌లో ఇదే కాన్ఫిగరేషన్ మొబైల్ ధర రూ.10 వేలలోపే
భారీగా కొంటే ఆన్‌లైన్ కంటే తక్కువకే ఆఫ్‌లైన్‌లో లభ్యం
కానీ, ఆన్‌లైన్ కంటే అధిక ధర చెల్లింపుతో చంద్రబాబు ప్రభుత్వ దోపిడీ
చార్జర్లలోనూ కక్కుర్తి... మొబైల్ కంపెనీనే చార్జర్ ఇవ్వాలని నిబంధన
అదీ ఎగ్గొట్టేందుకు ఎత్తులు... సాగకపోడంతో థర్డ్ పార్టీ చార్జర్‌తో సరి
కంపెనీ చార్జర్ రూ.వెయ్యిపైనే.. థర్డ్ పార్టీదైతే రూ.400లోపే
సాక్షి, అమరావతి : సామాన్యులు సైతం ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే ఎక్కడ తక్కువకు దొరుకుతుందా? అని ఆలోచిస్తారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో ధరలను పోల్చి చూస్తారు..! కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తక్కువ ధరకు లభ్యమయ్యే చాన్స్ ఉన్నా విస్మరించింది..! అధిక ధర చెల్లింపుతో దోపిడీకి పాల్పడింది..! ప్రజాధనం లూటీ చేసింది..! చివరకు చార్జర్లలోనూ కక్కుర్తి పడింది...!
ఇదంతా అంగన్‌వాడీ వర్కర్లకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అందించిన స్మార్ట్‌ఫోన్ల కొనుగోలులో జరిగిన తతంగం. కీలక నేతలు ఈ అవినీతి కథ నడిపారని తెలుస్తోంది. 58,204 మొబైల్ ఫోన్లను అధిక ధరకు కొని రూ.20 కోట్లకు పైగా స్వాహా చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ‘హలో...’ అంటూ చంద్రబాబు సర్కారులో ‘స్మార్ట్ దోపిడీ’ సాగింది ఇలా..!
టెండర్లలోనే నిబంధనలకు పాతర
అంగన్‌వాడీ సిబ్బందికి స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా అక్టోబర్‌లో టెండర్లు పిలిచారు. వాస్తవానికి కనీసం మూడు ఏజెన్సీలు బిడ్ దాఖలు చేయాల్సి ఉండగా ఒకే సిండికేట్‌కు చెందిన రెండు ఏజెన్సీలు బిడ్ వేశాయి. వీటిలో ఒకదానికి టెండర్ కట్టబెట్టారు. తద్వారా మొదటే నిబంధనలకు పాతరేశారు. నవంబర్‌లో హైదరాబాద్‌లోని హల్లో మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. ఈ నెల 10వ తేదీన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఫోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
ఆన్‌లైన్ వద్దు.. అధిక ధరే ముద్దు
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమోరీ సామర్థ్యం ఉన్న 58,204 శాంసంగ్ స్మార్ట్ ఫోన్లను ఒక్కోటి రూ.13,398 చొప్పున కొనుగోలు చేసేందుకు రూ.77.98 కోట్లకు పైగా చెల్లించారు. చిత్రం ఏమంటే, శాంసంగ్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ ఫోన్ ధర ఆ సంస్థ వెబ్‌సైట్‌లో రూ.9,899గా ఉంది. ఇదే రేటుకు రాష్ట్ర ప్రభుత్వం ఖరీదు చేసి ఉంటే రూ.61.10 కోట్లు అయ్యేది.
ఇక అమెజాన్‌లో అయితే శుక్రవారం ఆఫర్ ధర రూ.8,499, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,380గా ఉంది. ఈ లెక్కన 58,204 ఫోన్ల కొనుగోలుకు రూ.58 కోట్లు వ్యయం అవుతుంది. పెద్దసంఖ్యలో కావాల్సినప్పుడు నేరుగా కంపెనీని సంప్రదిస్తే... రూ.10 వేల కంటే తక్కువకే లభించే అవకాశం ఉంటుందని మార్కెటింగ్ నిపుణుడు ఒకరు పేర్కొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆన్‌లైన్ ధర కంటే అధిక మొత్తానికి కొనుగోలు చేసింది. రూ.20 కోట్ల ప్రజాధనాన్ని కాజేసింది.
చార్జర్లలోనూ చేతివాటం
మొబైల్ ఫోన్ల కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ చార్జర్ ఇవ్వకుండా డబ్బులు మిగుల్చుకునే ప్రయత్నం చేసింది. ఫోన్‌తో పాటు చార్జర్ ఇవ్వాలని వర్క్ ఆర్డర్‌లో స్పష్టంగా ఉంది. కానీ, కాంట్రాక్టు సంస్థ ఎగ్గొట్టాలని చూసింది. అధికారులు గట్టిగా మందలించడంతో చార్జర్ ఇచ్చింది. కానీ, ఇక్కడా కక్కుర్తే. శాంసంగ్ కంపెనీ చార్జర్ రూ.1,699 కాగా ఆన్‌లైన్‌లో రూ.850కు కూడా వస్తుంది.
కనీసం శాంసంగ్ చార్జర్ కాకపోయినా మరో మంచి కంపెనీది కూడా ఇవ్వలేదు. మార్కెట్‌లో రూ.400 కంటే తక్కువకు దొరికే థర్డ్‌పార్టీ చార్జర్ ఇచ్చింది. అవి హీటెక్కి ఎప్పుడు పేలిపోతాయో అన్నట్లున్నాయని అంగన్‌వాడీలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన ఫోన్లు తమ ప్రాణాల మీదకు వచ్చేలా ఉన్నాయని వాపోతున్నారు. కాగా, స్క్రీన్ గార్డును మీరే వేయించుకోండని కాంట్రాక్టు సంస్థ చెప్పగా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏజెన్సీ నిర్వాహకులు వేయకతప్పలేదు.
అంగన్‌వాడీ.. కొనుగోలు ఏదైనా దోపిడీ!
» చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలందించే అంగన్‌వాడీ కేంద్రాలను చంద్రబాబు ప్రభుత్వంలోని కీలక నేతలు తమ అవినీతికి కేంద్రంగా మార్చేశారు. కేంద్రాలకు వస్తువుల కొనుగోలులో జరిగిన అక్రమాలే దీనికి అద్దంపడుతున్నాయి.
» సాక్షం అంగన్‌వాడీ మిషన్–2లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.వంద కోట్లలో రూ.25 కోట్లతో నిరుడు 9,664 అంగన్‌వాడీ కేంద్రాలకు స్మార్ట్ టీవీల కొనుగోలు చేశారు. ఇందులో లోపాయికారీ ఒప్పందాలకు పాల్పడ్డారు. నిబంధనలు ఉల్లంఘించారు. చాలా టీవీలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటికీ సద్వినియోగం కావడం లేదు.
» అంగన్‌వాడీ చిన్నారుల ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్‌లలోనూ బాబు సర్కారు చేతివాటం ప్రదర్శించింది. 257 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 55,746 సెంటర్లకు ఈ కిట్‌ల కొనుగోలులో డీల్ కుదిరిందనే ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రూ.7.31 కోట్ల విలువైన వర్క్ ఆర్డర్‌ను నామినేషన్‌పై కేరళకు చెందిన కండోమ్స్ తదితర వస్తువుల తయారీ కంపెనీకి అప్పగించారు. చిత్రం ఏమంటే ఈ కిట్‌లు ఇంకా అంగన్‌వాడీలకు చేరలేదు.


