సభలో కుప్పకూలిన రైతు రామారావును తీసుకెళ్తున్న స్థానికులు
భూములిస్తే.. బలి తీసుకున్నారు!
ఇప్పటికే రెండు ఎకరాలు ఇచ్చా.. ఈ ప్రభుత్వం మమ్మల్ని ముంచేసింది!
నేనిచ్చిన భూమికి బదులుగా వాగులో ప్లాటు ఇచ్చారు..
ఇప్పుడు నా ఇంటిని కూడా లాక్కుంటామంటే ఎలా?
సభలో మాట్లాడిన అనంతరం కుప్పకూలి రైతు రామారావు మృతి
ఎన్–8 రోడ్డు బాధితులతో మందడంలో నిర్వహించిన గ్రామసభలో తీవ్ర విషాదం..
రాజధాని కోసం లక్ష ఎకరాల దిశగా బాబు సర్కారు అడుగులు
గతంలోనే 50 వేల ఎకరాలకుపైగా సేకరణ.. అది చాలదంటూ మళ్లీ పూలింగ్
29 గ్రామాలకే పరిమితమైతే అమరావతి.. ఓ చిన్న మున్సిపాలిటీనే అంటూ బెదిరింపులు
మొత్తం ఏడేళ్ల పాటు అధికారంలో ఉన్నా రైతులకిచ్చిన హామీలను నెరవేర్చని బాబు
సారవంతమైన భూములే కాదు.. తమ ఇళ్లపై కూడా గురి పెట్టడంతో రైతన్నల్లో తీవ్ర మానసిక వ్యధ.. తామిచ్చిన భూములకు బదులుగా వాగులు, చెరువు భూములు, నీట మునిగే ప్రాంతాల్లో ప్లాట్లు ఇవ్వడంపై ఆగ్రహావేశాలు
ఈ నమ్మక ద్రోహాన్ని ప్రశ్నిస్తూ మందడం సభ సాక్షిగా మానసిక క్షోభతో రామారావు మృతి
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడికొండ, సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో చంద్రబాబు సర్కారు పదేపదే చేస్తున్న బలవంతపు భూసేకరణ ఒత్తిళ్లతో తల్లడిల్లిన ఓ రైతన్న గుండె ఆగింది! గతంలోనే భూ సమీకరణ కింద రెండు ఎకరాల భూమి ఇచ్చిన రాజధాని రైతు దొండపాడు రామారావు(68) ఇప్పుడు తాను ఉంటున్న ఇంటిని కూడా ప్రభుత్వం రోడ్డు కోసం సేకరిస్తుండటంతో తీవ్రంగా కలత చెందాడు.
తాను ఇచ్చిన రెండెకరాల పొలానికి బదులుగా.. వాగులో ముంపునకు గురయ్యే ప్రాంతంలో రిటర్నబుల్ ప్లాటు ఇవ్వడంతో మానసికంగా కుంగిపోయిన రామారావు.. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం నిర్వహించిన సభలోనే ఆందోళనతో కుప్పకూలి మృతి చెందాడు. రాజధాని ఎన్–8 రోడ్డు నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న రైతులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ విషాదం చోటు చేసుకుంది. చంద్రబాబు సర్కారు నిరంకుశ వైఖరి, బలవంతపు భూ సేకరణపై రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేదిక దిగి కుప్పకూలిన రైతన్న..
రాజధానిలో ఎన్–8 రోడ్డు నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న బాధిత రైతులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణతో పాటు స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్, సీఆర్‌డీఏ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తుండగా.. గ్రామానికి చెందిన రైతు దొండపాటి రామారావు స్పందిస్తూ.. ‘మమ్మల్ని ముంచేశారు.
అప్పుడు భూసమీకరణలో రెండెకరాలు పొలం ఇస్తే.. మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు వాగులో ఇచ్చారు. ఇప్పుడు మాకున్న ఇంటి స్థలం కూడా తీసుకుంటున్నారు. గతంలో నేను రాజధాని భూ సమీకరణ కోసం రెండెకరాల భూమి ఇస్తే అందుకు బదులుగా ప్లాట్లు వాగులో ఇచ్చారు. అక్కడకు వెళ్లి మేం ఎలా నివాసం ఉండాలి..?’ అంటూ ఆక్రోశించారు. ఈ ప్రభుత్వం తమను ముంచేసిందని మండిపడ్డారు. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారందరికీ సీడ్ యాక్సెస్ రోడ్డులో ఒకేచోట స్థలాలివ్వాలని కోరారు.
ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే.. హైదరాబాద్‌లో రైతు గొంతు కోసుకున్నట్లుగా తాము కూడా గొంతు కోసుకోవాల్సి వస్తుందని ఆవేదనగా చెప్పాడు. రైతు రామారావు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఉండగా.. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కల్పించుకుని ఆయన్ను మాట్లాడనివ్వలేదు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో వేదిక నుంచి వెనుతిరిగిన రైతు దొండపాటి రామారావు రెండడుగులు వేయగానే ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలారు. సభలో ఉన్న స్థానికులు, రైతులు వెంటనే ఆయన్ను వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఇళ్లిచ్చి.. మేం బొచ్చెలు పట్టుకుని బజార్ల వెంబడి పడి ఏడవడం ఏంటి?
రోడ్డు కోసం మీరు ఇళ్లు తీసుకునే లెక్కనైతే తీసుకోండి.. మాకు ఎక్కడిస్తారంటే.. సీడ్ యాక్సిస్ రోడ్డు వెంబడి స్థలాలు ఇవ్వండి. పొలాలు ఇచ్చాం.. సింగపూర్ వాళ్లకు ఇచ్చిన దాంట్లో రెండు ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టారు.. లాటరీ అని.. ఎవరికి చెప్పుకోవాలి..? ఇచ్చిన చోట ఇంత లోతు (ఛాతీ చూపిస్తూ) నీళ్లు పడ్డాయి. ఈ ఇళ్లు ఇచ్చి.. మేం బొచ్చెలు పట్టుకుని బజార్ల వెంబడి పడి ఏడవడమేంటి? అడుక్కోలేం కదా...!
సింగపూర్ వాళ్లకు ఇచ్చిన సీడ్ యాక్సిస్ రోడ్డుకు అవతల ఊళ్లో వాళ్లందరికి కలిపి ఒకేచోట స్థలాలు ఇవ్వండి... ఎవరికి వాళ్లకు ఇచ్చారనుకో.. హైదరాబాద్‌లో మాదిరి గొంతు కోసుకున్నారుగా.. అలా కోసుకుంటారు (పీక కోసుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు). ఆ తరువాత రామారావు హఠాత్తుగా కుప్పకూలిపోయారు. – మందడం సభలో రైతు రామారావు ఆక్రందన ఇదీ..

మారిన అలైన్‌మెంట్..
రాజధాని అమరావతిలో ఎన్–8 రహదారి నిర్మాణంలో భాగంగా మొదటి అలైన్‌మెంట్ ప్రకారం 117 మంది ఇళ్లు కోల్పోతుండగా గ్రామంలో పురాతన ఆలయాలు తొలగించకుండా సవరించారు. దీని ప్రకారం రెండోసారి 160 మంది వరకు రైతులు ఇళ్లు కోల్పోతున్నారు. వీరందరికీ పరిహారం, ఇతర విషయాలు చర్చించేందుకు నిర్వహించిన గ్రామసభలో ఈ విషాదం చోటుచేసుకుంది.
స్థలాలిచ్చిన చోట వరద నీరు..
రాజధానికి భూములిచ్చిన రైతుల్లో సుమారు 70 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే కావడంగమనార్హం. వారికి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. వాగులు, చెరువు భూముల్లో ప్లాట్లు కేటాయించింది. భారీ వర్షాలు పడితే ఆ స్థలాల్లో మూడు నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు నిలబడుతోంది. ఈ నేపథ్యంలో తమకు సీడ్ యాక్సిస్ రోడ్డుకు సమీపంలో భూములివ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రాజధాని అమరావతికి భూసమీకరణ కింద భూములు ఇవ్వని రైతులపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తూ మానసికంగా వేధిస్తోందని ఆక్రోశిస్తున్నారు. గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ ఇదే అంశాన్ని తెగేసి చెబుతున్నారని పేర్కొంటున్నారు. ఈ ఒత్తిళ్లకు తాళలేక గత 19 నెలల్లో 542.24 ఎకరాల భూమిని భూసమీకరణ కింద సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ)కు రైతులు అప్పగించేశారు. మిగతా భూమి కోసం గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
వాగు, చెరువు భూముల్లో రైతులకు ప్లాట్లు..
రాజధానికి భూములిచ్చిన రైతులకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు సీఆర్‌డీఏ ఇవ్వాలి. ఆ ప్లాట్లను భూసమీకరణ కింద తీసుకున్న భూములలోనే ఇవ్వాలి. చెరువు భూముల్లో ఇవ్వకూడదు. కానీ.. పిచ్చుకలపాలెం చెరువు భూమిలో 78 మందికి, తుళ్లూరు చెరువు భూమిలో 65 మందికి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం బట్టి చూస్తే.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకూ చంద్రబాబు సర్కారు వెన్నుపోటు పొడిచిందన్నది స్పష్టమవుతోంది.
ఆ ప్లాట్లలో ఇళ్లను నిర్మించుకుంటే.. చట్టప్రకారం భవిష్యత్‌లో వాటిని కూల్చేయడం ఖాయమని, అప్పుడు తమ పరిస్థితి ఏమిటని రైతులు నిలదీస్తున్నారు. చెరువును మాయం చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, వాతావరణ సమతుల్యత దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు పడతామని పిచ్చుకలపాలెం, తుళ్లూరు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లక్ష ఎకరాల దిశగా..!
రాజధాని ముసుగులో బలవంతంగా భూములను గుంజుకుంటున్న చంద్రబాబు సర్కారు లక్ష ఎకరాలను గుప్పిట పట్టేందుకు బరి తెగిస్తోందని అన్నదాతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భూములిచ్చిన అన్నదాతలను దారుణంగా వంచించి పొట్టనబెట్టుకుంటోందని మండిపడుతున్నారు.
గతంలోనే టీడీపీ హయాంలో అమరావతి కోసం 50 వేల ఎకరాలకుపైగా సేకరించగా.. అది చాలదంటూ ఇప్పుడు విడతలవారీగా మరో 50 వేల ఎకరాలను తీసుకునేందుకు సన్నద్ధం కావడం.. 29 గ్రామాలకే పరిమితమైతే అమరావతి ఓ చిన్న మునిసిపాలిటీగా మిగిలిపోతుందని బెదిరింపులకు దిగడం.. సారవంతమైన పొలాలే కాదు.. ఇళ్లను కూడా లాక్కోవడం.. దాదాపు ఏడేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు తమకిచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో రాజధాని రైతన్నలు రగిలిపోతున్నారు.
ఒకపక్క ఇంటర్నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ పేరుతో రైతుల నుంచి కారుచౌకగా భూములు కాజేసే కుట్రలకు తెరతీయడం.. ఇళ్లను సైతం రోడ్డు నిర్మాణం పేరుతో సేకరిస్తుండటం.. మరోపక్క గతంలో భూములిచ్చిన అన్నదాతలకు వాగులు వంకల్లో నీట మునిగే ప్రాంతాల్లో రిటర్న్‌బుల్ ప్లాట్లు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నమ్మి భూములిస్తే రోడ్డు పాలు..!
గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల పరిధిలోని 217 చదరపు కిలోమీటర్లు (53,749.49 ఎకరాలు) ప్రాంతాన్ని ప్రభుత్వం 2015లో రాజధానిగా ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతంలో 15,807.91 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా మిగతా 37,941.58 ఎకరాలు రైతులది. భూ సమీకరణ కింద 34,396.87 ఎకరాలను అప్పట్లోనే సమీకరించింది. మిగతాది సమీకరణ కింద ఇచ్చేందుకు రైతులు అప్పట్లో అంగీకరించలేదు.
2024లో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ భూమిని సేకరించడానికి పావులు కదుపుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆ భూమిని సమీకరణ కింద ఇస్తే సరి.. లేదంటే బలవంతపు భూసేకరణ చేసేందుకు గత అక్టోబర్ 3న కేబినెట్ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మందడం, ఉండవల్లి, పెనుమాక, యర్రబాలెం, నిడమర్రు, కురగల్లు, బేతపూడి, నవులూరు గ్రామాల్లో సమీకరణ కింద భూములు ఇవ్వని రైతులతో మంత్రి నారాయణ వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
సమీకరణ కింద భూములు ఇవ్వకుంటే.. భూసేకరణ చట్టం–2013 కింద సేకరిస్తామంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇప్పటికే సమీకరణ కింద వేల ఎకరాల భూములు ఇచ్చామని, దీనికి బదులుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని నమ్మబలికి నీరు నిల్వ ఉండే పల్లపు ప్రాంతాల్లో ప్లాట్లు అంటగట్టారంటూ రైతులు మండిపడుతున్నారు. ఇక ఇప్పుడు తాము నివాసం ఉంటున్న ఇళ్లను కూడా తీసుకుంటే రోడ్డున పడతామని ఆక్రోశిస్తున్నారు.


