ఏపీని ప్రత్యేకంగా చూడలేం

ఏపీని ప్రత్యేకంగా చూడలేం - Sakshi


♦  ప్రత్యేకంగా చూసేందుకు నిబంధనలు ఒప్పుకోవు

♦  కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్

 

 సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ గురించి 14వ ఆర్థిక సంఘం సిఫారసుల్లో ప్రత్యేకంగా ఏమీ ప్రస్తావించలేదని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసేందుకు నిబంధనలు ఒప్పుకోవని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం విజయవాడలో గిరిజన మహిళా సర్పంచుల జాతీయ సదస్సును ప్రారంభించిన అనంతరం సహచర కేంద్ర మంత్రు లు, సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 14వ ఆర్థిక సంఘం నుంచి గానీ, వెనకబడిన ప్రాంతాలకు ప్యాకేజీల రూపంలోగానీ ఏపీకి కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం లేదంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ... 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు అన్ని రాష్ట్రాలతో సమానంగానే ఏపీని చూస్తామన్నారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం ప్రాధాన్యతా క్రమంలో నిధులు ఇస్తామని చెప్పారు.అయినా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి (ఎకనమిక్ గ్రోత్) బాగుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థుడు కాబట్టి బయటి నుంచి కూడా అప్పులు తీసుకురాగలరని బీరేంద్రసింగ్ చమత్కరించారు. కేంద్రం కొద్దిపాటి సాయం అందించినా ఏపీ మరికొన్నేళ్లలో మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నామన్నారు. ఏపీలో అప్పుడే కొత్త రాజధానికి పునాది వేసుకున్నారని చెప్పారు. ఏపీ కొత్త రాష్ట్రమైనా తక్కువ సమయంలోనే అన్ని విధాలుగా నిలదొక్కుకుంటుందన్నారు.కలెక్టర్లు, మండలాధికారుల ప్రమేయం లేకుండా నేరుగా పంచాయతీలకే నిధులు విడుదల చేసి, ఖర్చు చేసుకునేలా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని  చౌదరి బీరేంద్రసింగ్ ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... కొత్త రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ సహాయంతో అభివృద్ధి సాధిస్తామని చెప్పా రు. మీడియా సమావేశంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఒరం, నీరు, పారిశుధ్యం శాఖల సహాయ మంత్రి రామ్‌కృపాల్ యాదవ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుదర్శన్ భగత్, పంచాయతీరాజ్  శాఖ సహాయ మంత్రి నెహాల్‌చంద్, రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, రావె ల కిషోర్‌బాబు, మృణాళిని పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top