కాసులు గలగల! | Alcohol record business in district | Sakshi
Sakshi News home page

కాసులు గలగల!

Jun 14 2016 1:57 AM | Updated on Mar 28 2018 11:26 AM

కాసులు గలగల! - Sakshi

కాసులు గలగల!

మందు వ్యాపారం చిందేస్తోంది.. మునుపటి ఆదాయం తాలూకు రికార్డులను బద్దలు కొడుతోంది..

జిల్లాలో రికార్డుస్థాయిలో మద్యం వ్యాపారం
నెలకు రూ.50 కోట్లు దాటుతున్న విక్రయాలు
ఏడాదికేడాది సరికొత్త రికార్డులు నమోదు
గత రెండున్నర నెలల్లో రూ.124 కోట్ల బిజినెస్
మున్ముందు శుభకార్యాలపై ఎక్సైజ్ శాఖ ఆశలు

మందు వ్యాపారం చిందేస్తోంది.. మునుపటి  ఆదాయం తాలూకు రికార్డులను బద్దలు కొడుతోంది.. తాజాగా సరికొత్త రికార్డును సృష్టించింది. మద్యం ప్రియుల కోసం సర్కారు నిబంధనలు సడలిస్తుండడంతో గతంలో ఎన్నడూ లేనంతగా జిల్లాలో అమ్మకాలు రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి అమ్మకాల తీరును పరిశీలించి ఎక్సైజ్ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం శుభకార్యాలు, పండగలేవీ లేకున్నా విక్రయాలు జోరుగా సాగుతుండడంతో సర్కారు ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ వార్షికంలో ఏప్రిల్, మే, జూన్ తొమ్మిదో తేదీ నాటికి ఏకంగా రూ.124.86 కోట్ల వ్యాపారం జరగడం గమనార్హం. - సాక్షి, రంగారెడ్డి జిల్లా

2015 సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో సగటున రూ.43.5 కోట్ల వ్యాపారం జరగ్గా.. ప్రస్తుతం సగటున రూ.55 కోట్ల వ్యాపారం జరిగింది. వేసవిలో బీరు విక్రయాలు జోరుగా సాగగా.. లిక్కర్ వ్యా పారం కాస్త తగ్గింది. ప్రస్తుతం వర్షాకాలం రావడంతో లిక్కర్ విక్రయాలు ఊపందు కోనున్నాయి.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో మూడు వందలకుపైగా మద్యం షాపులున్నాయి. అయితే వీటికి అనుబంధంగా రెండు వేలవరకు అనధికారిక బెల్టు షాపులున్నాయి. వీటి ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఒకవైపు పట్టణ ప్రాంతం, మరోవైపు గ్రామీణ వాతావరణం మిళితమై ఉండడంతో లిక్కర్ వ్యాపారం జోరుగా సాగుతోంది. మరోవైపు విదేశీ మద్యం అమ్మకాలకు సైతం ప్రభుత్వం అనుమతులిస్తోంది. దీంతో విక్రయాలు రెట్టింపవుతున్నట్లు అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ.58.2కోట్ల వ్యాపారం జరగ్గా.. గత నెలలో రూ.52.45 కోట్ల విక్రయాలు జరిగాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలున్నందున ఏప్రిల్ నెలలో విక్రయాలు జోరుగా సాగాయి. మే నెలలో శుభకార్యాలు లేకపోవడంతో వ్యాపారం కాస్త మందగించింది. దీంతో అమ్మకాలు 10శాతం తగ్గాయి. మొత్తంగా ప్రతి నెలలో మద్యం వ్యాపారం రూ.50 కోట్లు దాటడం విశేషం.

 ముందున్నాయి.. శుభకార్యాలు
ఈనెల మూడో వారం నుంచి మళ్లీ శుభముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. గత నెలన్నరగా నిలిచిపోయిన శుభకార్యాలకు సమయం అనుకూలం కావడంతో మద్యం వ్యాపారం సైతం జోరందుకోనుంది. ఈ క్రమంలో మద్యం డీలర్లు స్టాకును ముందస్తుగా నిల్వచేసుకుంటున్నారు. ఈ నెలలో రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగినప్పటికీ.. గతనెల కోటా నుంచే విక్రయాలు జరిగినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం జూన్ నెల తొమ్మిదో తేదీ నాటికి రూ.14.23 కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే నెలలో రూ.38.17 కోట్ల వ్యాపారం జరిగితే.. ఈ నెలాఖరు నాటికి రూ.50 కోట్ల వ్యాపారం జరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement