ఘాతుకం : మామ చేతిలో కోడలి హతం | Uncle Killed Daughter in law in Karnataka | Sakshi
Sakshi News home page

ఘాతుకం : మామ చేతిలో కోడలి హతం

Nov 11 2019 7:11 AM | Updated on Nov 11 2019 7:13 AM

Uncle Killed Daughter in law in Karnataka - Sakshi

హత్యకు గురైన వీణ (ఫైల్‌) నిందితుడు నాగరాజు

వివాహేతర సంబంధానికి నిరాకరించిందని ఘాతుకం

కర్ణాటక, మండ్య: వివాహేతర సంబంధానికి అంగీకరించలేదనే కారణంగా వ్యక్తి కోడలిని హత్య చేసిన ఘటన ఆదివారం మండ్య తాలూకా రాగిముద్దనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. హాసన్‌ జిల్లాకు చెందిన వీణ (26)కు రాగిముద్దనహళ్లి గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు అనిల్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. కాగా రెండేళ్ల క్రితం నాగరాజు భార్య సావిత్రమ్మ మృతి చెందింది. అప్పటినుంచి నాగరాజు ప్రతిరోజూ కోడలు వీణను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. రోజురోజుకు వేధింపులు తీవ్రతరం కావడంతో విషయాన్ని భర్త అనిల్‌ దృష్టికి తీసుకెళ్లడంతో అనిల్‌ సైతం తండ్రి నాగరాజును పలుమార్లు హెచ్చరించాడు.

అయినప్పటికీ తీరు మార్చుకోని నాగరాజు వీణను లైంగికంగా వేధించసాగాడు. దీంతో భార్య, పిల్లలతో కలసి అనిల్‌ గ్రామంలోనే వేరుగా ఉండసాగాడు. దీంతో వీణపై అక్కసు పెంచుకున్న నాగరాజు కొడుకు అనిల్‌ ఇంటికి, దుకాణానికి వస్తూ వీణను మాటలతో చేష్టలతో వేధించసాగాడు  . దీనిపై అనిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలుకెళ్లిన నాగరాజు జామీనుపై విడుదలై కోడలిని మరింత వేధించసాగాడు. ఈ క్రమం లో ఆదివారం ఇంటి బయటకు వచ్చిన వీణపై తమ్ముడు మంజు సహకారంతో కత్తితో దాడి చేసిన నాగరాజు గొంతు, కడుపులో పొడిచాడు. వీణ కేకలు విన్న అనిల్, గ్రామస్థులు వెంటనే అక్కడికి వెళ్లగా అప్పటికే వీణ రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతోంది. నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నించగా నాగరాజు, మంజు వెంటనే బైకుపై తప్పించుకున్నారు. వీణను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. మండ్య పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement