
చిన్నారిపై ట్యూషన్ టీచర్ పైశాచిక దాడి..
అలీఘడ్ : ఏడేళ్ల బాలుడిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది. బాలుడిని దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరు నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియోలో టీచర్ బాలుడిని జుట్టు పట్టుకుని లాగుతూ షూతో కొడుతున్న దృశ్యాలు భీతిగొలిపేలా ఉన్నాయి. భయంతో బాలుడు ఏడుస్తున్నా వినకుండా టీచర్ దారుణంగా హింసించాడు. ఇది చాలదన్నట్టు బాలుడి వేళ్లను కొరికాడు. బాలుడిని చిత్రహింసలకు గురిచేసిన అనంతరం బాధితుడికి మంచినీరు ఇచ్చి నవ్వమంటూ సైకోలా వ్యవహరించాడు.
తలుపులు మూసి ఉన్న గదిలో జరిగిన ఈ తతంగం సీసీటీవి ఫుటేజ్ ఆధారంగా బయటపడింది. బాలుడి తండ్రి తన వర్క్‌షాప్‌లో నుంచి తీసుకువచ్చిన సీసీటీవీని ఆ గదిలో అమర్చారు. తమ చిన్నారిపై టీచర్ దారుణంగా వ్యవహరించడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని బాధిత బాలుడి తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఇంట్లో హార్డ్‌వేర్ వర్క్‌షాప్ ఉందని, ఆ యంత్రాల ధ్వనితో బాలుడి అరుపులు ఎవరూ వినిపించుకోలేదన్నారు. సీసీటీవీ ఫుటేజ్ బయటపడిన మీదట బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న టీచర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అశుతోష్ ద్వివేది తెలిపారు.