ఈ వీధి కుక్క సూపర్‌...

Street Dog Founds The Sri Lakshmi Ammavari Hundi - Sakshi

రొంపిచర్ల (నరసరావుపేట): గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో గల నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో ఆదివారం రాత్రి దొంగలు దేవాలయం తాళాలు పగులకొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. ఈ హుండీలో భక్తులు సమర్పించిన సుమారు రూ.50 వేలు నగదు, కేజీ వరకు వెండి వస్తువులు ఉండవచ్చని భావిస్తున్నారు. హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు అందులో ఉన్న వెండి, నగదును తీసుకుని, హుండీని పెద్ద చెరువులో పడేశారు. అయితే గుడి పరిసరాల్లోనే పెరుగుతున్న ఓ శునకం ప్రతిరోజూ గుడికి వచ్చే ఓ ముసలమ్మను కాలితో గీకి సైగలు చేసింది.
దేవాలయం తలుపు తాళాలు పగులకొట్టిన దొంగలు  

ఆ వృద్ధురాలు శునకం చేష్టలను గమనించి దాని వెంట వెళ్లగా, అది చెరువు వద్దకు తీసుకువెళ్లింది. చెరువులో హుండీ కన్పించింది. శునకం అక్కడ నుంచి అన్నారం డొంక రోడ్డులోకి తీసుకెళ్లటంతో అటు వైపే దొంగలు వెళ్లి ఉండొచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. గుడి వద్దే భక్తులు పెట్టే ప్రసాదాలతో జీవిస్తూ, అమ్మవారిపై విశ్వాసంతో హుండీ జాడను చూపించిన శునకాన్ని పోలీసులు, గ్రామస్తులు మెచ్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రొంపిచర్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top