అర్జెంటుగా కాల్‌ చేయాలి.. మొబైల్‌ ఇస్తావా అంటూ! | A Software Engineer attacked and looted | Sakshi
Sakshi News home page

అర్జెంటుగా కాల్‌ చేయాలి.. మొబైల్‌ ఇస్తావా అంటూ!

Dec 7 2017 10:13 AM | Updated on Sep 4 2018 5:32 PM

A Software Engineer attacked and looted - Sakshi

సాక్షి, హైదరాబాద్ : అర్జెంటుగా ఓ ఫోన్‌ కాల్‌ చేయాలి.. మొబైల్‌ ఇస్తావా అంటూ.. నంబరు ప్లేట్‌ లేని బైకుపై హెల్మెట్లు ధరించి వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై దాడి చేసి అతని వద్ద ఉన్న బంగారం లాక్కెళ్లిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సౌత్‌ లాలాగూడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సంతోష్‌కుమార్‌ బుధవారం తెల్లవారు జామున 1.30 గంటల ప్రాంతంలో విధులు ముగించుకొని బైక్‌పై తన స్నేహితుడిని కలిసేందుకు బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని ఇందిరానగర్‌కు వెళ్తూ మీల్స్‌ పార్శిల్‌ తీసుకొనేందుకు హోటల్‌ కోసం గాలిస్తున్నాడు.

హోటల్‌ సుఖ్‌సాగర్‌ మూసి ఉండటంతో సమీపంలో మరో హోటల్‌కు వెళ్లేందుకు బైకు స్టార్ట్‌ చేస్తుండగా అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు అర్జంటుగా ఫోన్‌ కాల్‌ చేసుకోవాలి, మొబైల్‌ ఇవ్వవా అంటూ అడుగుతూనే మరోవైపు వెనకాల కూర్చున్న వ్యక్తి అతడి చేతికున్న బ్రాస్లెట్‌తోపాటు మెడలో రెండు బంగారు గొలుసులు, మొబైల్‌ లాక్కున్నాడు. అడ్డుకొనేందుకు సంతోష్‌కుమార్‌ యత్నించగా మెడపట్టి కిందకు తోయడంతో అతడికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఘటనా స్థలంలో సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement