
సాక్షి, విజయవాడ : నగరంలో దొంగలు వరుస దొంగతనాలకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. అజిత్‌సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడు దుకాణాలలో ఒకేసారి చోరీకి పాల్పడ్డారు. గురువారం రాత్రి దుకాణాలు మూసి వెళ్లిన యజమానులు, ఉదయాన్నే చూస్తే తాళాలు పగులగొట్టి ఉండడం చూసి నివ్వెరపోయారు. విజయవాడ - నూజివీడు రహదారిపై ఉన్న సంగం డైరీ పార్లర్, దాని పక్కనే ఉన్న హెచ్ పి గ్యాస్ కార్యాలయం, గురు సాయి మెడికల్ షాప్‌లలో ఈ చోరీలు జరిగాయి. సుమారు లక్ష రూపాయల నగదు, సెల్‌ఫోన్లు చోరీ అయినట్టు ఫిర్యాదులు అందాయి. ఈ మూడు దొంగతనాలు ఒకేలా జరగడంతో ఒకే ముఠా అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ప్రజలు ఈ చర్యతో బెంబేలెత్తిపోతున్నారు. రాత్రివేళ గస్తీ సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే చోరీలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లేకుంటే మరిన్ని దొంగతనాలు జరిగే అవకాశముందని ప్రజలు కోరుతున్నారు.