పాత సామాన్లకు ఉల్లిపాయలంటూ..! | Robbery Gang Arrested By Chirala Town Police | Sakshi
Sakshi News home page

పాత సామాన్లకు ఉల్లిపాయలంటూ దొంగతనాలు

Aug 28 2019 8:41 AM | Updated on Aug 28 2019 8:55 AM

Robbery Gang Arrested By Chirala Town Police - Sakshi

నిందితుల వివరాలను వెల్లడిస్తున్న డిఎస్పీ జయరామ సుబ్బారెడ్డి 

సాక్షి, చీరాల రూరల్‌: పాత సామాన్లకు ఉల్లిపాయలు ఇస్తామని గ్రామాల్లో సంచరిస్తూ ఉదయం సమయాల్లో రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు చోరీకి పాల్పడే ఆరుగురు సభ్యుల ముఠాను చీరాల టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5.40 లక్షల విలువైన సామాగ్రితో పాటు దొంగతనాలకు ఉపయోగించిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వై జయరామ సుబ్బారెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు.  

నిందితులంతా చీరాల వాసులే...
చీరాలలోని రామకృష్ణాపురం పంచాయతీ బండపాలెం కుందేరు ఒడ్డున నివాసముండే కత్తుల సుందరరావు, జంగాలపల్లి తిరుపతయ్య, పసుపులేటి కృష్ణ, పసుపులేటి బ్రహ్మయ్య, పసుపులేటి బాషా అలియాస్‌ అంజయ్యతో పాటు వీరికి సహాయ కారిగా ఉండే మరో మైనర్‌ బాలుడు కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. వీరు తిరిగేందుకు ఓ ఆటో ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా ఉదయం సమయంలో గ్రామాల్లో పాత సామాన్లకు ఉల్లిపాయలు ఇస్తామంటూ తిరుగుతుంటారు. మధ్యాహ్న సమయంలో భోజనాలు చేసేందుకని ఆయా గ్రామాలకు సమీపంలో ఉండే పొలాలకు వెళుతుంటారు. ఈ క్రమంలో పొలాల్లో ఎక్కడెక్కడ విద్యుత్‌ మోటార్లు ఉన్నాయి, ట్రాన్స్‌ఫార్మర్లున్నాయనే విషయాలను రెక్కీ నిర్వహించేవారు. ఇక రాత్రిళ్లు వారు ఎంచుకున్న గ్రామ పొలాల్లోకి ఆటోతో సహా వెళ్లి విద్యుత్‌ మోటార్లు, విద్యుత్‌ ట్రాన్స్‌పార్మర్లలోని రాగి సామాగ్రిని దొంగిలించి ఆటోలో వేసుకుని పరారయ్యేవారు. అలా దొంగిలించిన వస్తువులను విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తుంటారు. 

నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న దొంగతనాలకు ఉపయోగించిన ఆటో   
రివార్డులు అందజేసిన డీఎస్పీ...
కేసులను ఎంతో చాకచక్యంగా చేధించిన టూటౌన్‌ సీఐ ఎండి. ఫిరోజ్, ఎస్సై విజయ్‌ కుమార్, కానిస్టేబుళ్లు మహేష్, ఆంజనేయులు, రామ కోటేశ్వరరావులను డీఎస్పీ అభినందించారు. కేసులను చేధించిన వారందరికి డీఎస్పీ చేతులు మీదుగా రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోకి కొత్తగా ఎవరైనా వ్యక్తులు వస్తే వారు అనుమానస్పందంగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. 

ఏడాది కాలంగా ఎన్నో..
గత సంవత్సర కాలంగా చీరాల, ఈపురుపాలెం, వేటపాలెం, పర్చూరు, ఇంకొల్లు, చిన్నగంజాం, జె.పంగులూరు గ్రామాల్లోని పొలాల్లో విద్యుత్‌ మోటార్లు అపహరణకు గురయ్యాయి. అలానే విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని రాగి వైర్లను కూడా అపహరిస్తున్నారు. వీటిపై ఆయా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కానీ ఆయా కేసులకు సంబంధించిన దర్యాప్తు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వీటికి సంబంధించి ఆయా పోలీస్‌స్టేషన్‌లలో 26 కేసులు నమోదయ్యాయి.  అయితే దొంగతనాల విషయంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ వై. జయరామ సుబ్బారెడ్డి దృష్టి సారించారు. టూటౌన్‌ సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్సై విజయ్‌కుమార్‌తో రెండు దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. సీఐ ఆధ్వర్యంలో ఏర్పడిన బృందాలు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఓ ఆటోలో ఓ మైనర్‌ బాలుడితో సహా ఐదుగురు వ్యక్తులు ఇనుప సామగ్రితో వస్తున్నారనే సమాచారంతో సీఐ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. దీంతో ఆటోతో సహా నిందితులను బాపట్ల–ఒంగోలు జాతీయ రహదారిపై చీరాల వాడరేవు హాయ్‌ రెస్టారెంట్‌ సమీపంలో అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న విద్యుత్‌ మోటార్లు, సుమారు రూ. 5.40 లక్షలు విలువైన ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా చీరాలలోని రామకృష్ణాపురం పంచాయతీ బండపాలెం కుందేరు ఒడ్డున నివాసముండే వారిగా గుర్తించి అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement