వీడిన రామలక్ష్మి హత్య మిస్టరీ

Rama Laxmi Murder Mystery Solved  - Sakshi

చేతబడి అనుమానమే ప్రాణం తీసింది

తల్లిని చంపించేందుకు సహకరించిన కూతురు

హంతకులను మీడియా ముందు ప్రవేశపెట్టిన బొబ్బిలి డీఎస్పీ

గరివిడి: మండలంలోని కొండలక్ష్మీపురంలో ఈ నెల 5వ తేదీన జరిగిన గొర్లె రామలక్ష్మి(65) హత్య కేసు మిస్టరీ వీడింది. పట్టుబడిన నిందితులను బొబ్బిలి డీఎస్పీ పి.సౌమ్యలత ఆధ్యర్యంలో గరివిడి ఎస్సై శ్రీనివాస్‌ బుధవారం మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ  సౌమ్యలత అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రామలక్ష్మికి చేతబడి ఉందన్న అనుమానంతో హంతకులు పథకం ప్రకారం హతమార్చారు. గతంలో గ్రామంలో ఉన్న చిన్నారులు, పెద్దలు, పశువులు అనారోగ్యం పాలవుతుండటానికి ప్రధాన కారణం రామలక్ష్మి చేతబడేనని నిందితుల నమ్మకం. ముఖ్యంగా హత్యకు వారం ముందు వట్టిగళ్ల ఆదినారాయణకు చెందిన ఆవు మృతి చెందింది.

తన ఆవు చనిపోవడానికి రామలకే‡్ష్మ కారణమని భావించిన ఆదినారాయణ ఆమెను అంతమొందించడానికి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆమె కుమార్తె తాడ్డి పెంటమ్మతో చర్చించాడు.  దీంతో పెంటమ్మ తన తల్లికి చిల్లంగి, చేతబడి ఉందని అనుమానం ఉంటే పల్లు పీకేయమని, లేదంటే ఇళ్ల చుట్టూ కొయ్యలు పాతిపెట్టమని సలహాఇచ్చింది.

అయితే ఆ విషయాలకు సంతృప్తి చెందని ఆదినారాయణ ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించాడు. అలాగే రామలక్ష్మి పేరిట బ్యాంకు ఖాతాలో రూ.90 వేలు ఉన్నట్లు కుమార్తె పెంటమ్మ తెలుసుకుంది. తల్లిని చంపేస్తే ఆ పైకం తనకే చెందుతుందన్న దురాశతో ఆదినారాయణతో చేతులు కలిపింది.

 దీంతో వీరిద్దరూ ఆదినారాయణ కుమారుడు వట్టిగల్ల జయరాజు, దాసరి సతీష్‌ల సహకారం తీసుకున్నారు. అదే గ్రామానికి చెందిన ఆవాల దేముడురాజుకు రూ. 50 వేలు ఇస్తామని ఆశ చూపించి రెండు రోజుల్లో రామలక్ష్మిని చంపేయాలని కోరారు.

దీంతో ఈ నెల 5వ తేదీన గ్రామంలో తన తోటలో మొక్కలకు నీళ్లు పోస్తున్న రామలక్ష్మిని దేముడురాజు  పీక కోసి హత్య చేశాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని సంఘటనా స్థలానికి 500 మీటర్ల దూరంలో ఉన్న తాటిచెట్ల పొదల్లో దాచేశాడు. అనంతరం రామలక్ష్మి శవాన్ని కుమార్తె పెంటమ్మ తన భుజాలపై వేసుకొని ఇంటికి తీసుకొచ్చింది.

ఇదిలా ఉంటే రామలక్ష్మి మృతిపై అనుమానాలున్న పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టడంతో నిందితులు పట్టుబడ్డారు. కార్యక్రమంలో చీపురుపల్లి సీఐ సీహెచ్‌. శ్యామలరావు, ఎస్సై శ్రీనివాస్‌ ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top