కడుపునొప్పిగా ఉందంటూ పర్సు చోరీ  | Purse Theft | Sakshi
Sakshi News home page

కడుపునొప్పిగా ఉందంటూ పర్సు చోరీ 

May 17 2018 11:04 AM | Updated on Sep 2 2018 4:52 PM

Purse Theft - Sakshi

టెక్కలి రూరల్‌ శ్రీకాకుళం : కడుపు నొప్పిగా ఉందని మాయమాటలు చెప్పి పర్సు చోరీ చేసిన ఘటన బుధవారం అక్కవరం జంక్షన్‌లో చోటుచేసుకుంది. లింగాలవలసకు చెందిన రోణంకి శ్రీరామ్మూర్తి దండుగోపాలపురంలో పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. బుధవారం తన విధులు ముగించుకుని బైకుపై తిరిగి వస్తుండగా అక్కవరం జంక్షన్‌ సమీపంలో ఓ వ్యక్తి బండి ఆపాడు.

‘సార్‌.. మీరు డాక్టర్‌ కదా.. నాకు కడుపులో నొప్పిగా ఉంది.. కొంచెం ట్రీట్‌మెంట్‌ చేయండి..’ అని అడిగాడు. అందుకు శ్రీరామ్మూర్తి స్పందిస్తూ తాను పశువైద్యాధికారినని.. టెక్కలి వెళ్లి మంచి వైద్యునికి చూపించు అని సలహాఇచ్చారు. సదరు వ్యక్తి ‘అలాగే సార్‌.. అని చెబుతూ శ్రీరామ్మూర్తి వద్దకు వెళ్లి తనకు ఎక్కడ నొప్పి వస్తుందో చేతితో తాకుతూ చెప్పి తిరిగి వెళ్లిపోయాడు.

శ్రీరామ్మూర్తి ఇంటికి వచ్చి చూసేసరికి పర్సు పోయిందని గ్రహించి, కొద్దిసేపటి కింద తనను కలిసిన వ్యక్తిపైనే అనుమానం ఉందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పర్సులో రూ.3800 నగదుతో పాటు రూ.2లక్షల 16వేల చెక్, ఆధార్‌ కార్డు, గుర్తింపు కార్డు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement